2 August, 2026 | 2:28 AM

తలసరి ఆదాయంలో తెలంగాణ భేష్

02-08-2026 01:11 AM
  1. దేశంలో రెండో స్థానంలో.. 
  2. జీఎస్‌డీపీలో ఏడో స్థానం 
  3. ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి) : తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరోసారి తన బలాన్ని చాటుకుంది. తలసరి ఆదా యం విషయంలో దేశంలోని అగ్ర రాష్ట్రాల సరసన నిలుస్తూ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,18,931తో దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) రూ.16,14,771 కోట్లకు చేరి దేశంలో ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసిన రాష్ట్రాల ఆర్థిక గణాంకాల నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

యూపీ, పంజాబ్, కేరళం మినహా మిగతా రాష్ట్రాల గణాంకాలను ఈ నివేదికలో పొందుపరిచింది. 2024--25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,80,031గా ఉండగా, 2025--26లో అది రూ. 4,18,931కు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే రూ.38,900 పెరుగుదల నమోదైంది. ఇది 10.23 శాతం వృద్ధికి సమానం. రాష్ట్రంలో సేవారంగం, ఐటీ, పారిశ్రామిక రంగం, పట్టణ ఆర్థిక కార్యకలాపాల విస్తరణ తలసరి ఆదాయం పెరగడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తలసరి ఆదాయంలో కర్ణాటక రూ.4,33,326తో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు రూ.4,08,027తో మూడో స్థానంలో ఉంది. గుజరాత్ రూ.3,57,531, మహారాష్ట్ర రూ.3,47,903, ఆంధ్రప్రదేశ్ రూ.2,94,507 తలసరి ఆదాయంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీంతో తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా మరోసారి నిలిచింది.

జీఎస్డీపీ పరంగా కూడా తెలంగాణ గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. 2024--25లో రూ.14,67,913 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్డీపీ, 2025--26లో రూ.16,14,771 కోట్లకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే రూ.1,46,858 కోట్ల మేర పెరిగి 10.75 శాతం వృద్ధి నమోదు చేసింది. 

జీఎస్‌డీపీలోనూ..

దేశంలోని పెద్ద రాష్ట్రాల జీఎస్డీపీ జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తర్వాత తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఎనిమిదో స్థానంలో ఉంది. తలసరి ఆదాయం పెరగడం రాష్ట్ర ప్రజల సగటు ఆర్థిక స్థితి మెరుగుపడుతున్న సంకేతంగా భావిస్తున్నారు. అదే సమయంలో జీఎస్డీపీ పెరుగుదల పెట్టుబడులు, ఉత్పత్తి, సేవారంగం విస్తరణకు సూచికగా నిలుస్తోంది.

అయితే ఈ వృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా చేరుతున్నాయా, గ్రామీణపట్టణ ప్రాంతాల మధ్య ఆదాయ వ్యత్యాసం ఎంత మేర తగ్గుతోంది వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలోనే కొనసాగుతున్నప్పటికీ, ఇదే వేగాన్ని కొనసాగించేందుకు పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి కల్పన, వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతం, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం విడుదలైన గణాంకాలు రాష్ట్ర ఆర్థిక సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నప్పటికీ, భవిష్యత్‌లో ఈ వృద్ధిని మరింత సమగ్ర అభివృద్ధిగా మలచడం ప్రభుత్వానికి ప్రధాన సవాలుగా నిలవనుంది.

తలసరి ఆదాయంలో(రూ.ల్లో) 

రాష్ట్రం                తలసరి ఆదాయం

కర్ణాటక                   4,33,326

తెలంగాణ                4,18,931

తమిళనాడు              4,08,027

గుజరాత్                  3,57,531

మహారాష్ట్ర                 3,47,903

ఆంధ్రప్రదేశ్               2,94,507

పెద్ద రాష్ట్రాల జీఎస్‌డీపీలో(రూ.కోట్లలో)

రాష్ట్రం                      తలసరి ఆదాయం

మహారాష్ట్ర     44,84,537

తమిళనాడు       31,60,206

కర్ణాటక               29,80,634

గుజరాత్                 26,36,003

పశ్చిమబెంగాల్ 17,99,664

రాజస్థాన్               16,85,118

తెలంగాణ        16,14,771

ఆంధ్రప్రదేశ్      15,79,501

మధ్య ప్రదేశ్     15,08,655

బీహార్            10,03,951