ఉద్యమానికి ఊపిరిభువనగిరి
మలిదశ తెలంగాణ ఉద్యమానికి భువనగిరి ఊపిరి పోసింది. చారిత్రాత్మకమైన తెలంగాణ సాయుధ పోరాటానికి వేదిక అయిన భువనగిరి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కూడా వేదిక కావటం యాధృచికం కాదు. పోరాటాల గడ్డ అయిన నల్లగొండ జిల్లాలో ప్రముఖ పట్టణంగా వెలుగొందుతున్న భువనగిరి అనేక చారిత్రక పోరాటాలకు అకుర్పారణ చేసింది. ఆ క్రమంలోనే 1997లో మార్చి 8,9 తేదీలలో సాహితి మిత్రమండలి ‘దగాపడ్డ తెలంగాణ’ పేరుతో తొలిసారి తెలంగాణ సమస్యలపై, రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన రెండు రోజుల సభ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది.
నిజాం కాలంలోనే తెలంగాణ వివక్షను ఎదురించిన దాఖలాలు మనకు కనిపిస్తాయి. స్వాత్రంత్య్రానికి ముందే నిజాం నవాబు తన పరిపాలన విభాగాల్లో చిన్న చిన్న ఉద్యోగాల కోసం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు కల్పించారు. నాటి పరిస్థితి ఏమిటంటే..? నిజాం ఎలుబడిలో ఉన్న తెలంగాణలో చదువు తక్కువ. అందులో ఏ మాత్రమైన ఉంటే అది ఉర్దు మీడియంలోనే ఉండేది. కానీ నిజాం తన పాలన యంత్రాంగంలో బ్రిటీష్ ఏలుబడిలోని ఆంధ్ర ప్రాంతంలో ఇంగ్లీష్ చదువులు చదువుకున్న వారికి ప్రాధాన్యం ఇచ్చి ఉద్యోగ నియామకాలు చేసేవారు.
దీని వ్యతిరేకంగా తెలంగాణ వారికి కాకుండా ఆంధ్ర ప్రాంత వారికి ఉద్యోగాలు కల్పించటాన్ని వ్యతిరేకిస్తూ ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. ఆ నేపథ్యంలోనే ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థిగా ఉన్నప్పుడు ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నాడు. నాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలోని సిటీ కాలేజీలో విద్యార్థులంతా ఏకమై తెలంగాణ ప్రాంతంపై జరుగుతున్న అణచివేత, వివక్ష, అంతం కావాలనే నినాదంతో ఊరేగింపు తీశారు. ఆ ఊరేగింపు పై పోలీసులు కాల్పులు జరపగా పలువురి విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు.
కొందరు చనిపోయారు. నిజానికి ఈ ఊరేగింపులో పాల్గొనేందుకు వరంగల్ నుంచి విద్యార్థులతో తరలి వస్తోన్న జయశంకర్ అతని మిత్రులను పోలీసులు మధ్యలోనే ఆపేసి నిర్భందించారు. దాంతో జయశంకర్ సిటీ కాలేజీ ఉద్య మంలో పాల్గొనలేకపోయారు. లేకుంటే ఆ ఊరేగింపులో జయశంకర్ కూడా తుపాకీ తూటాలకు బలి అయ్యేవాడేమో. ఆ విధంగా మనకు తెలంగాణ సిద్థ్దాంతకర్తగా తెలంగాణ సమాజానికి చరిత్ర అందించిన గొప్ప మేధావిగా జయశంకర్ సార్‌ను చెప్పుకుంటారు.
దగాపడ్డ తెలంగాణ..
ఆ నేపథ్యంలోనే 1997లో మార్చి 8,9 తేదీల ల్లో ‘దగా పడ్డ తెలంగాణ’ పేరుతో భువ నగిరిలో సభ నిర్వహించడంతో తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. ఈ సభ నిర్వహించడానికి భువన గిరిలో అనేక సాహిత్య, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాహితి మిత్రమండలి ప్రముఖ పాత్ర పోషించింది. ఈ సభ నిర్వహణలో గాదె ఇన్నయ్య స్వాత్రంత్య్ర సమరయోధుడు జైని మల్లయ్య గుప్త కీలక భూమిక పోషించారు. ఈ సభకు ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ నారాయణ రావు, కేశవరావు జాదవ్, పిఎల్ విశ్వేశ్వర్ రావు, కోదండరామ్ హాజరయి ఉద్యమానికి ఊపిరి పోశారు. తెలంగాణ మేధావుల ప్రసంగాలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వారు ప్రజల కు వివరించడంతో ప్రజలు తెలంగాణ ఉద్యమం కోసం కెరటంలా లేచారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు గ్రామాల నుంచి పట్టణాల దాకా తెలంగాణ ఉద్యమంతో మమేకం అయ్యారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రజలకు అర్ధం కావడంతో ప్రజలు మరింత చైతన్యం అయ్యారు.
తెలంగాణ కుల సాధన పేరుతో భువనగిరిలో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో అంతర్లీనంగా ఉంటే గద్దర్, బెల్లిలలిత లాంటి వారు ఉద్యమానికి జవసత్వాలు అందించారు. బెల్లి లలిత ఉద్యమానికి గాన కోకిలగా నిలిచారు. భువనగిరి మలిదశ ఉద్యమంలో కొమ్మిడి నర్సింహ్మారెడ్డి, పులిమామిడి బాలకృష్ణ రెడ్డి, నాగారం అంజయ్య, రావి సురేందర్ రెడ్డి, నీలం గోపాల్, దయ్యాల బాలనర్సయ్య, పిట్టల శ్రీశైలం, భువనగిరి శ్రీనివాస్ నేత, సామ మల్లారెడ్డి లాంటి వారు క్రీయాశీలకంగా పని చేశారు. మలిదశ ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేస్తున్న నీలం గోపాల్, దయ్యాల బాల నర్సయ్య ఉపాధ్యాయ వృత్తి నుంచి సస్పెండ్‌కు గురి అయ్యారు.
భువనగిరిలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎలాగైనా తెలం గాణ ఉద్యమాన్ని భయబ్రాంతులకు గురి చేయాలని పాలకులు 1997 ఏప్రిల్ 6వ తేదీన గద్దర్‌పై కాల్పులు జరిపారు. చావు అంచుల దాకా వెళ్లి తెలంగాణ రాష్ట్ర బలమైన ఆకాంక్ష ఆయన మళ్లీ జీవించేలా చేసింది. తెలంగాణ ప్రజలను ఆటపాటలతో చైతన్యం చేస్తున్న బెల్లి లలితపై కూడా కక్ష గట్టిన నాటి పాలకులు బెల్లి లలితను హత్య చేసి 17 ముక్కలుగా నరికి వివిధ బావుల్లో పడేశారు. పాలకులు అడుగడుగునా తెలంగాణ ఉద్యమానికి ఆటంకాలు కల్పించగా, తెలంగాణ మేధావి వర్గం ప్రొఫెసర్లు తెలంగాణ కోసం నిరంతర చర్చలు, ఉద్యమాలతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు.
ఆ క్రమంలోనే నాటి టీడీపీ పార్టీ పై అలకబూని ఇంటికే పరిమితమై ఉన్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని అందించిపుచ్చుకున్నారు. ఆ తర్వాత కాల క్రమంలో కేసీఆర్ ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్ ఎలాంటి పాత్ర పోషించింది.. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్‌ఎస్ ఓడిపోవడం జరిగింది. తిరిగి కాంగ్రెస్ గద్దెనెక్కడం వర్తమాన చరిత్ర. సుదీర్ఘ పోరాటాలు, అనన్య త్యాగాలతో దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయి, వాటి కోసం నేడు చేయాల్సిన కర్తవ్యం ఏమిటనేది తెలంగాణ సమాజం ముందు ఉన్న ప్రశ్న. ఓటమిలోంచి అనుభవాలను, గుణపాఠాలను తీసుకొని ముందుకు పోయే తెలంగాణ సమాజం తన ఆకాంక్షల సహకారం కోసం అలుపెరగని పోరాటాలకు ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుందని చరిత్ర చెబుతున్న పాఠం.
అడుగడుగున వివక్ష..
నిజాం రాజ్యం భారత్‌లో విలీనమైన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో మొదటి రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్ర ప్రదేశ్ అవతరణ నుంచే తెలంగాణను ఆంధ్రలో కలపడాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. విభిన్న సామాజిక అభివృద్ధి స్థాయిలో ఉన్న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాన్ని ఒకటి కలపటాన్ని తెలంగాణ ససేమిరా ఒప్పుకోలేదు. సామాజిక అభివృద్ధి, ఆంగ్ల చదువులు సంస్కృతి మూలాలు ఉన్న ఆంధ్ర ప్రాంతంలో రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న తెలంగాణను విలీనం చేయవద్దని తీవ్రంగా ప్రతి ఘటించింది.
అలాంటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లోంచే అప్పటి ప్రధాని నెహ్రూ కూడా అమాయక తెలంగాణను ఆంధ్రతో కట్టబెట్టడం తగదని కూడా ప్రకటించారు. అయిన అప్పటికే ఆర్థిక, రాజకీయ శక్తి కల్గిన ఆంధ్ర ప్రాంత నేతలు తెలంగాణకు అన్ని విధాల రక్షణ చట్టాలు రూపొందించి అభివృద్ధి చేస్తామని, వివక్ష, అణిచివేతలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆంధ్ర నేతలు ఇచ్చిన హామీలన్నీ ఆవిరయ్యాయి. అన్నింటా ఆంధ్ర పెత్తనం కొనసాగింది. నిధుల కేటాయింపులో, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఆంధ్ర పాలకులు అడుగడుగున వివక్ష, అణిచివేతలకు పాల్పడ్డారు.
ఇడ్లీ-సాంబారు గో బ్యాక్..
ఈ నేపథ్యంలోనే 1969 నాటి తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్నది. నాడు విద్యా ర్థి నేతలుగా ఉన్న మదన్‌మోహన్, కేశవరావు లాంటి నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. విద్య, ఉద్యోగాల్లో నెలకొ న్న వివక్షను అంతం చేయడం కోసం ‘ఆంధ్ర గో బ్యాక్’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆ క్రమంలోనే మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమంలో రావడం తెలంగాణ ఉద్యమం మహో జ్వలంగా, మరో జాతి విముక్తి పోరాటంగా మారింది. ఆంధ్ర ప్రాంత సాంస్కృతిక అణిచివేతను వ్యతిరేకించటంలో భాగంగా ‘ఇడ్లీ, సాంబారు గో బ్యాక్’ నినాదం ముందుకు వచ్చింది. పల్లె పట్నం ఏకమై బడులన్నీ మూత పడ్డాయి. విద్యా సంవత్సరమంతా జై తెలంగాణ ఉద్యమంతో గడిచిపోయింది. ఈ ఉద్యమాన్ని అణచటం కోసం పాలకులు తీవ్ర నిర్భంధాన్ని అమలు చేశారు.
శాంతియుత ప్రదర్శనలపై సైతం పోలీసులు కాల్పులు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 370 మంది విద్యార్థులు అమరులు అయ్యారు. అంతకు రెట్టింపు స్థాయిలో రైతులు, యువకులు అసువులు బాశారు. వేల సంఖ్యలో జైలు పాల య్యారు. ఇలాంటి ఉద్యమాన్ని పోలీసు తూటాలతో అణచడానికి ప్రయత్నిస్తునే ఉద్యమంలో ముందు భాగాన ఉన్న మర్రి చెన్నా రెడ్డి, ఆయన అనుచరులను ఇందిరా గాంధీ చెరదీయడంతో ఆ ఉద్యమం మధ్యలోనే ఆగిపోయింది. తొలిదశ ఉద్యమం పాలకులు అమలు చేసిన అమానవీయ నిర్భంధకాండ, నాయకత్వ ద్రోహం కారణంగా ఆగిపోయింది. అయినా సీమాంధ్ర వలస పాలకుల వివక్ష, అణిచివేతలు మరింతగా పెరిగిన పరిస్థితుల్లో నిగురుగప్పిన నిప్పులా ఉద్యమం అంతర్గతంగా తెలంగాణ సమాజంలో రాజుకుంటునే ఉన్నది.






