28 June, 2026 | 1:14 AM

హెచ్‌ఎంఆర్ ఏఎండీగా అజిత్‌రెడ్డి

28-06-2026 12:13 AM
  1. టీజీ రెరా చైర్మన్‌గా కేఎస్ శ్రీనివాసరాజు
  2. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): ఇన్వెస్ట్ తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైన సీనియర్ అధికారి అజిత్ రెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. ఆయనను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్(ఏఎండీ)గా నియమించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం ఐటీ అండ్ సీ శాఖ పరిధిలోని ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సీఈఓగా సేవలు అందిస్తున్న అజిత్ రెడ్డికి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీ పోస్టుకు సంబంధించిన పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులు వేగవంతం అవుతున్న తరుణంలో, ఈ కీలక పోస్టులో అజిత్ రెడ్డి నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

టీజీ రెరా చైర్మన్‌గా శ్రీనివాసరాజు...

తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన రెండు కీలక నియామకాలను చేపట్టింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే.ఎస్. శ్రీనివాస రాజును తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ రెరా) చైర్మన్‌గా నియమించింది. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం--2016లోని సెక్షన్ 22, తెలంగాణ రూల్స్- 2017లోని రూల్ 17 ప్రకారం ఈ నియామకం చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

అదే విధంగా రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి వేముల శ్రీకర్‌ను తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో టెక్నికల్/అడ్మినిస్ట్రేటివ్ మెంబర్‌గా నియమించింది. రియల్ ఎస్టేట్ చట్టం-2016లోని సెక్షన్ 46(3), తెలంగాణ రూల్స్-2017లోని రూల్ 26 ప్రకారం ఈ నియామకం జరిగినట్లు పేర్కొంది.

ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) శాఖ రెండు వేర్వేరు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరి పదవీకాలం, వేతనం, భత్యాలు, ఇతర సేవా నిబంధనలు రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం--2016తో పాటు తెలంగాణ రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) రూల్స్-2017 ప్రకారం అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.