19-07-2025 07:06:07 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్నం జూలై 24వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. హరిహర వీరమల్లు సినిమా ప్రత్యేక టిక్కెట్ ధరల పెంపును ఏపీ ప్రభుత్వం ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, జూలై 23న రాత్రి 9:00 గంటలకు జరగనున్న ప్రత్యేక ప్రీమియర్ షో టిక్కెట్ ధరలను రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఒక్కో టికెట్‌కు రూ.600 ప్లస్ జీఎస్టీ(GST)గా ఆమోదించారు.
అదనంగా, జూలై 24 నుండి ఆగస్టు 2, 2025 వరకు రెగ్యులర్ షోల టిక్కెట్ల ధరలు లోయర్ క్లాస్ సీట్లకు రూ.100 వరకు (GSTతో సహా), ఉన్నత తరగతి సీట్లకు రూ.150 వరకు, మల్టీప్లెక్స్‌లకు రూ.200 వరకు పెంచేందుకు అనుమతించింది. మార్చి 7, 2022 నాటి జీ.ఓ.ఎం ఎస్. నం.13లో పేర్కొన్న ప్రస్తుత ధరల కంటే ఇది ఎక్కువగా ఉంటుంది. మెగా సూర్య ప్రొడక్షన్‌కు చెందిన సినిమా నిర్మాత ఎ.ఎం. రత్నం అభ్యర్థనను అనుసరించి, ప్రస్తుత మార్గదర్శకాల సడలింపుగా ఈ పెంపు వచ్చింది. మరోవైపు తెలంగాణలో టికెట్ ధరలు పెంచాలని కోరుతూ నిర్మాత ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకున్నారు. దీనిపై తర్వలోన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ అంతటా జిల్లా కలెక్టర్లు, లైసెన్సింగ్ అధికారులు, పోలీస్ కమిషనర్లు ఈ ఉత్తర్వును అమలు చేయాలని ఆదేశించారు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొఘల్ రాజవంశం నుండి ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకునే సాహసోపేతమైన మిషన్‌కు బయలుదేరే పురాణ యోధుడు వీరమల్లు పాత్రలో నటించారు. మొదట మార్చి 28న విడుదల కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే.