కేఫ్‌లో అర్ధరాత్రి పార్టీ.. సహోద్యోగినిపై అత్యాచారం

25-11-2026 | 06:45am

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళపై అఘాయిత్యం కలకలం రేపింది. 22 ఏళ్ల యువతిపై ఇద్దరు సహోద్యోగులు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో మరో నలుగురు కూడా సహకరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఎనిమిది మంది సహోద్యోగులు ఓ కేఫ్‌లో సమావేశమయ్యారు.

రాత్రి 11.30 గంటలకే కేఫ్ మూసివేసినప్పటికీ, అక్కడ పనిచేసే వ్యక్తి వద్ద తాళం చెవి ఉండటంతో తిరిగి తెరిచి పార్టీ చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో మద్యం సేవిస్తూ అర్ధరాత్రి వరకు గడిపినట్లు సమాచారం. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అక్కడి నుంచి బయటకు వచ్చిన అనంతరం ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని యువతి ఆరోపించింది.

మిగిలిన సహోద్యోగులు కూడా ఈ ఘటనకు సహకరించారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు కలిపి మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు