25 March, 2026 | 2:10 AM

2.18 లక్షల మందితో హిందూ సైన్యం

25-03-2026 12:15 AM
  1. ‘చతురంగిణి’ సేన పేరుతో ఏర్పాటు 
  2. గో సంరక్షణ, సనాతన ధర్మ రక్షణే లక్ష్యం
  3. కుల, లింగ భేదం లేకుండా సభ్యత్వం 
  4. సంప్రదాయ, ఆధునిక ఆయుధాల్లో శిక్షణ 
  5. మౌనీ అమావాస్యనాడు ప్రారంభం
  6. జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): సనాతన ధర్మ చిహ్నాలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరామ్నాయ జ్యోతిష్ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘శంకరాచార్య చతురంగిణి’ పేరిట 2.18 లక్షల మందితో ప్రత్యేక సేన ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వారణాసిలోని కేదార్‌ఘాట్ శ్రీవిద్యామఠం, శంకరాచార్య సెక్రటేరియట్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

మౌనీ అమావాస్యనాడు ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరివర్తన కాలంలో కేవలం శాస్త్ర చర్చలు సరిపోవని ఆ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. గోమాత, విద్వత్ బ్రాహ్మణులు, ఇతర సనాతన చిహ్నాలతోపాటు సనాతన ధర్మ అనుచరులపై దాడులు పెరిగిపోతున్నాయని పేర్కొంటూ.. ‘గోవుల రక్షణ, సనాతన ధర్మ పరిరక్షణకు ఈ దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. చతురంగిణి దళం కేవలం గోవులు, బ్రాహ్మణుల రక్షణకే కాకుండా.. బలహీన వర్గాల్లోని సనాతనులకు అండగా ఉంటుందని తెలిపారు. హిందూ సమాజంలో నెలకొన్న భయాలను తొలగించి వారిని సంరక్షణ చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు.

తొమ్మిది అంచెల వ్యవస్థ

ఈ దళం తొమ్మిది స్థాయిల్లో సోఫాన క్రమంలో పనిచేస్తుంది. క్షేత్రస్థాయిలోని అతిచిన్న యూనిట్‌కు నాయకుడిగా పట్టిపాల్ ఉండగా.. తరువాతి క్రమంలో సేనాముఖపతి, గుల్మపతి, గణపాల్, వాహినీపతి, ప్రితానపతి, చాముపతి, అనికినిపతి చివరికి మహేసేనాపతి ఉంటారని తెలిపారు. ప్రతి స్థానానికి ఒక్కో రకమైన బాధ్యతలు, హోదా ఉంటాయి. అత్యున్నత కమాండర్‌గా ఈ దళానికి శంకరాచార్య పరమాధ్యక్ష (సుప్రీం కమాండర్) సారధ్యం వహిస్తారు.

ఈ సుప్రీం కమాండర్ దిగువన సర్వాధ్యక్ష, సహ సర్వాధ్యక్ష, సంయుక్త సర్వాధ్యక్ష లు ఉంటారు. వీరు పురుషులు, మహిళలు, థర్డ్ జెండర్‌లకు ప్రాతినిధ్యం వహించి.. సామాజిక, మతపరమైన సమతుల్యతను కాపాడుతారు. క్షేత్రస్థాయిలో మరింత దృఢంగా, ప్రభావంతంగా ఈ చతురంగిణి దళాలు పనిచేసేలా నాలుగు విభాగాలను, వాటికి ముఖ్యులను (అంగాధ్యక్ష)లను ఏర్పాటు చేశారు.

ఇందులో మన్‌బల్ (మానసిక, మేధో శక్తి కోసం) విభాగంలో సాధువులు, పండితులు, న్యాయవాడులు, మీడియా ఉంటుంది. అలాగే తన్‌బల్ (శారీరక శక్తి కోసం)లో ప్రత్యక్ష రక్షణ విభాగంలో మల్లయుద్ధం, లాఠీ, గొడ్డలి, కత్తి, తుపాకీ వాడకంలో శిక్షణ పొందిన వారుంటారు. జన్‌బల్ (ప్రజా శక్తి)లో ధర్మసేవలో నిమగ్నమయ్యే వలంటీర్లు ఉంటారు. అలాగే ధన్‌బల్ (ఆర్థిక శక్తి)లో ఆర్థిక, రవాణా వనరులను సమకూర్చే విభాగం ఉంటుంది.

ప్రతి సనాతనీకి ‘అభిభావకుడు’ (రక్షకుడు)గా ఈ చతురంగిణి నిలుస్తుందని జగద్గురు ఆకాంక్షించారు. క్షేత్రస్థాయిలో ప్రాథమికంగా పట్టిపాల్ నాయకత్వంలో 10 మంది రక్షకులు పనిచేస్తారని తెలిపారు. హిందూ సమాజంలో భయాన్ని తొలగించి, ధర్మమార్గంలో నిర్భయంగా నడిచేలా చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. శాస్త్రం (గ్రంథం), శస్త్రం (ఆయుధం) రెండింటి పరిధిలో ఉంటూ.. ధర్మ రక్షణకు ఈ సంస్థ కట్టుబడి ఉంటుందని ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ దళం కోసం రిజిస్ట్రేషన్లు తక్షణమే ప్రారంభమయ్యాయి.