గ్రాడ్యుయేట్ ఓటు నమోదుపై ఈసీ నిర్లక్ష్యం
- బీఎల్వోలను నియమించలేదు
- మాజీ మంత్రి తలసాని
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై(Graduate Voter Registration) ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం చూపుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు బాధ్యత పూర్తిగా ఎన్నికల కమిషన్‌పైనే ఉందన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో జరుగుతున్న తప్పిదాలపై తలసాని నేతత్వంలోని బీఆర్ఎస్(BRS) ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్ర సీఈఓ సుదర్శన్ రెడ్డికి(CEO Sudarshan Reddy) వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ, ఎన్నికల కమిషన్ బాధ్యతగా వ్యవహరించడం లేదని విమర్శించారు. నవంబర్ 6తో ఓటరు నమోదు గడువు ముగియనున్నప్పటికీ, ఇప్పటివరకు కనీసం బూత్ స్థాయి అధికారులను (బీఎల్ఓలు) నియమించలేదని, ప్రజల్లో అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించలేదని ఆరోపించారు.
సర్ కార్యక్రమం ద్వారా లక్షలాది ఓట్లు తొలగించిన ఎన్నికల కమిషన్, గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.