02-02-2026 01:08:21 AM
మధిర మున్సిపల్ పీఠం దక్కేదేవరికో?
నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అగ్ర నేతల సతీమణులు రంగా మధులత, వేమిరెడ్డి లక్ష్మీ తులసి, మల్లాది సవిత
మధిర మున్సిపల్ కాంగ్రెస్ వర్తమాన రాజకీయాలపై ఎర్రుపాలెం విజయక్రాంతి ప్రత్యేక కథనం
ఎర్రుపాలెం, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మధిర మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయం రసవత్తంగా మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేతలైన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు సతీమణి రంగా మధులత మరో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి లక్ష్మీ తులసి, జిల్లా కాంగ్రెస్ నాయకులు తాజా మాజీ కౌన్సిలర్ మల్లాది వాసు సతీమణి సిట్టింగ్ కౌన్సిలర్ మల్లాది సవిత నామినేషన్ దాఖలు చేశారు. వీరికి కాంగ్రెస్ పార్టీ బీఫారం వస్తుందా? వీరిలో పోటీలో ఉండే వారెవరు? మధిర మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఎవరని వరిస్తుందో విజయక్రాంతి ప్రత్యేక కథనం.
మధిర మున్సిపల్ చైర్ పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు చేశారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో ఆ పదవి దక్కించుకునేందుకు మధిర పట్టణంలోని మూడు ప్రధాన సామాజిక వర్గాలైన ఆర్యవైశ్యలు, రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం పోటీ పడుతూ ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎవరి పేరు చెపితే వారే మధిర మున్సిపల్ చైర్ పర్సన్ అవుతారన్నది నగ్న సత్యం. చైర్ పర్సన్ కోసం ప్రధాన పోటీదారులుగా ఉన్న నాయకుల రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిద్దాం. రంగా మధులత భర్త రంగా హనుమంతరావు రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే రంగా హనుమంతరావు మృదుస్వభావి. వివాదరహితులుగా పేరుగాంచారు.
ఆర్దిక స్థితి మంతులు. ఆయన మధిర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా అనేక సంవత్సరాలు పని చేశారు దీనికి ప్రతిఫలంగా 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రంగా హనుమంతరావు మార్కెట్ కమిటీ చైర్మన్ లభించింది. 2009 నుండి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో మల్లు భట్టి విక్రమార్క పోటీ చేసిన ప్రతిసారి రంగా హనుమంతరావు నివాసం నుండి ఎన్నికల కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు.
కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వేమిరెడ్డి లక్ష్మి తులసి భర్త వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే మల్లు భట్టి విక్రమార్కకి అత్యంత విశ్వాసపాత్రుడు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల సమయంలో ఇతర పార్టీ నేతలను భట్టి విక్రమార్కకి దగ్గర చేయటంలో సిద్ధహస్తుడనే పేరుంది. భట్టి విక్రమార్క చేపట్టే పార్టీ కార్యక్రమాలను వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇన్చార్జిగా ఉండి ఆ కార్యక్రమాలను పర్యవేక్షణ చేస్తుంటారు. మల్లాది సవిత భర్త మల్లాది వాసు రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే మధిరలో ప్రజాబలం కలిగిన నేత. 2009 నుండి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు అనుచరులుగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుండి గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేసిన మల్లాది సవిత వాసు దంపతులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మల్లాది వాసు కాంగ్రెస్, టిడిపి, సిపిఎం, సిపిఐ పార్టీల నుండి పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చు తనే పెట్టి ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టి ఆనాటి అధికార టీఆర్‌ఎస్ పార్టీతో డీఅంటే డీ అని పోరాటం చేశారు. అంతే కాకుండా భట్టి విక్రమార్క మధిర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి సారీ మల్లాది సవిత చేతులు మీదుగా భట్టి విక్రమార్క నామినేషన్ పీజు తీసుకునే ఆనవాయితీ ఉంది.
మల్లాది సవిత అంటే భట్టి విక్రమార్కకి అంత సెంటిమెంట్ ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి టిఆర్‌ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పూర్తి బాధ్యత తీసుకొని భట్టి విక్రమార్క ఓడించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న సమయంలో గెలుపు క్లిష్టమైన నేపథ్యంలో మల్లాది వాసు 8 మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్ లోకి వచ్చి ఇంటింటికి పంపిణీ ప్రచార బాధ్యతలు కూడా తనే తీసుకొని ఆనాటి ఎన్నికల్లో భట్టి విక్రమార్క విజయంలో ముఖ్యపాత్ర పోషించిన విషయం పట్టణ ప్రజానికం గుర్తు చేస్తున్నారు. పోటీలో ఉన్న ముగ్గురికి మూడు రకాల నేపద్య ఉన్న తరుణంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివాదరహిత్యానికా...విశ్వాసనీయతకా.. వ్యక్తిగత స్నేహానికా .. దేనికి ప్రాధాన్యతనిస్తారో అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.