ఫామ్-6ను మార్చలేదు

27-10-2026 | 05:25am

సవరించే అధికారం కేవలం కేంద్రానిదే 

సుప్రీంకోర్టులో ఈసీ అఫిడవిట్

‘సర్’ డిక్లరేషన్.. ప్రత్యేక పత్రం 

దానికి, ఫామ్-6కు సంబంధమే లేదు 

కమిషన్‌లో నిర్ణయాలన్నీ ఏకగ్రీవమని వెల్లడి

ఇండీ కూటమి సహా పలువురి పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ?

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ‘సర్’ ప్రక్రియలో(‘Sir’ Process) తీవ్ర దుమారానికి దారితీసిన ఫామ్-6పై కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) స్పందించింది. ఆ ఫామ్‌లో తాము ఎలాంటి మార్పులు చేయలేదని, ఆ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉందని స్పష్టం చేసింది. ‘సర్’ డిక్లరేషన్ అనేది ఒక ప్రత్యేక పత్రమని.. దానికీ, సవరణకు ఎలాంటి సంబంధం లేదని, ఫామ్ 6లో అది భాగం కాదని తెలిపింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో(Supreme Court) 15 పాయింట్లతో ఈసీ అఫిడవిట్‌ను(EC Affidavit) దాఖలు చేసింది.

ఇండీ కూటమి సహా పలువురు వేసిన పిటిషన్లను ఇటీవల విచారించిన న్యాయస్థానం.. వివరణ ఇవ్వాలంటూ ఈసీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టే అవకాశం ఉండటంతో ఎన్నికల సంఘం అఫిడవిట్‌ను సమర్పించింది. న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లన్నీ ఒక వార్తపై ఆధారపడి ఉన్నాయని.. వాటికి ఆధారాలు లేవని, కొట్టేయాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. 

అన్నీ ఏకగ్రీవమే

‘సర్’ విషయంలో సీఈసీ జ్ఞానేశ్

కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనేది అవాస్తవమని.. అన్ని నిర్ణయాలు సీఈసీతోపాటు ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా తీసుకున్నారని ఈసీ తెలిపింది. 2025 జూన్ 24, అక్టోబర్ 27, 2026 మే 14 తేదీల్లో జారీ చేసిన మూడు ‘సర్’ ఉత్తర్వులూ ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ నిర్ణయాల ఆధారంగానే బయటకు వచ్చాయని అఫిడవిట్‌లో పొందుపరిచింది. సాధారణంగా ఏదైనా ఫైల్ మొదట ఒక ఎన్నికల కమిషనర్‌కు, ఆ తర్వాత మరో కమిషనర్‌కు, చివరగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వెళ్తుందని ఈసీ తెలిపింది. అత్యవసరమైతే ఎలక్ట్రానిక్ విధానంలోకి వెళ్తారని పేర్కొంది. 2023 నాటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం - పదవీకాలం చట్టంలోని 18ను ఈసీ ప్రస్తావిస్తూ.. తమ అధికార పరిధిని దాటి ఆదేశాలు జారీ చేసినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. 

పక్కపక్కన ఉండటంతో 

మార్చినట్లు భావించారు

ఓటర్లుగా నమోదుచేసుకునేందుకు ఉపయోగించే ఫామ్-6లో తాము ఎలాంటి మార్పులు చేయలేదని.. అయితే ఆన్‌లైన్‌లో ఫామ్-6తోపాటు ‘సర్’ అదనపు డిక్లరేషన్ పక్కపక్కనే ఉండటంతో మార్చినట్లుగా భావించే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. ఇలాంటి భావం ఏర్పడే అవకాశం ఉండటంతోనే.. అక్టోబర్ 21 నుంచి ఫామ్-6, డిక్లరేషన్ వేర్వేరుగా ఉంచామని వెల్లడించింది. ఫిజికల్ ఫామ్‌లో ఇప్పటికే ఈ రెండూ వేర్వేరుగానే ఉన్నాయని వివరించింది. సర్ డిక్లరేషన్ అనేది స్పెషల్ డాక్యుమెంటేషన్ అని, దానికి ఫామ్-6కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఓటర్ల నమోదు నిబంధనలు-1960 ప్రకారం ఫామ్-6ను సవరించే అధికారం కేంద్రానికే ఉందని.. సర్ డిక్లరేషన్‌ను చట్టబద్ధమైన ఫామ్ -6లో చేర్చలేదని వివరించింది. 

అలాంటి ఓటర్ల దగ్గరికీ వెళ్తున్నాం

‘సర్’ సందర్భంగా ఓటర్ల వివరాలు సరిగ్గా లేకపోయినా వారిని విచారణకు హాజరుకావాలనికోరడం లేదని.. వాళ్ల ఇంటికి  కూడా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) వెళ్లి అవసరమైన పత్రాలు తీసుకుంటారని ఈసీ తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అలాంటి ఓటర్లను విచారణకు పిలుస్తామని పేర్కొంది. అది కూడా వీలైనంత వరకు ఆన్‌లైన్‌లోనే చేపడుతున్నామని స్పష్టం చేసింది. ఈసీనెట్ భద్రతపై నిపుణుల కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని వివరించింది. ఈ కమిటీలో ఐఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిపుణులు ఉంటారని తెలిపింది.  ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడం లేదా తొలగించడం అనేది ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో) ఉత్తర్వులు లేకుండా జరగదని తేల్చిచెప్పింది. 

విధులకు ఆటంకం కలిగించే కుట్ర

సీఈసీ విధులకు ఆటంకం కలిగించాలన్న ఉద్దేశంతోనే పిటిషన్లు దాఖలయ్యాయని, వాటిని కొట్టివేయాలని సుప్రీంకోర్టును ఈసీ అభ్యర్థించింది. ఈవీఎంలపై గతంలోనే అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పులు వెలువరించిందని, ఆ అంశాలనూ పరిశీలించాలని పేర్కొంది. దసరా సెలవుల కారణంగా ప్రస్తుతానికి సంక్షిప్త సమాధానాన్ని మాత్రమే అఫిడవిట్‌లో పొందుపరుస్తున్నామని.. పిటిషన్లలోని ప్రతి అంశాన్ని విడివిడిగా సమగ్రంగా విరించేందుకు సమయం ఇవ్వాలని ఈసీ కోరింది.

మరిన్ని వార్తలు