3 August, 2026 | 2:13 AM

‘జీవన’ స్మృతుల జోడు సంకలనాలు

03-08-2026 12:43 AM

వరంగల్ నగరంలో 70 నుంచి ౯౦ దశకాల్లో ఏ ఇద్దరు, ముగ్గురు ఒక దగ్గర కూడినా సాహితీ, రాజకీయ, తత్వశాస్త్రాల చర్చలూ, సామాజిక కార్యచరణలపై వాదోపవాదాలూ జరిగేవి. విద్యార్థులు, యువకులు మొ దలు అన్ని వయస్సుల వారి నుంచి వద్దన్నా కవిత్వం పొంగి పోర్లేది. అభ్యుదయ పాటలు, మాటలు జలపాతాల్లాగా ప్రవహించేవి. సభలు, సమావేశాలు, సాహితీ చర్చలు, పుస్తకావిష్కరణ  సభలు, అభ్యుదయ, విప్లవ పార్టీల వాల్ రైటింగ్స్, బ్యానర్లు ఒకప్పుడిక్కడ నిత్యదృశ్యాలు.

ఎంతోమంది భద్ర జీవులు సైతం, కేవలం ఈ నగరంలో వివిధ సాహితీ, రాజకీయ, ఉద్యమ భావజాలాల్లో ఏదో ఒకవైపు నిలబడకుండా ఉండగలిగే వారు కాదు. అలా మానవ సహజ బహుముఖీయ కళల, సామర్థ్యాల సృజనాత్మకతల వ్యక్తీకరణతో పా టు, వారిలో నిబిడీకృతంగా ఉన్న నిజాయతీల వెలికితీతకు ఒకప్పుడీ నగరం పెద్ద కేంద్రం. అయితే, కాలం మారింది. నగర స్వభావమూ మారింది. ఇప్పుడిక్కడ ఆధిపత్య రాజకీయ, వ్యాపార వర్గాల పోస్టర్లు, బ్యానర్లు తప్ప మరొకటి కనిపించటం లేదు.

సాహితీ, తత్వశాస్త్రాల కార్యక్రమాలు అంతరించిపోయే జాబితాలో చేరిపోయాయి. ఈ నగరంలో ఇప్పుడు ఒకప్పటి సాహితీవేత్తల స్మారక సమావేశాలు, చాలా అరుదుగా మాత్రం పుస్తక ఆవిష్కరణలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హక్కుల ఉద్యమంలో సుదీర్ఘ అనుభవం కలిగిన జీవన్‌కుమార్ తన కార్యాచరణలో భాగంగా రాసిన అనేక వ్యాసాలతో ‘వీధి బతుకులు విస్థాపనలు’, ‘సజీవ స్మృతులు’ అనే రెండు పుస్తకాలను తీసుకువచ్చారు. మానవ హక్కుల వేదిక రెండు పుస్తకాలను ప్రచురించింది.

పుస్తకా లను కల్పనా కన్నబిరాన్, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతతోపాటు పలువురు సాహిత్యాలాభిషులు ఆదివారం (౨వ తేదీన) వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ నగరంలోనే ఆవిష్కరణ ఎందుకంటే.. రచయితకు నగరం పట్ల ఉన్న సెంటిమెంట్. అనురక్తి. జీవన్ కుమార్‌ను ఈ నగరం ఎత్తుకొని ఆడించింది. నడక నేర్పింది. అలా, నగరం రచయితకి రెండోతల్లిలా మారింది. నగ రంలో అతను తనలోని శక్తినీ, మానవీయ కోణాన్ని గుర్తించాడు. వారి ఈ 75 ఏళ్ల జీవితంలో తనకు సంతృప్తినిస్తూ చేసిన ప్రతి పనికీ అంతర్లీనంగా ఆక్సిజన్ అందించేది వరంగల్ నగరమే. నగరమంటే నాటి సాహితీ, రాజకీయ వాతావరణం, మరీ ముఖ్యంగా, ఆ నాటి వరంగల్ సాహితీ మిత్రులు.

 50 ఏళ్ల ఉద్యమ నేపథ్యం

జీవన్‌కుమార్‌కు హక్కుల సంఘాలతో, కార్యాచరణతో 50 ఏళ్ల అనుబం ధం ఉంది. అయితే వారి ఈ 50 ఏళ్ల కార్యాచరణలోని రెండో అర్ధ భాగంలోనే వారు కొన్ని రచనలు చేశారు. వాటిలో ముఖ్యమైనవి నగరంలో తాజా గా ఆవిష్కరించిన రెండు పుస్తకాలు. వాటిలో మొదటి పుస్తకం ‘వీధి బతుకులు విస్థాపనలు’ దాదాపు మూడు దశాబ్దాల రచయిత హక్కుల కార్యాచరణ నేపథ్యంలో వచ్చినది. పుస్తకంలో పోలీస్ హింస, పాలకులు చేసే దౌర్జన్యాలు, వీరి ద్దరూ పెంచి పోషించే మాఫియాలు మొదలగు అంశాలే కాకుండా, అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలు, అభ్యుదయ పార్టీలు సైతం గుర్తించలేకపోయిన ఎన్నో అంశాలపైన చేసిన రచనలున్నాయి.

రెండో పుస్తకం ‘సజీవ స్మృతులు’  తన సహచరులు మరియు తనకు ప్రేరణ ఇచ్చినవారు మరణించినప్పుడు, రచయిత వారికి అర్పించిన నివాళులకు సంబంధించినది. వారిలో వరంగల్ నగరానికి చెందిన కాళోజీ, జయశంకర్ సార్, హక్కుల నాయకులు డాక్టర్ రామనాథం, నర్రా ప్రభాకర్‌రెడ్డి, బుర్రా రాములు మొదలగు వారున్నారు. అలా, జీవన్ కుమార్ సజీవ స్మృతుల్లో వరంగల్ నగరానికి చెందిన వారే లేదా నగరం చేత ప్రభావితం అయిన వారే చాలామంది.

ఈ పుస్తక ప్రచురణ ద్వారా రచయిత ఆయా మానవీయులు ఈ సమాజ మార్పు కోసం పడిన ఆరాటం, అర్పించిన జీవితం కొత్త తరాలకు తెలియాలనీ, ఆ విలువలు ఈ సమాజంలో విస్తారంగా అందరికీ పరిచయం చేయబడి, స్థిరపడాలనీ కోరుకుంటున్నారు. పుస్తకాల్లోని వ్యాసాలు చరిత్రకు ఆధారాలుగా నిలవగలవు. వివిధ వర్గాల ప్రజలు తమ గురించి తాము తెలుసుకోవటానికి సహాయ పడగలవు. మానవత్వం కోల్పోని మనుషులు వివిధ అట్టడుగు వర్గాల ప్రజల పట్ల సహానుభూతి చెందడానికి ప్రేరణ కాగలవు.

అదే ఈ వ్యాసాల రచన, పు స్తకాల ప్రచురణ వెనుక గల ఆకాంక్ష. మానవ హక్కుల వేదికనే స్వయంగా ప్రచురించిన ఈ పుస్తకాల ముద్రణ, డిజైన్, డేటా, చారిత్రకాంశాల నిర్ధారణలో వసంత లక్ష్మి, మన్నం బ్రహ్మయ్య పాత్ర చాలా కీలకం. ఎంతో శ్రమ కోర్చి వారు పుస్తకాలను ప్రామాణిక గ్రంథాలుగా నిలబెట్టారు. ఈ రెండు పుస్తకాలు మాత్రమే కాదు, మొత్తంగా పుస్తక పఠనం అనే అలవాటునూ, మంచి సాహిత్య ఎంపికనూ కొత్త తరాలూ కొనసాగించాలని కోరుకుంటున్నాం. 

                     డాక్టర్ ఎస్.తిరుపతయ్య, మానవ హక్కుల వేదిక