ఆ హాలీవుడ్ స్టార్ సరసన ఛాన్స్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కెరీర్‌లో మరో ముందడుగువేసింది. ప్రస్తు తం టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌బాబు కాంబోలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌లో ఆమె ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఉండగా, తాజాగా ప్రియాంకకు సంబంధించి ఒక హాలీవుడ్ అప్డేట్ వచ్చిది. హాలీవుడ్ స్టార్ నటుడు ఓర్లాండో బ్లూమ్ సరసన ప్రియాంక చోప్రా నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది.
వీరిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రానికి ‘రీసెట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు ఫేమ్ మాట్ ఒక విభిన్నమైన సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కథ మొత్తం ఒక దట్టమైన అడవి నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న ఒక మహిళను, ఒక అపరిచితుడు ఎలా కాపాడాడు? ఆ అడవిలో వారు ఎదుర్కొన్న సవాళ్లేంటి? అనే పాయింట్‌తో సినిమా చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అయితే ఈ తరహా పాత్రలు చేయడంలో ప్రియాంక దిట్ట. ఇప్పటికే ‘సిటాడెల్’ వంటి సిరీస్‌లతో తన సత్తా చాటుకుంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాకు కేవలం హీరోయిన్ మాత్రమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. హీరో ఓర్లాండో బ్లూమ్‌తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇదివరకే ‘ది బ్లఫ్’ సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న ప్రియాంక.. ఇప్పుడు ‘రీసెట్’ సినిమాతో హాలీవుడ్‌లో తన నిర్మాణ విలువలను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తోంది.






