22 May, 2026 | 2:56 AM

గోదావరి జలాలపై మన హక్కులకు ముప్పు

22-05-2026 01:56 AM

కావేరి లింక్‌తో సాగునీటికి గండం

  1.   968 టీఎంసీల వాటాలు తేలకముందే నీటి మళ్లింపుపై ఆందోళనలు 
  2. నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చే ప్లాన్? 
  3. కృష్ణా-గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయమేనా?
  4. ఉత్తర  తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం 
  5. భవిష్యత్‌లో సాగు, తాగునీటి అవసరాలకు ప్రమాదమంటున్న నిపుణులు

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి) : గోదావరి నదులను అనుసంధానించాలనే ప్రతిపాదన ప్రస్తు తం తెలంగాణలో కొత్త చర్చకు దారితీసింది. గోదావరి బేసిన్‌లో అధిక మొత్తం జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని దక్షిణాది రాష్ట్రాలు వాడుకోవాలనే వాదనను అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఏపీ రాష్ట్రం తెరపైకి తీసుకువస్తున్నది. అయితే గోదావరిలో తెలంగాణ కు రావాల్సిన పూర్తి వాటాలు ఇంకా స్పష్టతకు రాకముందే ఇతర రాష్ట్రాలకు నీటి మళ్లింపులపై చర్చలు జర గడం రాష్ట్ర నీటి హక్కులపై భవిష్యత్తులో ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా గోదావరి జల వివాద ట్రిబ్యునల్(జీడబ్ల్యూడీటీ) ప్రకారం తెలంగాణకు సుమారు 968 టీఎంసీల హక్కు ఉందని రాష్ట్రం వాదిస్తున్న నేపథ్యంలో, ముందుగా ఆ నీటిని పూర్తి గా వినియోగించుకునే వ్యూహం రూపొందించకుండా గోదావరి-కావేరి లింక్‌పై ముందుకు వెళ్లడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ భౌగోళికంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో కీలకంగా ఉంది.

రాష్ట్రంలో సుమారు 79 శాతం గోదావరి క్యాచ్‌మెంట్ ప్రాంతం ఉండటం వల్ల భవిష్యత్తు సాగు, తాగు నీటి అవసరాలకు ఈ నది అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో వరద జలాలు సముద్రంలో వృథా అవుతున్నాయనే కారణం చూపి నీటిని ఇతర బేసిన్లకు మళ్లిస్తే భవిష్యత్తులో తెలంగాణ అవసరాలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని నీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో భారీ ఎత్తున సాగునీటి ల క్ష్యాలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి గా గోదావరి వరద జలాలపైనే ఆధారపడి ఉంది.

రోజుకు 2 నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారు. అయితే లక్షల ఎకరాలకు సాగునీ రు, హైదరాబాద్‌కు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు భవిష్యత్తు గోదావరిలో నీటి లభ్యతపై ఆధారపడి ఉంది. గోదావరి నుంచి కా వేరి బేసిన్‌కు పెద్ద మొత్తంలో నీటి మళ్లింపులు జరిగితే వరద జలాల లభ్యత తగ్గడం తోపాటు ఎత్తిపోతల కాలం కూడా తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది.

దీనికితోడు నీటిని పం పింగ్ చేసేందుకు వ్యయం పెరగడం, ఉత్తర తెలంగాణ సాగు స్థిరీకరణపై తీవ్ర ప్రభావం చూపడం వంటి సమస్యలు తలెత్తవచ్చని ఇంజినీరింగ్ వర్గా లు భావిస్తున్నాయి. ప్రాణహిత-చేవెళ్ల, ఇ చ్చంపల్లి, సమ్మక్క వంటి భవిష్యత్ ప్రాజెక్టులపైనా దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తు తం వినియోగం లో లేని జలాలను అదనపు నీరుగా పరిగణించడం భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి అవకాశాలను పరిమితం చే సే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

గోదావరి-కావేరి లింక్‌లో భాగంగా నాగార్జునసాగర్ జలాశయాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించే అవకాశాలపై చర్చలు సాగుతున్నాయన్న సమాచారం తె లంగాణలో కొత్త అనుమానాలకు కారణమవుతోంది. ఇప్పటికే కృష్ణా జలాల వినియో గంపై తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రతి ఏడాది వివాదాలు కొనసాగుతున్నా యి. శ్రీశైలం, సాగర్ జలాల పంపకాల విషయం లో స్పష్టత లేకపోవడంతో తెలంగాణ వ ర్గాలు అప్రమత్తమవుతున్నాయి.

గతంలో శ్రీశైలం జలాలను హైడ్రో ఎలక్ట్రిక్ ఉత్పత్తికే పరిమితం చేయాలని చెప్పిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తరువాత పోతిరెడ్డిపాడు ద్వారా భారీ స్థాయిలో నీటి మళ్లింపులు చేపట్టిందని తెలంగాణ ఆరోపిస్తుంది. మొదట 1,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రారంభమైన వ్యవస్థ తరువాత లక్ష క్యూసెక్కుల వర కు విస్తరించిందని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరుతో భవిష్యత్తులో సాగర్ జలాలపై ని యంత్రణ మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌కు రోజుకు 600-700 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్ పర్ డే)లకు పైగా నీటి అవసరం ఉంది. నగ ర విస్తరణతో వచ్చే రెండు దశాబ్దాల్లో ఈ అవసరం 1,000 ఎంజీడీలకు మించే అవకాశముందని అంచనాలు చెబుతున్నాయి. ఈ అవసరాల్లో గోదావరి కీలక వనరుగా మారింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో గో దావరి నీటి లభ్యత తగ్గితే హైదరాబాద్ తా గునీటి ప్రణాళికలపై ఒత్తిడి పెరిగే ప్రమా దం ఉంది. నీటి సరఫరా ఖర్చులు పెరగడం, భూ గర్భ జలాల వినియోగం అధికం కావడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మళ్లీ అన్యాయమేనా.. 

తెలంగాణ ప్రస్తుతం కృష్ణా ట్రిబ్యునల్-2 ముందు 763 టీఎంసీల వాటా కోసం పో రాడుతోంది. గోదావరిలో కూడా రాష్ట్రం తన పూర్తి వాటాను వినియోగించుకునే దశ కు ఇంకా చేరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అనుసంధానాల పేరుతో నీటి మళ్లింపు లు జరిగితే భవిష్యత్తులో తెలంగాణకు చట్టపరమైన, సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటి వినియోగంలో ముందు ఉపయోగించిన రాష్ట్రానికే ప్రాధాన్యం అనే సూత్రం భవిష్యత్తులో వివాదాలకు దారితీయవచ్చని, అందుకే తెలంగాణ తన వాటాను త్వరగా వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

అయితే వాస్తవానికి తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ముందుకు సాగింది. అలాంటి రాష్ట్రంలో గోదావరి-కావేరి అనుసంధానం ఇప్పుడు కేవలం ఇంజినీరింగ్ ప్రాజెక్టు మాత్రమే కాదు... తెలంగాణ భవిష్యత్ సాగు, తాగునీటి భద్రత, జలహక్కులు, ప్రాంతీయ ప్రయోజనాలతో ముడిపడిన అత్యంత కీలక రాజకీయ అంశంగా మారుతోంది. 

కేంద్రం ప్రతిపాదనలు..

గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టుపై కేంద్ర జల సంఘం తీసుకొచ్చిన తాజా ప్రతిపాదనలు తెలంగాణకు కీలకంగా మారుతున్నాయి. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసరమైన 90 టీఎంసీల నీటిని సమకూర్చే దిశగా కేంద్రం కొత్త ఫార్ములా ముందుకు తెచ్చింది. ఇందులో భాగం గా సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి నాగార్జునసాగర్ వరకు గోదావరి జలాలను మళ్లిస్తూ తెలంగా ణకు 45 టీఎంసీల వినియోగ హక్కు కల్పించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

ప్రతిపాదన1లో సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్, సోమశీల మార్గంగా కావేరి వరకు తరలించే ప్రణాళిక ఉండగా, ఏపీకి పోలవ రం బనకచర్ల లింక్ ద్వారా వేరుగా 123 టీఎంసీల నీటి వినియోగ అవకాశాన్ని చూపించారు. ప్రతిపాదన1బీ ప్రకారం తెలంగా ణకు కేటాయించిన 45 టీఎంసీలను నాగార్జునసాగర్ ప్రాంతంలోనే వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

ఈ నీరు సాగర్‌లోకి చేరకుండా ప్రత్యేక లింక్ ద్వారా తరలించే విధంగా రూపకల్పన చేశారు. అదే సమయంలో పోలవ రం నుంచి కావేరి వరకు మరో ప్రత్యేక అనుసంధానం చేపట్టాలని కేం ద్ర జల సంఘం సూచించింది. అయితే తెలంగా ణ ప్రభుత్వం గోదావరి-కావేరి అనుసంధానంలో రాష్ట్ర ప్రయోజనాలకు అ నుగుణంగా మార్పులు కోరుతున్నట్టు తెలుస్తోంది.