20-02-2026 12:00:00 AM
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతం గా పెరిగిపోయింది. ఇంటర్నెట్ వాడకపోతే శరీరం దిగు లు పడుతోంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లు చూడనిదే ముద్ద దిగనంటోంది. అదే స్మార్ట్‌ఫోన్‌ను ఇంట్లో మరచిపోతే ఏదో కోల్పోయినట్లుగా ఫీలవుతున్నాం. ఇటీవల విదేశీ విశ్వవిద్యాలయం చేసిన సర్వేలో స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల కొన్ని ప్రమాదకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
తమ ఆప్తమిత్రుల కన్నా స్మార్ట్‌ఫోన్ మిన్న అని 37 శాతం మంది అభిప్రాయపడగా, తల్లిదండ్రుల కన్నా స్మార్ట్ ఫోన్ ముఖ్యమని 29 శాతం యువత తెలుపడం మన బలహీనతను స్పష్టం చేస్తున్నది. మూడు నెలల పిల్లాడు సైతం స్మార్ట్‌ఫోన్‌ను ఇవ్వకుంటే ముద్ద మింగనని మారాం చేస్తుండడం చూస్తున్నాం. స్మార్ట్‌ఫోన్ ప్రభావంలో పడి ముఖ్యమైన విధుల ను సైతం పక్కనబెట్టి సామాజిక మాధ్యమం అనే సాగరంలో ఈదుతున్నాం.
ఈ స్మార్ట్‌ఫోన్ భూతం నేడో రేపో షార్క్‌గా మారి మన భవిష్యత్తును మింగేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ పూర్తిగా పక్కనబెట్టమని ఎవరు చెప్పడం లేదు. కానీ కాసేపు దానిని పక్కనబెట్టి చూస్తే కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా విధి నిర్వహణ లేదా చదుకునే సమయాల్లో స్మార్ట్ ఫోన్‌ను అందనంత దూరంగా లేదా ఆఫ్ చేసి పెట్టుకోవాలి. సన్నిహిత వాట్సాప్ గ్రూపులు మినహా ఇతర అనవసర గ్రూపులను తొలగించడం మంచిది.
వార్తల యాప్‌లను సాయంత్రం వరకు దూరం పెడదాం. అతి ముఖ్యమైన కాల్స్‌కు మాత్రమే జవాబులిస్తూ అనవసర కాల్స్‌కు దూరంగా ఉందాం. ముఖ్యంగా సామాజిక మాధ్యమం, వీడియో గేమ్స్, వ్యర్థమైన ఆడి యో, వీడియో సమాచారాలకు దూరంగా ఉండడం అలవాటు చేసుకుం దాం. అత్యవసరమైనప్పుడు మాత్రమే స్మార్టఫోన్‌లో ఇంటర్నెట్ ఆప్షన్‌ను వినియోగించి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సామాజిక మాధ్యమాలు మన మెదడును తినేస్తున్నాయి.
బుద్దిహీనులుగా మార్చడంతో పాటు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు మన బ్యాంకుఖాతాలను ఊడ్చి పారేస్తున్నారు. దీంతో డబ్బులకు సంబంధించిన వ్యవహారాలపై అప్రమత్తంగా మెలగాల్సిన అవసరముంది. అయితే ఒక రోజులో మనకుండే 1440 నిమిషాల్లో 500 నుంచి 600 నిమిషాలు కేవలం స్మార్ట్‌ఫోన్‌లు వాడ కం ద్వారానే విలువైన సమయాన్ని వృథా చేస్తున్నాం. అందుకే స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించి శారీరక శ్రమకు పని చెప్పాల్సిన అవసరముంది.
కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, వ్యాయామానికి సమయమివ్వడం, స్నేహితులతో మాట్లాడడం, అమ్మనాన్నల ఆప్యాయతను రుచి చూడడం, భార్యతో కాలక్షేపం చేయటం, ఏకాగ్రతతో చదవడం లాంటివి చేయడం ద్వారా క్రమంగా స్మార్ట్‌ఫోన్ వాడకం తగ్గిపోవడం ఖాయం. ఒకవేళ స్మార్ట్‌ఫోన్ వాడకం తప్పనిసరి అయితే ఫోన్లో వ్యాసాలు లేదా పుస్తకాలు చదవండి, విద్యకు సంబంధించిన విషయాలు సేకరిస్తూ ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.
మారుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఆధునిక అంశాల్లో సర్టిఫికెట్ కోర్సులు చేయడం ద్వారా భవిష్యత్తు బాగుంటుంది. స్మార్ట్ ఫోన్ అంటే అందరికీ ఇష్టం కాబట్టే దానిని అంత త్వరగా వదిలేయడం కాస్త కష్టతరంగానే ఉంటుంది. కానీ ఏదైనా మెల్లిగా అలవాటు చేసుకుంటే రాబోయే కాలంలో ప్రయోజనాలు ఉంటాయి.
బుర్ర మధుసూదన్ రెడ్డి, నిజామాబాద్