మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాడు జిల్లా పోలీసు అధికారులతో, ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదైన దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి పై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా ఎస్పీ నిర్వహించారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసులను, వేగవంతంగా పూర్తి చేసి, సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించి త్వరితగతిన ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా విచారణ చేపట్టాలని, పరారీలో ఉన్న నిందితులను గుర్తించి ప్రత్యేక బృందాల ద్వారా వెంటనే అరెస్టు చేయాలని, వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొనే వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, అక్రమంగా సంపాదించిన ఆస్తులపై, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించి,కౌన్సెలింగ్ అందించడంతో పాటు డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపించే ప్రక్రియను, సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి సబ్ డివిజన్ వారీగా డీ-అడిక్షన్ కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.
జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి పోలీస్ అధికారి బాధ్యతతో పనిచేయాలని, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి,యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, జిల్లాలోని సీఐలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






