దేశంపై విదేశీ కుట్రలు

22-10-2026 | 05:25am
  1. బంగ్లాదేశ్ తరహాలో ప్రభుత్వ మార్పునకు కుయుక్తులు
  2. విభజనకు దారితీసేలా ఆందోళనలు
  3. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆగ్రహం

నాగ్‌పూర్, అక్టోబర్ 21: దేశంలో అశాంతిని రగిలించేందుకు విదేశీ శక్తు లు కుట్రలు పన్నుతున్నాయని.. బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో ప్రభుత్వ మార్పునకు కుయుక్తులు చేస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్(RSS Chief Mohan Bhagwat) హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ఆందోళనలను ఉపయోగించుకుంటున్నారని, సమాజంలో విభజనకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

భారత్ ఐక్యతను దెబ్బతీసేందుకు, బలహీనపరిచేం దుకే ‘రిజీమ్ ఛేంజ్’ అనే ఆపరేషన్లూ జరుగుతున్నాయని తెలిపారు. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, హిందూ స్ఫూర్తితో ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.

మంగళవారం మహారా ష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవం, విజయదశమి వేడుకల్లో మోహన్ భగవత్ మాట్లాడారు. అశాంతిని రగిలించడం ద్వారా దేశ ఐక్యతను బలహీనపర్చాలని చూస్తున్నారని, ఆందోళనలను అంతర్జాతీయ శక్తులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయని హెచ్చరించారు. 

విభేదాలు పెంచడమే వాళ్ల వ్యూహం.. 

సామాజిక సమస్యలు, పాలనా పరమైన లోపాలపై నిరసనలు సహజమేనని, అయితే.. సమస్యలకు ఆందోళనలు పరిష్కారం చూపేలా ఉండాలని,  కానీ సమాజంలో విద్వేషాలు, విభజనలకు దారితీయకూడదని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఆందోళనలతోనే సమస్యలు పరిష్కారమవుతాయనుకోవడం సరికాదన్నారు.

ఎన్నికల్లో ప్రయోజనం కోసం కొన్నిశక్తులు ఇలాంటి ఆందోళనలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘ప్రజల మధ్య అంతరాలు పెంచి, విభేదాలు సృష్టించి.. దేశంలోని వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీయడం అనే వ్యూహం చాలా ప్రమాదకరం. దీని వల్ల అశాంతి, గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.

భారత్‌ను అణచివేయాలని చూసే ప్రపంచ శక్తులు ఇలాంటి పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకొని మరింత రెచ్చిపోతాయి. దేశాన్ని, హిందువులను, ఆర్‌ఎస్‌ఎస్‌ను విచ్ఛిన్నం చేసేందుకు దుష్టశక్తులు ఒక్కటవుతున్నాయి.

ఈ విషయంలో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. హిందూ స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఇటీవల నీట్ అవకతవకలకు వ్యతిరేకంగా, ఇప్పుడు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్న వేళ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

ఓటీటీలను కట్టడి చేయాలి..

ఇష్టారీతిగా కంటెంట్‌ను జనంలోకి వదులుతున్న ఓటీటీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి సెన్సార్ లేకుండా సోషల్ మీడియా ద్వారా యువతకు కంటెంట్ అందుబాటులోకి వస్తున్నదని.. ఏది మంచో, ఏది చెడో తెలుసుకోలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి సోషల్ మీడియా వేదికలు, ఓటీటీలపై  పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయని.. భారత్‌లోనూ ఓటీటీ వేదికలపై నియంత్రణ చర్యలను ప్రభుత్వం పరిశీలించాలని ఆయన సూచించారు. వందేమాతర గేయాన్ని పూర్తిగా, స్పష్టంగా ఆలపించాలని.. అలా ఆలపించడంపై ఎలాంటి సంకోచాలు ఉండొద్దని భగవత్ అన్నారు. ఆ గేయం దేశభక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. భారత్ విశ్వగురు కావాలన్న లక్ష్యం దేశంలోని అందరి ప్రవర్తనపై, కృషిపై ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

యూరప్ ఆందోళనలు చూడండి..

యూరప్ దేశాల్లో జరుగుతున్న ఆందోళనలు కూడా మోహన్ భగవత్ గుర్తుచేశారు. ఫ్రాన్స్, అల్బే నియాలో జరుగుతున్న నిరసనల వెనుక కొన్ని శక్తుల ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘భారత్ అనుసరిస్తున్న విధానాలు, నాయకత్వం, జాతీయ ఆత్మవిశ్వాసం, అంతర్జాతీయంగా పెరుగు తున్న పలుకుబడిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.

దేశ ప్రగతిని వ్యతిరేకించే శక్తులు దేశీయ సమస్యలను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నాయి. దేశంలో అస్థిరతను సృష్టించాలని కుట్రలు జరుగుతున్నాయి. ప్రస్తుత తరానికి సరైన మార్గదర్శకత్వం అవసరం. గతంలో కుటుంబ పెద్దలు, పాఠశాలలు, సమాజం ద్వారా పిల్లలకు విలువలు అందేవి. ఇప్పుడు క్రమంగా అవి తగ్గిపోతున్నాయి’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు