రేవంత్‌రెడ్డికి ‘మెడికవర్’పైనే శ్రద్ధ
- ఎన్హెచ్ఎం ఉద్యోగులను రోడ్డుకు లాగారు
- కేసీఆర్‌లా ఎందుకు ఆదుకోవడం లేదు
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి) : ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి(Revanth Reddy) మెడికవర్ హాస్పిటల్స్‌ను(Medicover Hospitals) కాపాడడం మీద ఉన్న శ్రద్ధ ఎన్హెచ్ఎం ఉద్యోగులను కాపాడడం మీద లేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(R.S. Praveen Kumar) ఆరోపించారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్యోగులు గత 14 రోజులుగా సమ్మె చేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరోనా సమయంలో(Corona times) ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడిన ఎన్హెచ్ఎం ఉద్యోగులను(NHM employees) కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని విమర్శించారు.
సోమవారం ఇందిరాపార్క్ వద్ద ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె శిబిరాన్ని ఆర్ఎస్పీ సందర్శించారు. వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేసీ ఆర్ 2018లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల జీతాలు పెంచి ఆదుకున్నారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం పిలిపించి మాట్లాడడం లేదని విమర్శించారు. సీఎం, మంత్రులు వారి కుటుంబాల కోసం ప్రత్యేక డాక్టర్లను నియమించుకొని, ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్యోగులను గాలికొదిలేశారని ఆరోపించారు.
ఇతర ప్రభుత్వ శాఖలో పురుషులకు కూడా సెలవులు ఇస్తున్నారు, ప్రైవేట్ సంస్థలు కూడా ప్రసూతి సెలవులు ఇస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు అమలు కాకపోవడం దారుణం. ఉద్యోగ భద్రత లేదు, పే స్కేల్ లేదు, ఎంప్లాయ్ హెల్త్ స్కీం అమలవడం లేదని, 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో కేవలం వంద కోట్లు కేటాయిస్తే ఈ సమస్యలు తీరిపోతాయని, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
17వేల మంది ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగులు విదేశాల్లో పర్యటిస్తున్నారని, కానీ మన దేశంలోని హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ఎన్హెచ్ఎం ఉద్యోగులను ఎలా రెగ్యులరైజ్ చేశారో పరిశీలించాలని, ఆ రాష్ట్రాల మాదిరిగా ఇక్కడి ఉద్యోగులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.
కోసినా రూపాయి లేదంటూనే రూ.4 వేల కోట్లతో ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీకి 8 లైన్ల రోడ్డు వేస్తున్నారని, కార్మిక సంక్షేమ శాఖలో సుమారు 150 కోట్లు దోచుకున్నారని, బోధి పెవిలియన్‌లో 200 కోట్లు ఖర్చు చేసి నివాస భవనం, మంత్రులు బాత్రూంలు నిర్మించుకోవడానికి కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
ఉద్యోగుల కోసం కనీసం 100 కోట్లు ఖర్చు చేయడం ప్రభుత్వానికి చేత కావడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం, త్వరలో సీఎంకు లేఖ రాస్తాం, రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా అడ్డుకోకపోతే అసెంబ్లీలో మీ సమస్యలపై గళం వినిపిస్తామన్నారు.