24 March, 2026 | 4:33 AM

ఫిలిపీన్స్‌కు బియ్యం ఎగుమతి పెద్ద స్కాం X ఫిలిపీన్స్‌కు బియ్యం సమర్థనీయమే

24-03-2026 01:11 AM

ఫిలిపీన్స్‌కు బియ్యం ఎగుమతి పెద్ద స్కాం

  1.   10 లక్షల టన్నులకు ఒప్పందం.. 22,750 టన్నులు మాత్రమే ఎగుమతి
  2. మీ అడ్వైజర్ ప్రేమ్ చంద్ గార్గ్ ఎక్కడా?
  3. హౌస్ కమిటీ వేస్తే ఆధారాలతో నిరూపిస్తా
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేయడం పెద్ద స్కాం లాగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న ప్రేమ్‌చంద్‌గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్ పెట్టుకున్నది నిజమా కాదా, ఈ అడ్వైజర్ ఇచ్చిన సలహా వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం నిజమా కాదా? చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. పది లక్షల మెట్రిక్ టన్నులు ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేస్తామని ఎంఓయూ చేసుకున్నామని, ఇదేదో పెద్ద ఇంటర్నేషన్ అగ్రిమెంట్ అని, మా విజయం అని గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు.

10 లక్షల టన్నుల ఎగుమతికి ఎంఓయూ చేసుకుంటే 22,750 టన్నుల దగ్గరే ఎందుకు ఆగిపోయారని ప్రశ్నించారు. మరో 7,500 టన్నులు ఏడాది నుంచి కాకినాడ పోర్టులో పురుగులు పడి ముక్కిపోయి ఉన్న మాట వాస్తవమా? కాదా అని నిలదీశారు. ఎందుకు ఏడాది నుంచి పోర్టులో ఉందని, ఎందుకు ఎగుమతి ఆగిపోయిందని నిలదీశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న మీ అడ్వైజర్ ఎక్కడ పోయారని, వాటాలు తేలకపోవడమే ఎగుమతి ఆగిపోవడానికి కారణమా? అని ప్రశ్నించారు.

ఈ సివిల్ సప్లైలో జరిగిన అన్ని కుంభకోణాలపై హౌజ్ కమిటీ వేస్తే ఆధారలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు. తప్పు చేయకపోతే హౌజ్ కమిటీకి ముందుకు రావాలని సవాల్ విసిరారు. లేదంటే మీరు తప్పు చేసినట్లుగానే రాష్ట్ర ప్రజలు భావిస్తారని చెప్పారు. రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చేది ఖాయమని, ఈ కుంభకోణాలపై విచారణ జరిపించేది ఖాయమని హెచ్చరించారు. 

ఫిలిపీన్స్‌కు బియ్యం సమర్థనీయమే

  1. ఎగుమతికి సిఫార్సు చేసిందే హరీశ్‌రావు
  2. హౌస్ కమిటీ వేస్తే గత ప్రభుత్వ ఒప్పందాల పరిశీలనకే పరిమితం కావాలి
  3. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ 

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతి ముమ్మాటికీ సమర్థనీయమేనని, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్ర పౌర సరఫరాల శాఖపై రూ.13 కోట్ల భారం తప్పినట్లైందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎగుమతులతో తెలంగాణ బియ్యానికి భారీగా డి మాండ్ పెరిగి భారతదేశంలోనే అత్యధికంగా క్వింటాలుకు రూ.3,600 ధర పలికిందని వెల్లడించారు.

ప్రేమ్‌చంద్‌గార్గ్‌కు, ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతులకు ఎలాంటి సంబం ధం లేదని, ఇది కేవలం తెలంగాణ ప్రభు త్వం, ఫిలిపీన్స్ ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందమన్నారు. ఫిలిప్పీన్స్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా అక్కడ అన్ని రకాల దిగుమతులపై ఆంక్షలు విధించారని, కేవలం తెలంగాణ బియ్యం దిగుమతికి మాత్రమే మినహాయింపు ఇచ్చారని తెలిపారు. కేవలం రేషన్ బియ్యం షిప్‌మెంట్ మాత్రమే కాకినాడలో ఆగిపోయిందని స్పష్టం చేశారు.

హరీశ్ రావు కోరుతున్నట్లు హౌస్ కమిటీ వేస్తే ఆయన మంత్రిగా ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలను పరిశీలించేందుకే పరిమితం చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టిన ఎగుమతుల కార్యక్రమాన్ని దృష్టి మరల్చేందుకే హరీశ్‌రావు ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవానికి హరీశ్‌రావే పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ను సంప్రదించి బియ్యం ఎగుమతులలో తనకు అనువైన అనుచరిడికి అవకా శం ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

నిజాలు దాచి సభను, రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతుల ఒప్పందంపై ఎటువంటి అపోహలకు ఆస్కారమే లేదని ఆయన కొట్టి పారేశారు. అంతర్జాతీయ కొనుగోలు దారులతో తెలంగాణ బియ్యం ఎగుమతుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా దేశాల ప్రభుత్వ ప్రతినిధులతో మాత్రమే సంప్రదించి ఒప్పందం కుదుర్చుకుంటుందన్నారు.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతి చేయడం విజయవంతంగా జరిగిందని, తద్వారా థాయ్ లాండ్, వియత్నాం, కంబోడియా వంటి దేశాలకు చెందిన బియ్యం బ్రాండ్ల సరసన తెలంగాణ బియ్యాన్ని నిలబెట్టినట్టు అయిందని ఆయన వివరించారు. దేశంలో ఫిలిఫీన్స్‌కు మొదటిసారి ఎగుమతి చేసిన రాష్ట్రం తెలంగాణనే అని, ఇది ల్యాండ్ మార్క్ అఛీవ్‌మెంట్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి లొసుగులున్నాయని విమర్శించడం సరికాదన్నారు.