ఉపాధ్యాయులకు సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేయాలి
టీఆర్టీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం
సిద్దిపేట, జూలై 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యను పరిష్కరించేందుకు కోర్టు సూచించిన సమాంతర వ్యవస్థను వెంటనే అమలు చేసి పదోన్నతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన టీఆర్టీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం ఆమోదించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం సర్వీస్ నిబంధనలకు సంబంధించిన వివాదం కోర్టు పరిధిలో ఉండటంతో వేలాది మంది ఉపాధ్యాయుల పదోన్నతులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు కోర్టు సూచించిన సమాంతర వ్యవస్థే సరైన మార్గమని పేర్కొన్నారు.
ఎంఈఓ, డిప్యూటీ ఈవో స్థాయి పోస్టులను సమాంతర వ్యవస్థ ద్వారా భర్తీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదని తెలిపారు. జిల్లా విద్యాశాఖలోని పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ పదోన్నతులు కల్పించడం ద్వారా విద్యాశాఖలో సమర్థవంతమైన పర్యవేక్షణ, పరిపాలనకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు. ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారంపైనా రాష్ట్ర కార్యవర్గం పలు డిమాండ్లు చేసింది.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరింది. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయడంతో పాటు, నూతన పీఆర్సీ నివేదిక ఆధారంగా 51 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆగస్టు 1 నాటికి ఉన్న ఖాళీలను ప్రాతిపదికగా తీసుకుని బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని, జీవో-317 వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు జీవో-190 ప్రకారం స్వంత జిల్లాలకు బదిలీలు కల్పించాలని, స్పౌజ్ బదిలీల హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్ పరీక్షలో అన్ని కేటగిరీలకు 40 శాతం అర్హత మార్కులను నిర్ణయించాలని, సీనియర్ ఉపాధ్యాయులకు సర్వీస్ వెయిటేజీ మార్కులు ఇవ్వాలని, సంబంధిత సబ్జెక్టుకు అనుగుణంగా ప్రశ్నపత్రాలు రూపొందించాలని సూచించారు. 5,700 కొత్త పీఎస్హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయడం, భాషా పండితులు, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయడం, గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం,
ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి వైద్య చికిత్సలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర చీఫ్ పాట్రన్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు కావలి అశోక్ కుమార్, విష్ణుమూర్తి, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి భైతి ఐలయ్య, మెంబర్షిప్ కన్వీనర్ సుంకిశీల ప్రభాకర్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మహేందర్, ప్రధాన కార్యదర్శి సుశాంత్తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.






