calender_icon.png 2 February, 2026 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ విచారణకు వ్యతిరేకంగా హోరెత్తిన గులాబీ దళం

02-02-2026 01:04:56 AM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత!

రంగారెడ్డి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావును సిట్ (SIT) విచారిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీనికి నిరసనగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని మున్సిపాలిటీలు మరియు మండల కేంద్రాల్లో గులాబీ జెండాలతో కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. దిష్టిబొమ్మల దహనం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ను విచారిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసి, ధర్నాలు నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

నియోజకవర్గాల వారీగా నిరసన 

రంగారెడ్డి జిల్లా లో ని మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, మరియు ఆమనగల్ బ్లాక్ మండల కేంద్రాల్లో నిరసనలు మిన్నంటాయి. వికారాబాద్ జిల్లా లో పరిగి, తాండూరు, కొడంగల్ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించాయి. మేడ్చల్ జిల్లా లో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి మరియు ఉప్పల్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు రోడ్ల పై బైఠాయించారు.

పలు ప్రాంతాల్లో ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, బీఆర్‌ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరగడంతో గందరగోళం నెలకొంది. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రు లు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతం జిల్లాలోని పలు కీలక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.