కరెంటు కోతలపై ట్వీట్ చేశారని..
- ఎక్స్‌లో పోస్టు పెట్టిన జర్నలిస్టుపై కేసు
- తమ ప్రాంతంలో విద్యుత్ సరఫరా లేదని ఓ మహిళ పోస్ట్
- ఆమెకు మద్దతుగా నిలిచిన రేవతి అనే జర్నలిస్టు
- చర్చనీయాంశంగా మారిన వ్యవహారం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత విద్యుత్ సరఫరాలో కోతల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కొత్త ప్రభుత్వంలో తరచూ విద్యుత్ కోతలు ఉంటున్నాయంటూ ప్రచారం చేస్తున్న వారిపై విద్యుత్ శాఖ అధికారులు సైతం కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తరహా వ్యవహారం ఇప్పటి దాకా రాజకీయ నాయకులకే పరిమితం కాగా, తాజాగా నగరంలోని ఎల్‌బీ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రచారం చేస్తున్నారంటూ ఓ జర్నలిస్టుపై పోలీసు కేసు నమోదు కావడం గమనార్హం.
సరఫరా లేదని ఓ మహిళ పోస్ట్..
సరూర్‌నగర్ డివిజన్ ఆటోనగర్ సెక్షన్ పరిధిలోని సెంట్రల్ బ్యాంక్ కాలనీకి చెందిన పద్మావతి అనే మహిళ మంగళవారం ఉదయం కరెంటు సరఫరా నిలిచినట్టుగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ తర్వాత సదరు మహిళ నివాసానికి వెళ్లిన విద్యుత్ శాఖ సిబ్బంది కరెంట్‌ను పునరుద్ధరించాం.. ఎక్స్‌లో మీరు పెట్టిన పోస్టును డిలీట్ చేయాలని కోరారు. దీంతో ఎక్స్ సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన ట్వీట్‌ను డిలీట్ చేయమంటున్నారంటూ సదరు మహిళా తిరిగి ట్వీట్ చేశారు. అయితే, ఎల్‌బీ నగర్ ప్రాంతంలో 7 గంటలుగా సరఫరా లేదని.. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన మహిళను విద్యుత్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ రేవతి అనే జర్నలిస్టు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఈ పోస్టులన్నింటినీ గమనిస్తున్న విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, స్థానిక అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఆగ్రహించిన ఉన్నతాధికారులు.. ప్రభుత్వ ప్రతిష్ఠను, విద్యుత్ శాఖ పనితీరును బద్నాం చేయాలనే దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయాలని ఆదేశించడంతో ఆటో నగర్ ఏఈ దిలీప్ మంగళవారం ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో జర్నలిస్టు రేవతిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే, ఎక్స్‌లో విద్యుత్ సరఫరా లేదని మొదటిసారి ట్వీట్ చేసిన మహిళ తర్వాత తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఇదిలా ఉండగా, రెండోసారి ట్వీట్ చేసిన జర్నలిస్టు రేవతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. కాగా, ‘మై మెడల్ ఆఫ్ హానర్ యాన్ ఎఫ్‌ఐఆర్’ అంటూ రేవతి ఎక్స్ వేదికగా స్పందించారు.
అంతరాయం 10 నిమిషాలే...
ఆటో నగర్ సెక్షన్ పరిధిలో మంగళవారం శాఖాపరమైన అవసరాల నిమిత్తం కేవలం 10 నిమిషాలు మాత్రమే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్టు ఏఈ దిలీప్ తెలిపారు. కావాలని విద్యుత్ శాఖపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.
జర్నలిస్టు రేవతిపై కేసు ఉపసంహరించుకోవాలి
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ప్రజా సమస్యలపై స్పందించే జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సరికాదని, జర్నలిస్టు రేవతిపై కేసును ఉపసంహరిం చుకోవాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన టీజీఎస్‌పీడీసీఎల్ అధికారులు ఆమెను టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. రేవతికి టీజేఎస్ మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.






