27 July, 2026 | 10:10 PM

న్యాయం జరగకపోతే ఓటు హక్కు రద్దు చేసుకుంటాం

27-07-2026 09:36 PM

ఆర్డీవో, కలెక్టర్, ఎన్నికల సంఘానికి పోతారం గ్రామ బాధిత కుటుంబం వినతి

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం గ్రామానికి చెందిన జునగిరి మొండి తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మంథని ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌తో పాటు భారత ఎన్నికల సంఘానికి సోమవారం వినతిపత్రం సమర్పించారు. తన నాన్నమ్మ జునగిరి నాగమ్మ మరణంపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన మార్గాల్లో ఫిర్యాదులు చేసినా తమ సమస్యపై ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదని తెలిపారు.

దీంతో తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనతో పాటు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు కలిగిన పౌరులమైన తమకు రక్షణ, న్యాయం, సమానత్వం అందడం లేదనే భావన కలుగుతోందని, ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లిందన్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యుల ఓటు హక్కును రద్దు చేసి, తమకు మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) జారీ చేయాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.

అయితే తమ ప్రధాన డిమాండ్ మాత్రం జునగిరి నాగమ్మ మరణంపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించి వాస్తవాలను వెలికితీసి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడమేనని జునగిరి మొండి స్పష్టం చేశారు. తమ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ వినతిపత్రం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారనే అంశం ఆసక్తికరంగా మారగా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.