9 August, 2026 | 7:13 PM

తెలంగాణ వస్తే.. మన బతుకులు మారుతాయే!

20-06-2024 02:30 AM

ఉద్యమానికి ఊపిరులూది.. తమ ఊపిరి తీసుకున్న త్యాగధనులు వారు.. తమ కుటుంబాల్లో చీకట్లు నిండినా సరే తెలంగాణ గడ్డపై వెలుగు రేఖలు నింపిన చిరు దివ్వెలు వారు.. ఉద్యమకాలంలో ఎందరో విద్యార్థులు, యువతీయువకులు తమ ప్రాణాలను అర్పించారు. ఆత్మబలిదానాలతో ఉద్యమ యజ్ఞంలో సమిధలయ్యారు. వారి త్యాగాలు.. పోరాట బలంతో పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం సాకారమయింది. 

గ్రామాల నుంచి మొదలుకుని పట్టణాల వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు స్వచ్ఛదంగా నిర్వహించడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధ్దించింది. మలిదశ ఉద్యమం జరుగుతున్న సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాశిపల్లి గ్రామానికి చెందిన కావలి సువర్ణ డిగ్రీ చదువుకుంటూ తెలంగాణ ఉద్యమంలో అడుగులు వేసింది. ప్రతి రోజు కళాశాలకు వెళ్లడం రావడం దినచర్య. ఆ క్రమంలో ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సందర్భంలో తెలంగాణకు సీమాంధ్ర నాయకులు చేస్తున్న అన్యాయాన్ని సహించలేకపోయింది. అందుకు ఆత్మబలిదానమే మార్గ మని భావించింది. 2010 జనవరి 19న ఎవ్వరు లేని సమయంలో ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మబలిదానం చేసుకుంది. 

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాశిపల్లికి చెందిన కావలి రాములమ్మ , నర్సన్న దంపతులకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు, మూడో కూతురు సువర్ణ. కావలి సువర్ణ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోయగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత గత ప్రభుత్వ హయాంలో సువర్ణ అన్న రాధాకృష్ణకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 

తల్లి మాటల్లో..

కళాశాలలో చదువుతున్న సువర్ణ ఎప్పుడూ తెలంగాణ గురించే మాట్లాడేది. కాయా కష్టం చేసుకుని మనం బతికేటోళ్లం బిడ్డా మనకు ఎందుకమ్మా ఈ ఉద్యమాలు అంటే లేదమ్మా ఎప్పటికీ ఒకరికింద బానిసలుగానే బతకాలా? మన కష్టం మనకు కాకుండా వేరే వాళ్లు తన్నుకుంటూ పోతుంటే చూస్తూ ఉండాలామ్మా? కంచం దగ్గర కూడు గుంజుకుంటున్నారు. మనం ఉద్యమం చేస్తేనే రాబోయే రోజుల్లో మంచిగా బతుకుతాం. ఇలా ఎప్పుడూ ఇవే మాటలు ఇదే ధ్యాస టీవీలో.. పేపర్‌లో ఎప్పుడూ తెలంగాణ ఉద్యమం గురించిన వార్తలు చూసేది. వద్దన్నా వినేది కాదు. ఉద్యమాలు పోరాటాలతో తెలంగాణ వస్తదని.. వస్తే ఏం జరుగు తుందో చెబుతుండేది. ఉద్యమంలో ఎందరో ప్రాణాలను విడిచిపెడుతుంటే కనీళ్లు పెట్టుకుంటూ తెలంగాణ వస్తది మన బతుకు లు మారుతాయని మాకు దైర్యం చెప్పేదని తల్లి కావలి రాములవ్వ కన్నీటిపర్యంతమైంది. 

అమరుల కుటుంబాలకు ఆసరాగా..

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరులైన కుటుంబాల కు ఆసరాగా నాటి ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ సీఎల్ రాజం అండగా నిలిచారని మలిదశ అదమరురాలు కావలి సువర్ణ అన్న కావలి మన్యం గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 21 మంది అమరులు అయ్యారు. వారందరి కుటుంబసభ్యులను పిలిపించి మీ త్యాగాలను మరువలేమని తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటారని మాట్లాడిన మాటలు మరువలే నివని ఆయన గుర్తు చేసుకున్నారు. అమరుల కుటుంబాలకు రూ.30 వేల చెక్కును సంస్థ ద్వారా సీఎల్ రాజం అందజేశారు. 

పీ రాము, వనపర్తి, విజయక్రాంతి