5 September, 2026 | 7:05 AM

22-ఏ నిషేధిత జాబితా నుంచి ప్రజల భూములు తొలగించాలి

05-09-2026 | 05:20am

ఎంపీ ఈటల రాజేందర్.. నేడు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ దీక్ష

ముషీరాబాద్, సెప్టెంబర్ 4(విజయక్రాంతి): ప్రజల భూములను నిషేధిత జాబితా(prohibited list) (సెక్షన్ 22-ఏ)లో చేర్చడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం  ఇందిరాపార్క్ ధర్నా చౌక్(Indira Park Dharna Chowk) వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) తెలిపారు. 22-ఏ బాధితులు(Victims) పెద్ద సంఖ్యలో దీక్షకు తరలిరానున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి  ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న సభ ఏర్పాట్లను ఈటల రాజేందర్(Etala Rajender), బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Eleti Maheshwar Reddy), ఇతర ముఖ్య నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ  రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఒక రకమైన భయంలో ఉన్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో వేలాది ఇళ్లను కూల్చి పెద్దల జీవితాల్లో మట్టి కొట్టారని ఆరోపించారు. మూసీ బాధితులకు కూడా బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో నిషేధిత జాబితాలో 16 లక్షల ఎకరాలు ఉండగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూముల విస్తీర్ణం 80 లక్షల ఎకరాలకు పెరిగిందని ఈటల ఆరోపించారు.

అపార్ట్మెంట్లు, కాలనీలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 22-ఏ జాబితాలో చేర్చారని, ఎన్నో ఏళ్లుగా ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను కూడా నిషేధిత జాబితాలోకి తీసుకువచ్చారని అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నేడు ఉదయం10 గంటల నుంచి ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపడతారని తెలిపారు.

22-ఏ బాధితులందరూ దీక్షకు హాజరై తమ నిరసనను తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాధితులకు అండగా నిలిచి వారిని దీక్షకు తీసుకురావాలని కోరారు. ఈ దీక్ష ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మాత్రమేనని ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు