21 July, 2026 | 7:25 AM

ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి

20-07-2026 05:25 PM

ముద్దసాని 70 వ జయంతి సందర్బంగా ఘన నివాళులు

ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు పోలాడి రామారావు

మానకొండూరు,(విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి మాజీ మంత్రి, అప్పటి కమలాపూర్ మాజీ శాసన సభ్యులు కీ.శే.ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని సీనియర్ నాయకులు, రైతు ప్రజా సంఘాల జాతీయి అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. కీ. శే. ముద్దసాని దామోదర్ రెడ్డి 70 వ జయంతి సందర్బంగా కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని, సదాశివపల్లి కూడలి వద్ద నెలకొల్పిన దామోదర్ రెడ్డి విగ్రహానికి నాయకులతో కలిసి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ముందుగా నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఆయన స్వీట్లు, పండ్లు పంపిణి చేశారు. ఈ సందర్బంగా పోలాడి రామారావు మాట్లాడుతూ 29ఏళ్లకే ఎమ్మెల్యే గా, 30ఏళ్ల కే మంత్రిగా పని చేసిన దామోదర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ మంత్రి వర్గం లో భూగర్భ గనుల శాఖల మంత్రి గా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాబినెట్ లో సాంకేతిక విద్యా శాఖ,రవాణా శాఖల మంత్రిగా పని చేసి కమలాపూర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి విశేష సేవలు అందించారన్నారు.

వరుసగా నాలుగు సార్లు ఎంఎల్ గా గెలుపొందిన ముద్దసాని పాత హుజురాబాద్ తాలూకా పరిధిలోని ఎస్ఆర్ఎస్ పి ఆయకట్టు రైతులందరికి చివరి రైతు ఆయకట్టు వరకు కెనాల్ ద్వారా నీళ్లు అందేవరకు నిత్యం కాలువల వెంట పర్యవేక్షణ చేసిన ముద్దసాని రైతుల్లో చిరస్తాయిగా నిలిచారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పల్లెకు బీ టీ రోడ్లు నిర్మించారన్నారు.అను నిత్యం సామాన్యులకు అర్ధ రాత్రి దాటినా కూడా పేద, బడుగు బలహీన వర్గాలకు,రైతులకు, యువతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేశారాన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గా ఉమ్మడి జిల్లాలో టీడీపీ ని పటిష్టం చేసి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే వారన్నారు. కరీంనగర్ జిల్లా టైగర్ గా డేరింగ్, డాషింగ్ డైనమిక్ లీడర్ గా దామన్నగా జిల్లా సామాన్య ప్రజల్లో మాస్ లీడర్ గా ప్రజాదరణతో అన్ని వర్గాల్లో చెరగని ముద్రవేసుకున్నారన్నారు. దామోదర్ రెడ్డి లాంటి నాయకులు నేడు అరుదని వ్యాఖ్యానించారు. ఎందరో సామాన్య కార్యకర్తలను నాయకులుగా ఎమ్మెల్యే లుగా తీర్చి దిద్దిన దామోదర్ రెడ్డి మా అందరికి స్ఫూర్తి దాయకమని ఆయన ఆశయాలను పాటిస్తూ ఆయన బాటలో నడవడమే నిజమైన నివాళి అని పోలాడి రామారావు అన్నారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య,గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తుమల్లేశం,స్థానిక కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్,నాయకులు కొత్తూరు జగన్ గౌడ్,ముద్దసాని కృష్ణారెడ్డి. ఆడెపు కమలాకర్, సింగిరెడ్డి ఎల్లారెడ్డి,బండి నరేష్ కార్పొరేటర్ అజయ్ గౌడ్, కనకం కుమార్, తాళ్లపల్లి అంజయ్య ల తో పాటు ముద్దసాని అభిమానులు ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.