ఏఈఈ పరీక్ష వాయిదా వేయాలి
- నవంబర్ 6న కాకుండా మరో తేదీన నిర్వహించాలి
- నిరుద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలి
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): నవంబర్ 6న జరగాల్సిన టీజీపీఎస్సీ ఆర్‌అండ్ బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(TGPSC R&B Assistant Executive Engineer) (ఏఈఈ) పరీక్షను వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అదే రోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్(SSC Junior Engineer) (జేఈ) పరీక్ష కూడా ఉండటంతో 50 వేల మందికి పైగా సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని ఆయన సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఎస్‌ఎస్‌సీ ఇప్పటికే పరీక్ష తేదీని ఖరారు చేసి వెబ్‌సైట్‌లో షెడ్యూల్ విడుదల చేసిందని తెలిపారు.
రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు(Candidates) ఏ పరీక్షకు హాజరుకావాలో నిర్ణయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు మంత్రులు, అధికారులకు విజ్ఞప్తి చేయడంతో పాటు ముఖ్యమంత్రికి కూడా అభ్యర్థులు తమ సమస్యను తెలియజేశారని, అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించకపోతే అభ్యర్థులు విలువైన ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.