మనం సాధిస్తాం

08-10-2026 | 05:40am

మోదీ పవర్ @ 25 ఏళ్లు

  1. వికసిత భారత్‌తో పాటు ఐదు భారీ లక్ష్యాలను 2047 నాటికి చేరుతాం
  2. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దేశం కీరోల్‌గా నిలుస్తుంది
  3. స్వయం సమృద్ధినీ చేరుకుంటాం
  4. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ దేశంగా ఎదుగుతాం
  5. అంతరిక్షంలోకి మానవసహిత యాత్రను చేసిచూపుతాం
  6. నాకు ప్రజలే దేవుళ్లు.. బీజేపీ కార్యకర్తలే నా బలం : ప్రధాని మోదీ
  7. ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి.. ఢిల్లీలో భారీ సభ

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ‘మనం సాధిస్తాం’ అనే సరికొత్త నినాదాన్ని ఇచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంతోపాటు పలు లక్ష్యాలను పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్‌తో(Viksit Bharat) పాటు, మోదీ ఐదు ప్రధాన లక్ష్యాలను వెల్లడించారు. ఇందులో ఒకటి ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో(Economy) ఒకటిగా భారత్‌ను నిలపడం, రెండోది ఆత్మనిర్భర్ భారత్(Atmanirbhar Bharat) (స్వయం సమృద్ధి) సాధించడం, మూడోది భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా (గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్) తీర్చిదిద్దడం, నాలు గోది ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం, ఐదోది అంతరిక్షంలోకి మానవసహి త యాత్రను చేపట్టడం ఉన్నాయి.

‘నాకు ప్రజలే దేవుళ్లు.. బీజేపీ కార్యకర్తలే నా బలం. నన్ను 25 ఏళ్లుగా నాపై నమ్మకం ఉంచిన భారత ప్రజలకు నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను’ అని మోదీ అన్నారు. దేశ ప్రజలందరి కోసం వినాయకుడిని ప్రార్థించాను. ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తి ఇవ్వాలని కోరుకున్నానని తెలిపా రు. ప్రభుత్వ అధినేతగా మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వికసిత్ భారత్ సంకల్ప సభ జరిగింది. ఇందులో ప్రధాని మోదీ ప్రసంగించారు.

ఈ సందర్భంగా దేశం ముందు ఐదు భారీ లక్ష్యాలను ఉంచి, వాటిని సాధించి తీరాలని పిలుపునిచ్చారు. 25 సంవత్సరాల క్రితం మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా(Chief Minister of Gujarat) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 2001 అక్టోబర్ 7న, కేశుభాయ్ పటేల్ తర్వాత రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఒకప్పుడు అసాధ్యమైనవి ఇప్పుడు సాధ్యమయ్యాయని మోదీ అన్నారు. ‘అభివృద్ధి చెందిన భారత్ కోసం 2026లో మనం కంటున్న కల కచ్చితంగా నిజమవుతుంది. భారత్ ఇప్పుడు ఆగిపోవడానికి ఎలాంటి కారణం లేదు.

వంద ఏళ్ల క్రితం మన జనాభా 40 కోట్లకు తక్కువగా ఉండేది. నేడు మనం 140 కోట్లకు పైగా ఉన్నాం. 140 కోట్ల మంది పౌరులు కలిసి 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మిస్తారు, మనం కచ్చితంగా దాన్ని సాధిస్తాం’ అని ఆయన అన్నారు. అయితే, ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం రాజకీయ విభజన దేశానికి అతిపెద్ద అడ్డంకులలో ఒకటిగా మిగిలిపోయిందని ప్రధాని హెచ్చరించారు. కష్టాలు వచ్చినప్పుడు అవి ఏ వివక్ష లేకుండా ప్రతి వర్గాన్ని, కులాన్ని ప్రభావితం చేస్తాయని ఆయన పౌరులకు గుర్తు చేశారు.

కేవలం ఒక దశాబ్ద కాలంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడగలరని ఎవరు ఊహించి ఉంటారని మోదీ ప్రశ్నించారు. కానీ భారత్ దానిని సాధ్యం చేసి చూపించిందని స్పష్టం చేశారు. ‘అందుకే 140 కోట్ల మంది భారతీయుల శక్తి సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. 25 ఏళ్ల అనుభవం తర్వాత, భారత్ రూపాంతరం చెందడాన్ని మనం మన కళ్ల ముందే చూస్తున్నామని నేను ధైర్యంగా చెప్పగలను’ అని అన్నారు. ‘2047 నాటికి వికసిత్ భారత్‌ను చేయడం, అగ్రశ్రేణి 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవడం, స్వయం సమృద్ధిని, ప్రపంచ తయారీ కేంద్రం (గ్లోబల్ మాన్యుఫ్యాక్చ రింగ్ హబ్), ఒలింపిక్స్ నిర్వహణను, అంతరిక్షంలోకి అడుగుపెట్టడం మనం సాధిస్తాం.

ఈ శక్తి, ఈ ఉత్సాహం, ఈ ఆత్మవిశ్వాసం అసాధారణమైనవి’ అని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ఒక్కో లక్ష్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, స్టేడియంలోని వేలాది మంది ప్రజలు ‘మనం సాధించగలం’ అంటూ మిన్నంటేలా నినదించారు. ఈ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం అసాధారణమైనవని ప్రధాని ప్రశంసించారు. నేడు ప్రపంచం భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించి మాట్లాడుకుంటోందని, భవిష్యత్తులో ‘మేడ్- ఇన్- ఇండియా’ విమానాల గురించి కూడా ప్రపంచం మాట్లాడుకునే రోజు వస్తుందని ప్రధాని అన్నారు.

గతంలో సంక్షోభాలు తలెత్తినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే దని, కానీ నేడు సంక్షోభ సమయాల్లో భారత్ చూపుతున్న పటిష్ఠత, స్థితిస్థాపకత గురించి ప్రపంచం చర్చించుకుంటోందని మోదీ అన్నారు. ‘ఒకప్పుడు దేశంలో విధానపరమైన స్తబ్దత (పాలసీ పారాలిసిస్) గురించి చర్చ జరిగేది. నేడు సంస్కరణల ఎక్స్‌ప్రెస్ గురించి మాట్లాడుకుం టున్నారు అంటూ అప్పటి యూపీఏ-2 ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం దేశ సామర్థ్యాన్ని తక్కువ చేయడమేనని, అందుకే భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాలన్నీ 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకేనని మోదీ స్పష్టం చేశారు.

నాకు ప్రజలే దేవుళ్లు 

అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, తాను ఈ మైలురాయిని చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని ప్రధాని అన్నారు. ‘ఈ రోజు, ప్రభుత్వ అధినేతగా నా 25 ఏళ్ల నిరంతర సేవా ప్రస్థానం పూర్తయింది. నాపై నమ్మకం ఉంచి న భారత ప్రజలకు నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజు ఉదయం కూడా దేశ ప్రజలందరి కోసం వినాయకుడిని ప్రార్థించాను. ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తి ఇవ్వాలని కోరుకున్నా. రాష్ట్ర ఎన్నికలైనా, సాధారణ ఎన్నికలైనా నన్ను గెలిపించారు. అందుకే నాకు ప్రజలే దేవుళ్లు. కష్టపడి పనిచేసే బీజేపీ కార్యకర్తలే నా బలం. దేశ ప్రజల పాదాలకు నేను భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను’ అని ఆయన అన్నారు.

అలాగే, తన బీజేపీ, ఎన్డీయే సహచరులకు, ప్రజాస్వా మ్యం పట్ల అపారమైన గౌరవం ఉన్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలి పారు. ‘ఈ రోజు, నేను భారతదేశ ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి కూడా కృతజ్ఞతలు. ఈ రోజు నేను ఏ స్థానంలో ఉన్నా, ఏ పద విని నిర్వహిస్తున్నా, దానికి ప్రజలే ప్రధాన కారణం అని తెలిపారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన తన జీవితంలో ఒక భాగంగా మారిందని, అందుకే ఇప్పటికీ తాను ఒక విద్యార్థిగానే భావిస్తూ ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాన ని మోదీ చెప్పారు.

వినాయకుడికి ప్రత్యేక పూజలు 

ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం ఉదయం న్యూఢిల్లీలోని సరోజినీ నగర్‌లో ఉన్న శ్రీ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, దేశానికి అత్యంత అంకితభావంతో సేవ చేస్తానని మరోసారి తన సంకల్పా న్ని స్పష్టం చేశారు. ‘ఈ రోజు న్యూఢిల్లీలోని శ్రీ వినాయక ఆలయంలో పూజలు నిర్వహించి ప్రార్థనలు చేశాను. దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరి సుఖసంతోషాలు, శ్రేయస్సుతోపాటు మంచి ఆరోగ్యం కోసం శ్రీ గణేశుడిని ప్రార్థించాను’ అని మోదీ ‘ఎక్స్’ పోస్ట్ చేశారు. ‘విఘ్నహర్త’ (అడ్డంకులను తొలగించే దేవుడైన గణేశుడు) అనుగ్రహం అందరికీ లభించాలని, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని తాను ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు