02-02-2026 01:07:09 AM
మేడ్చల్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముగ్గురు నాయకులకు అగ్ని పరీక్ష లా తయారయ్యాయి. డిసిసి అధ్యక్షుడు వజ్రేస్ యాదవ్, బిజెపికి చెందిన పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్, బి ఆర్ ఎస్ కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కి ఎన్నికలు సవాలుగా మారాయి. జిల్లాలో ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలకు ఈనెల 11న ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ మూడు మున్సిపాలిటీలలో మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించాల్సిన భారం ఈ నాయకులపై పడింది. ఆయా పార్టీలలో తమ స్థానం కాపాడుకోవాలంటే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ముగ్గురు నాయకులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
వజ్రేష్ యాదవ్ నాయకత్వానికి పరీక్ష
వజ్రేష్ యాదవ్ డిసిసి అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్ల ఆ పార్టీ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడు మున్సిపాలిటీలలో 68 వార్డులలో 50 కి పైగా వార్డులలో గెలుపొందాలి. పోటాపోటీగా గెలిస్తే అది గెలుపు కాదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్టానం వజ్రేష్ యాదవ్ కు టికెట్ కేటాయించింది.
కానీ ప్రచారంలో నిర్లక్ష్యం చేయడం, గెలుస్తామని అతి విశ్వాసం ప్రదర్శించడం వల్ల కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వల్లే ఓడిపోవలసి వచ్చింది. అయినప్పటికీ వజ్రెష్ యాదవ్ నాయకత్వంపై నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అనేకమంది పోటీ పడినప్పటికీ అనూహ్యంగా వజ్రేష్ యాదవ్ కు అధ్యక్ష పదవి వరించింది.
పార్టీ నమ్మకంతో అధ్యక్ష పదవి కట్టబెట్టినందున మున్సిపాలిటీలను తప్పనిసరిగా గెలిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. వన్ సైడ్ విజయం సాధించకుండా, ఏ ఒక్క మున్సిపాలిటీలో ఓటమి పాలైన ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లే అవకాశం ఉంది. అంతేగాక ఆయన నాయకత్వానికి మచ్చ ఏర్పడనుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో అనుభవం ఎదురైనందున మున్సిపల్ ఎన్నికల్లో అందరినీ కలుపుకొని వెళ్లితేనే విజయం సాధ్యమవుతుంది. ఇప్పటికే వజ్రేష్ యాదవ్ పై క్యాడర్లో లోలోపల చాలా అసంతృప్తి ఉంది. బీఆర్‌ఎస్ ప్రచారం జోరుగా ఉంది. అందుకు తగినట్లు కాంగ్రెస్ శ్రేణులను కూడా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
బిజెపి బాధ్యతలు తీసుకున్న ఎంపీ ఈటెల రాజేందర్
పార్లమెంట్ ఎన్నికల్లో మున్సిపాలిటీలలో బిజెపికి మెజారిటీ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలే జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లలో ప్రస్తుతం ఎన్ని వస్తాయో ఆసక్తికరంగా మారింది. బిజెపికి నాయకత్వ సమస్య ఉంది. ఈ పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ తన భుజస్కంధాల మీద వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులు మున్సిపాలిటీలలో విస్తృతంగా పర్యటించారు. బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఢిల్లీ వెళ్లారు.
మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈ మూడు మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ఈటల రాజేందర్ ఇంటి చుట్టే ఉన్నాయి. చైర్మన్ స్థానాలు గెలవకున్నా కింగ్ మేకర్ గా ఉండాలి. ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్రస్థాయి నాయకుడిగా ఉన్నారు. ఈ మూడు మున్సిపాలిటీలలో చెప్పుకోదగిన స్థానాలు గెలువకుంటే ఈటెలపై పార్టీలోని ప్రత్యర్థులు సెటైర్లు వేసే అవకాశం ఉంది. అంతేగాక అధిష్టానానికి ఫిర్యాదులు చేసే అవకాశం కూడా ఉంది.
మల్లారెడ్డి పట్టు నిలుపుకునేనా?
బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు మున్సిపాలిటీలలో ఎక్కువ వార్డులు గెలిస్తే మల్లారెడ్డి పట్టు నిరూపించుకున్నట్లు అవుతుంది. చైర్మన్ స్థానం గెలవకుండా ఒక్కో మున్సిపాలిటీలలో పదికి పైగా వార్డులు గెలిస్తే నైతిక విజయం బి ఆర్ ఎస్ దే అవుతుంది. కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తి, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని మల్లారెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రచారంలో రెండు పార్టీల కంటే ముందున్నారు.