20 April, 2026 | 2:42 AM

రోడ్డా.. రిస్కా? ప్రాణాలతో చెలగాటం!

20-04-2026 01:25 AM
  1. బిజీకొత్తూరు మొండికుంట కట్టుకాలువ మార్గంలో నరకం

‘హెల్మెట్ పెట్టుకోమంటారు.. మరి రోడ్ల సంగతేంటి?’ అని అధికారులపై జనం ఫైర్

చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ఆర్ అండ్ బీ అధికారులు

అశ్వాపురం, ఏప్రిల్ 19 ,(విజయ క్రాంతి): ‘బండి ఎక్కితే చాలు.. హెల్మెట్ ఉందా? లేదా? అని ఫైన్లు వేసే అధికారులు.. ప్రాణాలు తీస్తున్న రోడ్ల పరిస్థితిని మాత్రం పట్టించుకోరా?‘ అంటూ వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ప్రధాన రహదారుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ముఖ్యంగా బిజీకొత్తూరు రోడ్డు నుంచి మొండికుంట కట్టుకాలువ వరకు ప్రయాణం అంటే ద్విచక్ర వాహనదారులకు హడల్ పుడుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.

ఎత్తుపల్లాలుగా మారిన రోడ్లు.. ప్రయాణమే ప్రమాదం

వేసవి ఎండల తీవ్రతకు రోడ్డు వేసిన డాంబర్ కరిగిపోయి అంచుల వద్ద పైకి లేచింది. రోడ్డు మధ్యలో కాకుండా రెండు వైపులా ఎత్తుగా ఉబ్బిపోవడం, దానికి ఆనుకునే ప్రమాదకరమైన గుంతలు ఏర్పడటంతో ఈ మార్గం మృత్యుఒడిలా మారింది. ద్విచక్ర వాహనదారులు రోడ్డు పక్కగా వెళ్లినా, మధ్యలో వెళ్లినా.. టైరు ఏమాత్రం జారినా నేరుగా కింద పడి తీవ్ర గాయాలపాలయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ మార్గంలో పలుచోట్ల వాహనాలు అదుపు తప్పి పడిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు.

హెల్మెట్ రూల్స్ పై ఉన్న శ్రద్ధ.. గుంతల రోడ్లపై ఏదీ?

ప్రమాదాలు నివారించడానికి హెల్మెట్ తప్పనిసరి అని అధికారులు పదేపదే చెబుతారు, రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు రాసి ముక్కుపిండి వసూలు చేస్తారు. కానీ, అసలు ప్రమాదాలకు కారణమవుతున్న ఈ అధ్వాన్నపు రోడ్లను బాగుచేయాలన్న కనీస బాధ్యత లేదా అని ప్రజలు సూటిగా నిలదీస్తున్నారు. ‘మేము హెల్మెట్ పెట్టుకున్నా సరే.. ఈ గుంతల్లో పడితే ప్రాణాలు పోవడం లేదా కాళ్లు, చేతులు విరగడం ఖాయం. ప్రజల భద్రత అంటే కేవలం చలాన్లు వేయడమేనా? రోడ్లు సరిగ్గా ఉంటే సగం ప్రమాదాలు వాటంతట అవే ఆగిపోతాయి కదా?‘ అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

నిద్రమత్తులో అధికారులు

పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నా.. సంబంధిత రోడ్లు, భవనాల శాఖ (R&B) అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించే ముందు, కనీసం ప్రయాణించడానికి వీలు గా రోడ్లను సురక్షితంగా మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఈ రహదారిపై ఉన్న ఎత్తుపల్లాలను సరిచేసి,

రోడ్డును బాగుచేయకపోతే మరిన్ని ఘోర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.