2 August, 2026 | 3:14 AM

భారత్ బంగారు పంట

02-08-2026 01:49 AM

కామన్‌వెల్త్ గేమ్స్‌లో పదో రోజు భారత క్రీడాకారులు చెలరేగిపోయారు. అంచనాలకు తగ్గట్టే పతకాల పంట పండించారు. ముఖ్యంగా బాక్సింగ్‌లో భారత్ పంచ్ పవర్ మరోసారి రుచి చూపించారు. 10 మంది బాక్సర్లు ఫైనల్‌కు చేరగా ఏడుగురు పసిడి పంచ్ విసిరారు. దీనిలో ఐదుగురు మహిళా బాక్సర్లుండడం హైలెట్‌గా చెప్పొచ్చు. మహిళల బాక్సింగ్‌లో ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, ప్రియా గంఘాస్, సౌక్షి చౌదరి, అరుంధతి చౌదరి స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల బాక్సింగ్‌లో సచిన్ సివాచ్, అంకుశ్ పంగల్ బంగారు పతకాలు సాధించగా.. పారా అథ్లెటిక్స్ షాట్‌పుట్‌లో సోమన్‌కు స్వర్ణం దక్కింది. ట్రిపుల్ జంప్‌లో భారత్ డబుల్ పోడియంతో సత్తా చాటింది. ఈ ప్రదర్శనతోనే పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి దూసుకొచ్చింది.

  1. బాక్సింగ్‌లో స్వర్ణాల పంట
  2. ఏడుగురు బాక్సర్లకు గోల్డ్ మెడల్
  3. అథ్లెటిక్స్‌లోనూ అదుర్స్
  4. షాట్‌పుట్‌లో స్వర్ణం, రజతం
  5. ట్రిపుల్ జంప్‌లో రజతం, కాంస్యం

కామన్ వెల్త్ గేమ్స్‌లో పదో రోజు భారత క్రీడాకారులు అదరగొట్టారు. అంచనాలకు తగ్గట్టే బాక్సింగ్‌లో పతకాల పంట పండింది. ఫైనల్స్‌కు చేరడం ద్వారా 10 పతకాలు ఖాయం చేసిన భారత బాక్సర్లు పసిడి వేటలోనూ ఆధిపత్యం కనబరిచారు.  మహిళల బాక్సింగ్‌లో ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. పారా అథ్లెటిక్స్ షాట్‌పుట్‌లో సోమన్‌కు స్వర్ణం దక్కింది. ట్రిపుల్ జంప్‌లో భారత్ డబుల్ పోడియంతో సత్తా చాటింది.

ప్రీతి గోల్డెన్ పంచ్

మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ తుదిపోరులోనూ దుమ్మురేపింది. కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోపై గెలిచి బంగారు పతకాన్ని ముద్దాడింది. ఆమెకు ఇదే తొలి కామన్ వెల్త్ గేమ్స్ మెడల్.2024 పారిస్ ఒలింపిక్స్‌లో ప్రీతి 54 కేజీల విభాగంలో రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. అనారోగ్య కారణాలతో రెండేళ్ల పాటు బాక్సింగ్ రింగ్‌కు దూరమైన ప్రీతి గత ఏడాది బాక్సింగ్ ప్రపంచకప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. అదే ఫామ్ కొనసాగిస్తూ ఇప్పుడు కామన్‌వెల్త్ గేమ్స్‌లో పసిడి పంచ్ విసిరింది.

జాస్మిన్ తగ్గేదే లే

57 కేజీల విభాగంలో జాస్మిన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ లో నార్తర్మ్ ఐర్లాండ్‌కు చెందిన మైఖేలా వాల్ష్‌పై అద్భుత విజయాన్ని అందుకుని స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.జాస్మిన్ కెరీర్ లో ఇది రెండో కామన్ వెల్త్ గేమ్స్ మెడల్. 2022 బర్మింగ్ హామ్ గేమ్స్‌లో ఆమె లైట్ వెయిట్ కేటగిరీలో కాంస్యం సాధించింది. గత ఏడాది కాలంగా మంచి ఫామ్ కనబరుస్తూ ప్రస్తుత గ్లాస్గో గేమ్స్‌లోనూ అదరగొట్టింది.

సాక్షికి స్వర్ణం

మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో రూబీ వైట్(ఇంగ్లాండ్)ను సాక్షి 5 తేడాతో మట్టికరిపించి విజేతగా నిలిచింది. 54 కేజీల విభాగం నుంచి 51 కేజీలకు మారడం ఆమెకు కలిసొచ్చింది. హర్యానాలోని భివానీకి చెందిన సాక్షి భారత ఆర్మీలో హవల్దార్‌గా సేవలందిస్తున్నారు.

ప్రియా పంచ్ అదుర్స్

మహిళల 60 కేజీల విభాగంలో ప్రియా ఘంఘాస్ కూడా బంగారు పతకం సాధింంచింది. ఫైనల్లో కెనడాకు చెందిన మేరీ అల్-అహ్మదీహ్ 4- తేడాతో ఓడించి స్వర్ణం ఎగరేసుకుపోయింది. కొంతకాలంగా అద్భుతమైన విజయాలతో ప్రియా అదరగొడుతోంది. ఆసియా ఎలీట్ బాక్సింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన ఆమెపై అంచనాలు పెరిగాయి. వాటిని నిలబెట్టుకుంటూ కామన్‌వెల్త్ వేదికపై పసిడితో మెరిసింది.

అదరగొట్టిన అరుంధతి 

మహిళల 70 కేజీల విభాగం ఫైనల్లో అరుంధతి చౌదరి స్వర్ణం గెల్చుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన చాంటెల్‌పై అరుంధతి 5- తేడాతో విజయం సాధించింది.  బాస్కెట్‌బాల్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత బాక్సింగ్‌లో అడుగుపెట్టింది. గాయంతో ఏడా దిన్నర దూరమైన తర్వాత రీఎంట్రీలో అదరగొడుతున్న అరుంధతి వరల్డ్ బాక్సింగ్ కప్‌లోనూ, ఇప్పుడు కామన్‌వెల్త్‌లోనూ మెరిసింది.

సచిన్, అంకుశ్‌లకు గోల్డ్

పురుషుల విభాగంలో సచిన్ సివాచ్, అంకుశ్ ఫంగల్ బంగారు పతకాలు సాధించారు. పురుషుల 60 కేజీల విభాగంలో సచిన్ , 80 కేజీల విభాగంలో అంకుశ్ పూర్తి ఆధిపత్యం కనబరిచి స్వర్ణాలు ముద్దాడారు. ఇక మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గో హెయిన్ రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఎమ్మా సూ గ్రీన్ట్రీ (ఆ స్ట్రేలియా) చేతిలో లవ్లీనా ఓడింది.అలాగేనరేంద్ర బెర్వాల్ కూడా రజతంతోనే సరిపెట్టుకున్నాడు.

జాదూమణికి రజతం

పురుషుల బాక్సింగ్‌లో జాదూమనిసింగ్ రజతం సా ధించాడు. 55 కేజీల విభాగంలో స్వర్ణం గెలుస్తాడనుకున్న జాదూమణి సింగ్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సర్ చేతిలో ఓడిపోయాడు. ఎత్తు తక్కువగా ఉన్నప్పటకీ రిస్క్ చేసి 55 కేజీల విభాగంలో బరిలోకి దిగాడు.