మహారాష్ట్ర సానుకూలం
తుమ్మిడిహట్టిపై గుడ్‌న్యూస్
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో చర్చలు జరిపిన సీఎం రేవంత్‌రెడ్డి
152 మీటర్ల బరాజ్ నిర్మాణంపై ముంబైలో కీలక సమావేశం
- 148 మీటర్ల ఒప్పందాన్ని పున:పరిశీలించేందుకు సిద్ధమన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్
- తమ ప్రజలకు ప్రతికూల ప్రభావం లేకపోతే ముందుకు వెళ్తామని స్పష్టీకరణ
- అధ్యయనానికి అధికారుల కమిటీ వేయాలని నిర్ణయం
- ముంపు భూములకు పరిహారం చెల్లిస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
- ఆదిలాబాద్ ఆదివాసీ, గిరిజనుల దప్పిక తీరుద్దామని వినతి
- 152 మీటర్ల ఎత్తు ఉంటేనే గ్రావిటీ ద్వారా నీటి తరలింపు
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అక్టోబర్ 26 (విజయక్రాంతి): తుమ్మిడిహట్టి బరాజ్(Thummidihatti Barrage) ఎత్తును 152 మీటర్లుగా పెంచాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్రకు(Maharashtra), అక్కడ ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోతే గతంలో ఉన్న 148 మీటర్ల ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ నీటి అవసరాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంపై చర్చించేందుకు సోమవారం ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంపై కీలక చర్చలు జరిగాయి.
తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించిన ఫడ్నవీస్.. బరాజ్ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, సాంకేతిక అంశాలపై అధ్యయనం వంటివాటి కార్యాచరణకు రోడ్ మ్యాప్ ప్రస్తావించారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర సీఎం తెలిపారు. స్నేహభావం, సోదరభావంతో మంచి పొ రుగు రాష్ట్రాలుగా ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఇతర రాష్ట్రాలతో మహారాష్ట్ర పలు అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుందని ఆయన గుర్తుచేశారు.
పరస్పర చర్చలు, సహకారంతో ఆయా సమస్యలకు పరిష్కారం కనుగొన్నామని వివరించారు. దేశంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరువురు ముఖ్యమంత్రులు పునరుద్ఘాటించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. గిరిజనులు, ఆదివాసీలు, అభివృద్ధి అవకాశాలు అందని వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
ఆదిలాబాద్ ఆదివాసీలు తాగునీటికి ఎదురు చూస్తున్నారు: రేవంత్‌రెడ్డి
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చల సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పూర్వ హైదరాబాద్ సంస్థానం నుంచి తెలంగాణ-, మహారాష్ట్రల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. కుమ్రం భీం సాగించిన జల్, జంగిల్, జమీన్ పోరాట కాలం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు, ఆదివాసీలు సాగు, తాగునీటి సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంతోపాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేయవచ్చని ఆయన వివరించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం కలిగిన ప్రాంతమైనప్పటికీ అభివృద్ధిలో వెనుకబడిందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన కోరారు. దశాబ్దాలుగా ఆదిలాబాద్ ఆదివాసీ, గిరిజనుల ఆకాంక్షలు నెరవేరలేదని.. వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు.
ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం అందుబాటులోకి వస్తే తెలంగాణతోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకూ ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
తుమ్మిడిహట్టి బరాజ్‌ను కేవలం సాగునీటి ప్రాజెక్టుగా కాకుండా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే వారధిగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముంపునకు గురయ్యే భూములకు పరిహారం ఇచ్చేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని, ప్రజల దాహార్తిని తీర్చేందుకు కలిసి కట్టుగా ముందుకు సాగుదామన్నారు.
అధ్యయనానికి కమిటీ: ఫడ్నవీస్
తుమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంపు ప్రతిపాదనపై అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుందామని మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రకు, అక్కడి ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదన్నదే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తెలంగాణ నీటి అవసరాలకు సహకరించేందుకు తమకు అభ్యంతరం లేదని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీని ఏర్పాటు చేసి.. బరాజ్ ఎత్తు, నీటి లభ్యత, ముంపునకు గురయ్యే భూముల విస్తీర్ణం, ప్రభావిత ప్రాంతాలు, పరిహారం తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఇరు రాష్ట్రాల అంచనాలను పరిశీలించి, అవసరమైతే ప్రత్యామ్నాయాలపైనా అధ్యయనం చేయాలని సూచించారు.
ఈ ప్రక్రియలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తన పరిధిలో అవసరమైన సాంకేతిక పరిశీలనలు, అధ్యయనాలు చేపడుతుందని తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులు పరస్పరం సంప్రదింపులు జరిపి తదుపరి సమావేశాలు, కాలపరిమితులు నిర్ణయించుకోవాలని ఫడ్నవీస్ సూచించారు. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.
గ్రావిటీ ద్వారా నీటి తరలింపునకే 152 మీటర్ల ఎత్తు: ఉత్తమ్
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తుమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు 152 మీటర్ల ప్రతిపాదన వెనుక ఉన్న కారణాలను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ద్వారా వివరించారు. ప్రస్తుత విద్యుత్ అవసరాలు, పర్యావరణ పరిరక్షణ,నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి గ్రావిటీ ద్వారా నీటిని తరలించడమే సరైన మార్గమని, అందుకే బరాజ్‌ను 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడం అవసరమని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు ఆ రాష్ట్రంలో ఉన్న భూసేకరణ నిబంధనలు, పరిహార విధానం ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం పూర్తి పరిహారం చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, గిరిజనుల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటుతనాన్ని మహారాష్ట్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిపోయిందని తెలిపారు.
గిరిజనులు, ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. ఆర్థిక అవకాశాలు లేకపోవడం, వెనుకబాటుతనం కారణంగా గతంలో నక్సలిజం వంటి సమస్యలు తలెత్తిన పరిస్థితులను వివరించారు. ఆ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు 1975 అక్టోబర్ 6న అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, నాటి మహారాష్ట్ర సీఎం ఎస్బి చవాన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి.. వివిధ దశల్లో ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఐదు దశాబ్దాలుగా అనేక ప్రతిపాదనలు, చర్చలు జరిగాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ఆశించిన పురోగతి సాధించలేదని తెలిపారు.
గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
హైదరాబాద్ ప్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు హాజరుకావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొనాలని కోరారు. ఈ ఆహ్వానంపై ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించా రు. హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.
మా అమ్మమ్మదీ తెలుగే: ఫడ్నవీస్
తెలంగాణతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్ గుర్తుచేశారు. సరిహద్దులోని ఆదిలాబాద్ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తన అమ్మమ్మ తెలుగు మాట్లాడుతారని ఆయన తెలిపారు. స్నేహభావం, సోదరభావంతో పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఇతర రాష్ట్రాలతో మహారాష్ట్ర పలు అంతర్రాష్ట్ర సమస్యలను చర్చలు, సహకారం ద్వారా పరిష్కరించుకుందని పేర్కొన్నారు.
థాంక్యూ ఫడ్నవీస్ జీ
సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో తుమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెం పుపై చర్చలు సఫలం అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రతిపాదనలను పెద్ద మనసుతో పరిశీలించిన ఫడ్నవీస్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. సాంకేతికత, ముంపు అంశాలపై అధ్యయనానికి అధికారులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. గిరిజనుల జీవితాల మార్పునకు సహకరిస్తామని ఫడ్నవీస్ హామీ ఇచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
చర్చల తర్వాతే ఫైనల్
సీఎం ఫడ్నవీస్ ట్వీట్
‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు తుమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంపు అంశాన్ని మహారాష్ట్ర స్వ తంత్రంగా పరిశీలిస్తుంది. ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో కూడిన ఒక సంయుక్త కమిటీ.. సాంకేతిక అంశాలను, మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై అధ్యయనం చేస్తుంది’ అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతూనే.. తెలంగాణకు మద్దతునిస్తామని పేర్కొన్నారు.
ఈ విధానం నిర్మాణాత్మకంగా, సహకారంతో కూడుకున్నదిగా ఉంటుందని తెలిపారు. ‘మహారాష్ట్ర ప్రయోజనాలు ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం. తెలంగాణకు మద్దతు ఇవ్వడానికీ మహారాష్ట్ర సిద్ధంగా ఉంది. వాస్తవ ముంపు ప్రాంతం మునుపటి అంచనాలను మించి ఉన్నట్లు తేలడంతో, కొత్త ప్రతిపాదనపై సమగ్ర అంచనా వేయడం అత్యవసరం.
ప్రతిపాదిత స్థల మార్పు వల్ల ముంపు, సంబంధిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, అదనపు భూమి అవసరాలపై కలిగే ప్రభావాన్ని కమిటీ అధ్యయనం చేస్తుంది. నీటి కేటాయింపు, చట్టబద్ధమైన అనుమతులకు సంబంధించిన విషయాలు కేంద్ర జల సంఘం పరిధిలోకి వస్తాయి. కోరినప్పుడు మహారాష్ట్ర తన వాస్తవ ఆధారిత అంచనాను సమర్పిస్తుంది. స్వతంత్ర అధ్యయనం, సాంకేతిక చర్చల తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.