కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా!

27-10-2026 | 05:25am

నవంబర్‌లో నిర్వహించే అవకాశం

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి) : కృష్ణానది యాజమాన్య బోర్డు(Krishna River Management Board) (కేఆర్‌ఎంబీ) కీలక సమావేశం మరోసారి వాయిదా పడింది. మంగళవారం నిర్వహించాల్సిన సమావేశాన్ని బోర్డు వాయిదా వేసింది. తిరిగి నవంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఏ రోజు అనేది స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల(Telangana and Andhra Pradesh states) మధ్య కృష్ణా జలాల(Krishna waters) వినియోగం, నీటి పంపిణీ, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించాల్సి ఉంది.

కృష్ణా జలాల వివాదాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అయితే, సమావేశం వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సమావేశాన్ని వాయిదా వేసినట్లు గతంలో సమాచారం వెలువడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు తెలిసింది.

తాజాగా మంగళవారం జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడటంతో తదుపరి భేటీ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వాటాలపై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాల పరిష్కారానికి కేఆర్‌ఎంబీ సమావేశాలు కీలకంగా మారాయి. అయితే, సమావేశం వాయిదాకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి తేదీపై బోర్డు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు