విద్యార్థి జీవితంలో గురుతర బాధ్యత
నేడు ఉపాధ్యాయ దినోత్సవం :
భారతీయ సంస్కృతిలో(Indian Culture) గురువుకు అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత మనిషి జీవితాన్ని తీర్చిదిద్దే వ్యక్తిగా గురువును(Guru) భావించడం మన సంప్రదాయంలో భాగం. ‘గురువు లేని విద్య(Education) గుడ్డి విద్య’ అనే భావన కూడా విద్యకు గురువు మార్గదర్శకత్వం(Guidance) ఎంత అవసరమో తెలియజేస్తుంది. ఏ రంగంలోనైనా జ్ఞానాన్ని సంపాదించడంతో పాటు, ఆ జ్ఞానాన్ని సరైన దిశలో ఉపయోగించేందుకు గురువు మార్గనిర్దేశనం ఎంతో అవసరం.
ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్న త స్థాయికి ఎదగడానికి తల్లిదండ్రుల తర్వాత గురువు బోధనలు కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఉపాధ్యాయ వృత్తి కేవలం పాఠ్యాంశాలను బోధించే ఉద్యోగం కాదు; సమాజంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాం స్కృతిక మార్పులకు పునాది వేసే బాధ్యతాయుతమైన వృత్తి. విద్యార్థిలో ప్రశ్నించే తత్వాన్ని, విచక్షణను, మానవత్వాన్ని, నైతిక విలువలను పెంపొందించడం నిజమైన ఉపాధ్యాయుని ప్రధాన కర్తవ్యం. ఆధునిక భారతదేశం లో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
భారత మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, తత్వవేత్త, ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజును ఉపాధ్యాయ దినో త్సవంగా నిర్వహిస్తున్నారు. తన జ న్మదినాన్ని వ్యక్తిగత వేడుకగా కాకుం డా ఉపాధ్యాయ వృత్తికి గౌరవం కల్పించే రోజుగా జరపాలని ఆయన కోరినట్లు చరిత్ర చెబుతోంది. అయి తే భారతదేశ విద్యా చరిత్రను మరిం త విస్తృత దృక్పథంతో పరిశీలిస్తే, విద్యను అణగారిన వర్గాలకు అం దించేందుకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయులను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది.
మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు కుల, లింగ వివక్షలను ఎదుర్కొంటూ విద్యను సామాజిక విముక్తికి ఆయుధంగా మలిచారు. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే భారతదేశంలో బాలికల విద్యకు మార్గదర్శకురాలిగా నిలిచారు. విద్య ద్వారా సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం సాధించవచ్చని వారు తమ కార్యాచరణ ద్వారా నిరూపించారు.
అందువల్ల జనవరి 3న సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించాలనే డిమాండ్ కూడా సమాజంలో వినిపిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తి గౌరవానికి సంబంధించిన విషయం కాకుండా, భారతదేశ విద్యా చరిత్రలో అణగారిన వర్గాల విద్యా పోరాటాలకు గుర్తింపు ఇవ్వాలనే విస్తృతమైన సామాజిక ఆకాంక్షగా చూడవచ్చు. విద్య అంటే కేవ లం పుస్తకాల్లోని విషయాలను కంఠస్థం చేయడం కాదు.
సత్యాన్ని సత్యం గా, అసత్యాన్ని అసత్యంగా గుర్తించే విచక్షణను పెంపొందించడమే నిజమైన విద్య. ఈ దృక్పథంలో గౌతమ బుద్ధుని తార్కిక, ప్రశ్నించే, పరిశీలించే ఆలోచనా విధానం నేటి విద్యార్థులకు ఎంతో ప్రాసంగికమైనది. విద్యార్థు లు మూఢనమ్మకాలకు లోనుకాకుండా ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ, పరిశీలిస్తూ, ఆధారాలతో అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి.
ఉపాధ్యాయుడు తరగతి గదిలో మాత్రమే కాకుండా సమాజ పరివర్తనలోనూ భాగస్వామి కావాలి. అదే సమయంలో గురు శిష్య సంబంధంలో పరస్పర గౌరవం, విశ్వాసం, క్రమశిక్షణ ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లల కు గురువులను గౌరవించడం నేర్పడంతో పాటు, ప్రశ్నించడం, తప్పును గుర్తించడం కూడా నేర్పాలి.
అంతిమంగా, విద్యార్థులకు జ్ఞానాన్ని అందించేవాడు ఉపాధ్యాయుడు కాదు; వారి మనోనేత్రాలను తెరిచి సత్యాన్ని చూడగలిగే శక్తిని అందించేవారే నిజమైన గురువు. సమాజాన్ని ప్రశ్నించే ధైర్యం, అసమానతలను ఎదిరించే చైతన్యం, మానవత్వాన్ని కాపాడే నైతిక విలువలు, రాజ్యాంగ స్ఫూర్తితో సమానత్వాన్ని నిర్మించే బాధ్యతను విద్యార్థుల్లో పెంపొందించడమే ఉపాధ్యాయుని అసలైన విజయంగా భావించాలి.
వ్యాసకర్త సెల్: 9553041549






