20 March, 2026 | 9:04 AM

ప్రాక్టీస్‌లోనే సిక్సర్ల వర్షం

20-03-2026 12:00 AM

దంచికొట్టిన విరాట్ కోహ్లీ

బెంగళూరు, మార్చి 19 : ఐపీఎల్- 19వ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆర్సీబీ జట్టుతో చేరిన కోహ్లి.. తన తొలి నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లి తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. ముఖ్యంగా ఫుట్‌వర్క్ ఉపయోగిస్తూ ముందుకు వచ్చి మరి భారీ షాట్ల తో విరుచుపడ్డాడు.

దాదాపు ఏడాది నుంచి కేవలం వన్డేలకు పరిమితమైన కోహ్లి.. ఇప్పు డు టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా తన బ్యాటింగ్‌ను మలుచుకున్నాడు. కోహ్లి ప్రస్తుతం అ ద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ తను చివరగా ఆడిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా వన్డే సిరీలలో అదరగొట్టాడు.సౌతాఫ్రికాపై 3 మ్యాచ్‌లలో 151 సగటుతో 302 పరుగులు చేశాడు. దీనిలో రెండు సెం చరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై కూడా తన ఫామ్ కొనసాగించాడు. 

3 మ్యాచ్‌లలో 80 సగటుతో 240 పరుగులు చేశాడు. ఇప్పుడు అదే జోరును ఐపీఎల్లో కూడా కొనసాగించాలని కింగ్ ఉవ్విళ్లూరుతున్నాడు. కాగా గత సీజన్‌లోనూ కోహ్లి అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్‌లలో 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.

ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో కోహ్లిది కీలక పాత్ర పోషించిన కోహ్లి తన జోరు కొనసాగిస్తే మాత్రం బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీ అందుకోవడం ఖాయం. ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.