డాలర్ బలం.. రూపాయి భారం
ఇప్పటికీ ఒక దేశంలో తీసుకునే నిర్ణయాలు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల కరెన్సీలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచాన్ని తప్పుబట్టే ముందు మన బలహీనతలను చూడాలి. అంతర్జాతీయ పరిస్థితులను నిందించడం సులభమే. కానీ, ప్రతి సమస్యకు విదేశీ కారణాలనే చూపిస్తే, మన నిర్మాణాత్మక బలహీనతలు కనిపించకుండాపోతాయి.
రూపాయి మారకపు విలువలో హెచ్చుతగ్గులు కేవలం పత్రికల వాణిజ్య పేజీల్లో చూసే అంకెలు కావు. అవి మన ఆర్థిక వ్యవస్థకు వచ్చే హెచ్చరిక సంకేతాలు. ప్రపంచ మార్కెట్లలో అమెరికన్ డాలర్ బలపడినప్పుడల్లా భారత రూపాయి విలువపై ఒత్తిడి పెరగడం ఇప్పుడు దాదాపు సహజ పరిణామంగా మారిపోయింది. దీనిని తరచూ ‘రూపాయి బలహీనపడటం కాదు, డాలర్ బలపడుతోంది’ అనే వివరణతో సరిపెట్టే ప్రయత్నం జరుగుతున్నది. దీనిని మనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ, అది చివరకు ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తాయి.
ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. కుటుంబాల ఖర్చులపై కనిపించని భారాన్ని మోపుతుంది. సాధారణ పౌరుడికి రూపాయి బలహీనత ఆర్థిక చార్టుల్లో కనిపించదు. అది ఇంటి ఖర్చుల లెక్కల్లో స్ప ష్టంగా కనిపిస్తుంది. వంటనూనె ధర కొంచెం పెరగడం, పెట్రోల్ బంకుల్లో ట్యాంక్ నింపడానికి మరో వంద రూపాయలు ఎక్కువ కావడం, పిల్లల చదువు ఖర్చులు లేదా నిత్యావసర వస్తువులపై అదనపు భారంగా మారడం ఇవే కరెన్సీ హెచ్చుతగ్గుల అసలు ముఖాలు. స్టాక్ మార్కెట్ స్క్రీన్లపై మారే అంకెలు కేవలం పెట్టుబడిదారులకే కనిపించవచ్చు. కానీ, కరెన్సీ విలువలో వచ్చే మార్పులు చివరికి ప్రతి ఇంటి వంటగదికి చేరుతాయి.
నియంత్రణలో లేని అంశాలు:
రూపాయిపై ఒత్తిడిలో పెద్ద భాగం మన దేశ సరిహద్దుల వెలుపల నుంచే వస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అమెరికన్ డాలర్ చుట్టూనే తిరుగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లు పెంచినప్పుడు, అంత ర్జాతీయ పెట్టుబడులు భద్రత కోసం డాలర్ వైపు కదులుతాయి. ఎక్కువ లాభాలు, తక్కువ ప్రమాదం కనిపించే చోటుకు మూలధనం వెళ్లడం సహజం. కానీ, దాని ప్రభావం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా పడుతుంది.
విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకుంటే, స్థానిక కరెన్సీలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇక చమురు అంశం మరింత కీలకం. మన ముడిచమురు అవసరాల్లో దా దాపు 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర కొన్ని డాలర్లు పెరిగినా, మన దేశానికి దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్త తలు లేదా సరఫరా గొలుసుల్లో అంతరాయాలు వచ్చినప్పుడు ఈ ప్రభావం మరింత పెరుగుతుంది.
అక్కడ నిర్ణయం.. ఇక్కడ ప్రభావం:
ఇప్పటికీ ఒక దేశంలో తీసుకునే నిర్ణయాలు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల కరెన్సీలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచాన్ని తప్పుబట్టే ముందు మన బలహీనతలను చూడాలి. అంతర్జాతీయ పరిస్థి తులను నిందించడం సులభమే. కానీ, ప్రతి సమస్యకు విదేశీ కారణాలనే చూపిస్తే, మన నిర్మాణాత్మక బలహీనతలు కనిపించకుండాపోతాయి. భారతదేశం ఐటీ, సేవారంగాల్లో ప్రపంచవ్యాప్తంగా విజయాలు సాధించినా, వస్తువుల వాణిజ్య లోటు ఇంకా ఒక ప్రధాన బలహీనతగానే ఉంది.
ఎలక్ట్రానిక్ పరికరాలు, సెమీకండక్టర్లు, రక్షణ పరికరాలు, అ ధునాతన సాంకేతిక ఉత్పత్తుల కోసం మనం ఇంకా విదేశాలపైనే అత్యధికంగా ఆధారపడుతున్నాం. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. మన పెట్టుబడి సం స్కృతి కూడా ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశ మే. మన కుటుంబాలు ప్రపంచంలోనే అత్యధిక బంగారం వినియోగదారుల్లో ఒకటిగా ఉన్నాయి. ఇది మన కుటుంబాలకు భద్రతగా అనిపించవచ్చు. కానీ, దేశ ఆర్థిక కోణంలో చూస్తే, ఉత్పాదక రంగాల్లోకి వెళ్లాల్సిన పెట్టుబడిలో కొంత భాగం నిరుత్పాదక ఆస్తుల్లో నిలిచిపోతుంది.
ఇది ఓ గొలుసుకట్టు
రూపాయి బలహీనపడటం ఒకే సమస్య కాదు. అది సమస్యల గొలుసు. ముడిచమురు ఖరీదవుతుంది. ఇంధన ధరలు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాని ప్రభావం వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు వ్యాపిస్తుంది. ఆర్థిక శాస్త్రంలో దీనిని దిగుమతి ద్రవ్యోల్బణం అంటారు. కానీ, సామాన్య కుటుంబానికి దీని అర్థం చాలా సులభం.
నెలాఖరులో పొదుపు కోసం ఉంచిన డబ్బులోంచి మరో ఖర్చు తీసేయాల్సి రావడం. ఐటీ, ఫార్మా, వస్త్ర రంగాలు వంటి కొన్ని ఎగుమతి ఆధారిత రంగాలు తాత్కాలిక లాభాలు పొందవ చ్చు. కానీ, కొన్ని కార్పొరేట్ లాభాలు కోట్లా ది కుటుంబాలపై పడే అదనపు భారాన్ని తగ్గించలేవు. రూపాయి నిరంతరం బలహీనపడటం అనేది ప్రభుత్వం ప్రకటించని ఒక నిశ్శబ్ద పన్నులా పనిచేస్తుంది. అది ఒక్కసారిగా భారంగా అనిపించదు. కానీ, కాలక్ర మేణా ప్రతి ఇంటికీ చేరుతుంది.
ఆర్థిక సంక్షోభం వస్తుందా?
రూపాయి పతనం మూలంగా ఆర్థిక సంక్షోభం వస్తుందా? అంటే సూటిగా లేదని సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే, 1991 నాటి ఆర్థిక వాస్తవాలతో పోలిస్తే నేటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆనాడు దేశంలో కొన్ని వారాల దిగుమతులకు మాత్రమే సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉండగా, ఇప్పుడు మన వద్ద 600 నుంచి 700 బిలియన్ డాలర్లపైనే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇవి సుమారు 10 నుంచి 12 నెలల దిగుమతులకు రక్షణ కవచంలా నిలుస్తాయి. అవసరమైనప్పుడు జోక్యం చేసుకునే బలమైన కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు ఉంది. ఈ నిర్ణయాలు తక్షణ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కానీ, శాశ్వత రక్షణగా మారలేవు. అయినా నిర్లక్ష్యం చేయకుండా మన జాగ్రత్తలలో మనముండాలి.
దీర్ఘకాలిక పరిష్కారాలే రక్ష
విదేశీ మారక నిల్వలను ఉపయోగించి రూపాయిని నిలబెట్టడం తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వొచ్చు. కానీ, దీర్ఘకాలిక పరిష్కారం అంతర్గత బలోపేతంలోనే ఉంది. రూపాయి స్థిరత్వం విదేశీ నిల్వలతో మాత్రమే రాదు. అది దేశ ఉత్పాదక సామర్థ్యం నుంచి వస్తుంది. ఇక్కడ ఒక నమ్మలేని నిజం ఉంది.
అదేంటంటే ప్రపంచీకరణ అందరికీ అవకాశాలు ఇచ్చింది కానీ, అందరికీ సమాన శక్తిని ఇవ్వలేదు. ఇది కీలక విషయం. దీనిని అందిపుచ్చుకోవడంలోనే మన రూపాయి హెచ్చు తగ్గులను కొంతవరకు ఆపొచ్చు. ఆత్మనిర్భరత అంటే ప్రపంచానికి తలుపులు మూసే యడం కాదు. ప్రపంచంతో కలిసి ప్రయాణిస్తూ, అంతర్గత బలాన్ని పెంచుకోవడం. మన దేశం ఐటీ, సేవారంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కానీ, వస్తువుల వాణిజ్య లోటు మాత్రం ఇంకా ప్రధాన సమస్యగానే ఉందని ఇదివరకే చెప్పుకొన్నాం.
ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సెమీకం డక్టర్లు, రక్షణ పరికరాలు, అధునాతన సాంకేతిక ఉత్పత్తుల కోసం ఇప్పటికీ మనం విదేశాలపైనే ఆధారపడుతుండటాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి పథకాల ద్వారా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. మొబైల్ తయారీ వంటి రంగాల్లో పురోగతి కనిపిస్తోంది. కానీ, అసెంబ్లీ కేంద్రాలుగా మార డం, సాంకేతిక సామర్థ్యం నిర్మించుకోవడం రెండూ ఒకటే కావు. అసలు బలం పరిశోధన, ఆవిష్కరణ, సాంకేతిక స్వావలంబనలో ఉంటుంది
ప్రపంచ ఆర్థిక తుఫానులు వస్తూనే ఉంటాయి. కానీ, అసలు ప్రశ్న తుఫానులు వస్తాయా, రావా? అనేది కాదు. వాటిని ఆపడం మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ వాటిని తట్టుకునే నౌకను నిర్మించడం మా త్రం మన చేతుల్లోనే ఉంటుంది. బలమైన కరెన్సీని విదేశీ మారక నిల్వలు కొనివ్వవచ్చు. కానీ శాశ్వతంగా నిర్మించేది మాత్రం దేశ ఆర్థిక సామర్థ్యం మాత్రమే. చివరికి రూపాయి భవిష్యత్తు ప్రపంచ మార్కెట్లలో కాదు; మన దేశం తన అంతర్గత సామర్థ్యాన్ని ఎంత సమర్థంగా జాతీయ శక్తిగా మా ర్చుకోగలుగుతుందనే దానిలోనే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
డి.జె మోహనరావు






