16 July, 2026 | 8:09 PM

ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు మొబైల్ యాప్

17-04-2024 12:00 AM

ముంబై, ఏప్రిల్ 16:  కేంద్ర ప్రభుత్వ బాండ్లు, రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లులు తదితర ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిటైల్ మదుపరులు పెట్టుబడులు చేసేందుకు రిజర్వ్‌బ్యాంక్ ఒక మొబైల్ యాప్‌ను తీసుకురానుంది. ఈ తరహా పెట్టుబడులకు ఉద్దేశించిన రిటైల్ డైరెక్ట్ పోర్టల్‌కు ఈ మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తారు. ప్రస్తుతం రిటైలర్లు ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు రిటైల్ డైరెక్ట్ పోర్టల్ వెబ్‌సైట్‌ను లాగిన్ చేస్తున్నారు. ఇక మీదట సింపుల్‌గా మొబైల్ యాప్ ద్వారానే పెట్టుబడి చేయవచ్చు. 2021 నవంబర్‌లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను ప్రారంభించామని, ఇప్పుడు రిటైల్ డైరెక్ట్ పోర్టల్‌ను యాక్సెస్ చేసేందుకు మొబైల్ యాప్‌ను తీసుకు వస్తున్నామని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ వెల్లడించారు. ఇది త్వరలోనే వినియోగంలోకి రానుంది.

బాండ్లు కొనే మార్గాలు

ప్రభుత్వ బాండ్లను కొనేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు రిజర్వ్‌బ్యాంక్ వద్ద ఒక రిటైల్ డైరెక్ట్ గిల్ట్ (ఆర్‌డీజీ) అకౌంట్‌ను ఆన్‌లైన్ పోర్టల్‌లో (https://rbiretaildirect.org.in) ఓపెన్ చేసుకోవాలి. పెట్టుబడులు ఈ మార్గాల్లో చేసుకోవాలి...

ప్రభుత్వ సెక్యూరిటీల జారీ : తొలిసారిగా ప్రైమరీ మార్కెట్లో ప్రభుత్వ బాండ్లను జారీచేసేటపుడు వాటికోసం వేలం బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. మీరు బిడ్ చేసిన ధర అలాట్‌మెంట్ ధర పరిధిలో ఉంటే మీకు బాండ్ల కేటాయింపు జరుగుతుంది.

సెకండరీ మార్కెట్: ఎన్‌డీఎస్ ఓఎం(‘ఆడ్ లాట్’, ‘రిక్వెస్ట్ ఫర్ కోట్స్’ విభాగాల్లో) ప్లాట్‌ఫాంపై ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించవచ్చు. కొనవచ్చు. 

ఎస్‌జీబీ: రిటైల్ డైరెక్ట్ పోర్టల్ లేదా దానిని యాక్సెస్ చేసుకునే మొబైల్ యాప్ ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్‌ను (ఎస్‌జీబీ) కూడా రిటైల్ ఇన్వెస్టర్లు కొనవచ్చు. 

చెల్లింపులు: ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా యూపీఐ నుంచి చెల్లింపులు చేయవచ్చు. 

రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ : ఆర్బీఐ వద్ద రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్‌ను ప్రారంభించాలంటే ఇండియాలో రూపీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, పాన్, ఇతర కేవైసీ డాక్యుమెంట్ (ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ తదితరాలు) ఉండాలి. అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, వ్యాలిడ్ మొబైల్ నంబర్ కలిగిఉండాలి.  రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ తెరవడానికి, నిర్వహించడానికి ఎటువంటి ఫీజు లేదు.