రైలులో మంటలు.. నాలుగు బోగీలు దగ్ధం!
పంజాబ్: పట్టాలపై పరుగులు తీస్తున్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పంజాబ్‌లోని రాజ్‌పురా సమీపంలో కర్మభూమి ఎక్స్‌ప్రెస్ (Karmabhoomi Express) రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాలుగు బోగీలకు మంటలు (Fire Accident) వ్యాపించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. బోగీల నుంచి దట్టమైన పొగలు వెలువడటంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
రాజ్‌పురా సమీపంలోని సరాయ్ బంజారా ప్రాంతం వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలులో మంటలు కనిపించగానే అప్రమత్తమైన ప్రయాణికులు బోగీల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో పరిసర ప్రాంతాల్లోనూ ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది (Firefighters), స్థానిక పోలీసులు, రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టడంతో పాటు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ప్రారంభించారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? ఆస్తి నష్టం ఎంత జరిగింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే అధికారులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.