ఆర్థిక సంక్షోభంలో భారత్
తయారీ రంగం బలహీనం, విద్యావ్యవస్థలో లోపాలు
అమెరికా గడ్డపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, నవంబర్ 18: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) అమెరికా గడ్డపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పయనిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం తీవ్రంగా ఉందని, ఆర్థిక వ్యవస్థలో కీలకమైన తయారీ రంగం బలహీనపడుతోందని, విద్యా వ్యవస్థలోనూ అనేక లోపాలు ఉన్నాయని విమర్శించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు భారత్లో రాజకీయ దుమారం రేపుతున్నాయి.
భారత ఆర్థిక నమూనా పదేళ్ల క్రితమే ఆశించిన ఫలితాలు ఇవ్వడం ఆపేసిందన్నారు. ఈ పరిస్థితిని కొందరు గుర్తించకపోవచ్చని, మీడియా కూడా అసలు సమస్యలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక విధానాల్లో మార్పులు తీసుకురాకుంటే భవిష్యత్తులో దేశం మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశంలో సంపద, వ్యాపార అవకాశాలు అదానీ, అంబానీ వంటి కొద్ది మంది చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, ‘మీరు నాతో పోటీ పడాలంటే 4,000 కిలోమీటర్లు నడవాలని రాహుల్ అన్నారు.
దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు: బీజేపీ
దేశ ప్రతిష్టను విదేశీ గడ్డపై దెబ్బతీసేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో రాహుల్ ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నది. దేశంలో సమస్యలుంటే ప్రజాస్వామ్య బద్ధంగా చర్చించవచ్చని, రాహుల్ గతంలోనూ విదేశాల్లో రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని విమర్శించింది.