19 August, 2026 | 3:31 PM

Breaking News

స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు

19-08-2026 02:29 PM

- విలేకరుల సమావేశంలో వెల్లడించిన డి.ఎస్.పి

టేకులపల్లి,(విజయక్రాంతి): స్కూటీ డిక్కీలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.4.76 లక్షల విలువైన 9.520 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇల్లెందు డిఎస్పి యు.వెంకన్నబాబు టేకులపల్లి లో బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టేకులపల్లి ఎస్‌ఐ కె.తిరుపతి సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం వెంకట్యాతండా గ్రామ శివారులోని నర్సయిగూడెం రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నంబర్‌ ప్లేట్ లేని జూపిటర్‌ స్కూటీని తనిఖీ చేయగా డిక్కీలో 10 ప్యాకెట్లలో గంజాయి బయటపడింది.

ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా కలిమెల మండలం గుముక గ్రామానికి చెందిన టపాన్‌ మండల్‌ (46)ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి సూర్యాపేట టోల్‌గేట్‌ వద్ద మరో వ్యక్తికి అందించేందుకు వెళ్తున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. సరఫరాదారు, గంజాయి స్వీకరించే వ్యక్తి పరారీలో ఉన్నట్లు డి.ఎస్.పి. తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ కె.తిరుపతి, సిబ్బంది బి.భాస్కర్, టి.చక్రధర్‌రాజు, పి.రవికుమార్, బి.సురేష్, బి.అనంతరాములు, ఎం.ప్రవీణ్‌కుమార్‌లను ఇల్లందు డీఎస్పీ యు.వెంకన్నబాబు అభినందించారు. విలేకరుల సమావేశంలో టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి ఎస్సై తిరుపతి, బోడు ఎస్సై రాజమౌళి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.