ఐటీలో కొత్త ట్రెండ్
- పెరిగిన ఉద్యోగుల తలసరి ఆదాయం
- ఈ ఏడాది ప్రముఖ కంపెనీల్లో 3-4 శాతం వృద్ధి
- ఉత్పాదకతకే కంపెనీల ప్రాధాన్యం
- తక్కువ ఉద్యోగులతో ఎక్కువ అవుట్ పుట్‌పై దృష్టి
- ఏఐ కారణంగా కీలక మార్పులు

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో ఐటీ రంగం కొత్త దశలోకి అడుగుపెడుతోంది. గత కొంత కాలంగా భారత ఐటీ రం గంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగుల తలసరి ఆదాయం పెరుగుదలతో కంపెనీలు ఉత్పాదకత ఆధారిత వృద్ధిపైనే దృష్టి సారిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రముఖ ఐటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా ఉద్యోగి తలసరి ఆదాయంలో 3- నుంచి 4 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
ఏఐ, ఆటోమేషన్ వినియోగంతో కంపెనీలు తక్కువ ఉద్యోగులతోనే ఎక్కువ అవుట్‌పుట్ సాధిస్తున్నాయి. దీంతో సాధారణంగా ఉన్న సంఖ్య ఆధారిత ఆదాయ మోడల్ క్రమంగా మారుతోంది. ప్రస్తుతం ఉద్యోగుల యూటీలైజేషన్ రేటు 85 శాతానికి పెరగడం కూడా ఈ ఉత్పాదకత పెరుగుదలకు తోడ్పడుతోంది. ఉద్యోగులను ఎక్కువగా బిల్లబుల్ పనుల్లో వినియోగించడం ద్వారా కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి.
ఇది ఐటీ రంగం ప్రారంభ దశలో ఉన్న పెద్ద మార్పు అని, భవిష్యత్‌లో ఏఐ ప్రభావం మరింత పెరిగే కొద్దీ ఉద్యోగి తలసరి ఆదాయం ఇంకా వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ వినియోగం పెరుగుదల నేపథ్యంలో సంస్థలు నియామకాలను తగ్గిస్తూ సామర్థ్యాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో ప్రముఖ కంపెనీలు ఉద్యోగుల సంఖ్య తగ్గించుకున్నప్పటికీ, ఉద్యోగి తలసరి ఆదాయంలో వృద్ధిని సాధించాయి.
భారతీయ ఐటీ రంగం ఇప్పటి వరకు కొనసాగించిన నియామకాల విధానానికి బదులుగా కొత్త వర్క్‌ఫోర్స్ మోడల్ వైపు వేగంగా మారుతోంది. ఇందులో భాగంగా మొత్తం ఉద్యోగుల సంఖ్య పరిమితం చేయడం, తక్కువ ఖర్చుతో జూనియర్ లెవెల్ నియామకాలు, పైస్థాయిలో ఏఐ, డొమైన్, కన్సల్టింగ్ నిపుణులకు అధిక ప్రాధాన్యం వంటివి సంస్థలకు రెండు విధాలుగా ప్రయోజనం ఇస్తోందని భావిస్తున్నాయి.
నైపుణ్యం ఉన్న ఉద్యోగులకే ఎక్కువ డిమాండ్
ఏఐ టూల్స్, ఆటోమేషన్ వల్ల మధ్యస్థాయి పనుల అవసరం తగ్గిపోగా, నైపుణ్యం ఉన్న ఉద్యోగులకే ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఐటీ రంగంలో కొత్త వర్క్‌ఫోర్స్ మోడల్ అనేది ఉద్యోగుల సంఖ్య కంటే నై పుణ్యం, సామర్థ్యం, టెక్నాలజీ ఆధారంగా రూపుదిద్దుకుం టోంది.
ప్లాట్‌ఫామ్ ఆధారిత వ్యాపారం వైపు మొగ్గు
గతంలో ఐటీ రంగంలో కస్టమర్లకు గంటల ఆధారంగా సేవలు అందించి ఆదాయం పొందే విధానానికి ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు ఆ స్థానం ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ప్లాట్‌ఫాములను తీసుకుంటు న్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా వంటివి ఇప్పటికే ఈ మార్పును ఆచరణలోకి తీసుకువస్తున్నాయి. దీనిలో భాగంగా ఏఐ మోడల్స్, ఆటోమేషన్ టూల్స్ ద్వారా సేవల అందించడం, సొంత ఐపీ ఆధారంగా ఆదాయం, థర్డ్ పార్టీ డిజిటల్ ప్లాట్‌ఫాములతో భాగస్వామ్యం, సర్వీసెస్ యాజ్ సాఫ్ట్‌వేర్ కాన్సెప్ట్ వైపు అడుగులు వేస్తున్నాయి.
దీంతో కంపెనీలు ఒకే సొల్యూషన్‌ను పలువురు కస్టమర్లకు అందించి ఎక్కువ ఆదా యం పొందగలుగుతున్నాయి. ఉద్యోగుల సంఖ్య పెంచకుండా కూడా వ్యాపారాన్ని విస్తరించగలుగుతున్నాయి. దీని కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య కంటే టెక్నాలజీ సామర్థ్యం ఆదాయాన్ని నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతోంది. మొత్తంగా ప్లాట్‌ఫామ్ ఆధారిత వ్యాపారం ఐటీ రంగంలో భవిష్యత్ వృద్ధికి కీలకంగా మారుతోంది.
ఇదిలా ఉండగా ఐటీ రంగంలో ముఖ్యంగా యూటీలైజేషన్ రేటు పెరుగుదలతో ఉత్పాదకత పెరుగుతుంది. ఇదే సమ యంలో బెంచ్‌లో ఉండే ఉద్యోగుల శాతం గణనీయంగా తగ్గింది. మొత్తంగా యూటీలైజేషన్ పెరుగుదల, బెంచ్‌పై ఉద్యోగుల తగ్గింపుతో ఐటీలో తలసరి ఆదాయం పెరుగుదలకు దోహదం చేస్తుంది.
భవిష్యత్‌లో మరింత మార్పు
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న మార్పులతో పోలిస్తే భవిష్యత్‌లో మరింత మార్పు లకు ఐటీ రంగం వేదిక అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ప్లాట్‌ఫాముల విస్తరణతో వృద్ధి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగి తలసరి ఆదాయం పెరుగుదల ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో ఇది కూడా గణనీయం గా పెరిగే సూచనలున్నాయి.
ప్రస్తుత మార్పునకు అనుగుణంగా అంతర్జాతీయ ఐటీ కంపెనీలు చాలా వరకు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. భవిష్యత్‌లో అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత నాన్- లీనియర్ గ్రోత్ వేగవంతం, ప్లాట్‌ఫామ్, ప్రాడక్ట్ ఆధారిత ఆదాయ మోడల్స్ విస్తరణ, ఏఐ, డేటా, కన్సల్టింగ్‌కు భారీ డిమాండ్, మధ్య స్థాయి పనులలో ఆటోమేషన్ పెరుగుదల, ఉద్యోగి తలసరి ఆదా యం లక్ష డాలర్ల స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఈ మార్పు వెంటనే పూర్తిగా కనిపించకపోయినా.. నియామకాలు, వినియోగం, మార్కెట్ పరిస్థితుల్లో తాత్కాలిక ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ప్రస్తుత ఐటీ రంగం ఉద్యోగుల సంఖ్యల ఆధారిత వృద్ధి నుంచి సాంకేతికత ఆధారిత విలువ సృష్టించడం వైపునకు సాగనున్నది.






