16 July, 2026 | 7:28 PM

అత్యంత వేడి సంవత్సరంగా 2024

12-12-2024 12:32 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: 2024 సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చరిత్రలోనే అత్యధిక వేడి సంవత్సరంగా ఈ ఏడాది నిలిచింది. పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న పారిస్ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ 2024లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కొపర్నికస్ క్లుమైట్ ఛేంజ్ సర్వీస్ (సీ3ఎస్) పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు నమోదైన ఉష్ణోగ్రతలను విశ్లేషించిన సీ3ఎస్.. పారిశ్రామిక పూర్వస్థాయి కంటే ఈ ఏడాది దాదాపు 1.62 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయని వెల్లడించింది.

1991 నుంచి 2020 మధ్యకాలంలో నమోదైన సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే ఈ ఏడాది 0.72 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు పేర్కొంది. కాగా గడిచిన నవంబర్ నెలలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చరిత్రలోనే అత్యధిక వేడైన రెండో నవంబర్ నెలగా రికార్డు నమోదైంది. గడిచిన 16 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు సీ3ఎస్ స్పష్టం చేసింది. వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రత పెరగడం, ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం ఇందుకు కారణమని తెలిపింది. వరదలు, తుఫానుల కారణంగా అట్లాంటిక్ మహాసముద్రంలో నమోదైన అధిక ఉష్ణోగ్రతలు వివిధ ప్రాంతాలకు విస్తరించడంతో సగటు ఉష్ణోగ్రతపై ప్రభావం చూపినట్లు వివరించింది.