3 August, 2026 | 1:12 AM

అపోహ

03-08-2026 12:41 AM

అతి ప్రశాంతమగు సాయం సమయమది. పసుపు సముద్రము (ఎల్లో సీ)లో నుండి అమెరికన్ ఓడ వయ్యారంగా సాగిపోతుంది. వివిధ దేశాల ధనాఢ్యులతో నిండి వుంది ఆ ఓడ. సాగరమధ్యమందు గల ఏ అపరిచిత భూభాగాన్నో నెలవు చేసుకొన్న సముద్రపు పక్షులు అప్పుడప్పుడూ గుంపులు గుంపులుగా వచ్చిన ఓడలు పైపైన తిరిగి అంతరిక్షములో మాయమవుతున్నాయి. ఆడిఆడి అలసిన సముద్ర తరంగాలు తల్లి ఒడిలో విశ్రాంతి తీసుకొంటున్నాయి. పండు పండిన బంగారు ముద్దలా దూరాన ఎక్కడో క్రుంగుతూ ఉన్న సూర్యుడు సముద్రంపైనుండి ఎంతో అందంగా కనపడుతున్నాడు. సంధ్యా మనోహర దృశ్యాలు తిలకించడానికి కేబినుల నుండి బయటకు వచ్చిన ప్రయాణికులంతా డెక్కుపైన గుమిగూడి ఉన్నారు.

వారిమధ్య ఒక పెద్దమనిషి నిలువబడి చుట్టూ మూగిన ప్రయాణికులతో వింతగా ఏదో ముచ్చటిస్తున్నాడు. అతని ఎడమ చేతిలో ఒక అందమైన దంతపు పేటిక ఉంది. ఆ పెద్దమనిషి అమెరికాలోని ఓ ఫ్యాక్టరీ యజమాని. అతడు పేరుమోసిన గొప్ప శ్రీమంతుడు అతనికి వివిధ దేశములలోని పురాతన నాణెములు సమకూర్చుట అనిన ఎంతో ఆనందము. ఆ ఆనందములో అతనికి ఆకలిదప్పులు కూడా ఏర్పడవు. అతడు సంపాదించిన నాణెములలో కొన్ని బ్రిటిష్ వ్యజియమున సహితము లేవు.  

డెక్కుపై మూగిన తోడి ప్రయాణికులంతా అతనిని ఒత్తిడి చేయడం వలన నాడా నాణెములను ప్రదర్శించడానికి ఒప్పుకున్నాడాయన. శ్రీమంతుడైన ఆ అమెరికన్ చేతిలో ఉన్న పేటిక నుండి ఒక నాణెము పైకి తీసి ‘మీకు తెలుసు గదా! క్లియోపాత్ర ఎంత చక్కనైనదో, అంత జిత్తులమారిదని -- యిదిగో చూడండి! ఆ చరిత్ర ప్రసిద్ధమైన క్లియోపాత్ర కాలమునాటి నాణెము. రెండేళ్ల క్రింద నేను ఈజిప్టుకు వెళ్లినపుడు యిరువది ఏడువేల డాలర్లు వెచ్చించి దీనిని తీసుకొన్నాను’ ఈ మాటలు చెప్పి అతను ఆ నాణెమును అచ్చట మూగిన వారిని చూడనిచ్చినాడు. ప్రతివాడు విస్మయపడుచు కన్నుల కరువు తీర ఆ నాణెమును తిప్పితిప్పి చూచి ప్రక్కవానికి అందించతొడగినాడ.

ఇట్లా అది ప్రతివాని చేతిలో పడి అందరు చూచిన తరువాత మరల ఆ అమెరికన్ శ్రీమంతుని చేతిలోకి వచ్చి చేరింది. ఇట్లాతడు సేకరించిన వివిధ నాణెములను అక్కడ సమావేశమైన వారందరికి చూపెట్టాడు. అవన్నియు సాధారణముగా లభించనివి అత్యంత విలువ గలవియునై యుండెను. ఆ నాణెములు చూపెట్టిన తరువాత ఆ అమెరికన్ దంత పేటిక అడుగుభాగములో కడుభద్రంగా దాచిపెట్టబడిన మరో నాణెమును ఎంతో విలువైనదన్నట్టుగా పైకి తీసి ‘ఇక ఇది ఒకటి మిగిలి వుంది ఎంత లేదన్న పదివేల ఏండ్ల క్రిందటి నాణెమిది.

ప్రపంచమంతటిలో దీనిని బోలిన నాణెము ఒకటి మిగిలి ఉంది. నాలుగేళ్ల క్రితం జావాకు పోయినపుడు ఇరువది వేల డాలర్లకు దీనిని పుచ్చుకున్నాను’ అంటూ ఆ నాణెమును ఓ పెద్దమనిషి చేతికందిచ్చి అందరికి చూపమని సంజ్ఞ చేసాడు. చుట్టూ వగిన వాళ్లంతా ఆ నాణెమును ఎంతో పరీక్షగా చూసారు. ఇట్లా ఆ అపూర్వ నాణెమును చూచుటలో ఎంతో ప్రొద్దు గడిచింది. ఆ రోజు నాణెములు చూపెట్టినందుకు చుట్టు వగిన వాళ్లాంతా ఆ అమెరికన్ శ్రీమంతుణ్ణి ఎంతో ప్రశంసించినారు. శ్రీమంతుడు నింపాదిగా తన నాణెములన్నింటిని దంతపేటికలో అమర్చుకుంటూ ‘అయ్యో నా జావాప్రాంతపు నాణెము ఏమైనట్టు’ అని వెర్రివాడి మోస్తరు అందరి ముఖాలు చూడసాగాడు.  

అక్కడ ఉన్నవాళ్లంతా తెల్లబోయారు. ఇప్పుడిప్పుడే మా చేతిలోకి వచ్చిన నాణెము ఏమైనట్టు? వాళ్లంతా ఎంతో శ్రద్ధగా డెక్కంతా కలియవెదికారు. కాని ఆ నాణెము ఎక్కడ కనిపించలేదు. పాపము ఆ అమెరికన్ వెర్రి ముఖము వేశాడు. అతనికేమీ చేయడానికి తోచక తుదకతడు అక్కడ చేరిన వారందరిని ఉద్దేశించి ‘మిత్రులంతా నన్ను క్షమిస్తారనుకుంటాను. పురాటన నాణెములనిన నాకెంతో యిది. ప్రస్తుతం పోయిన నాణెము ఎంత విలువైనదో మీకు తెలుసుకదా?

ఒకవేళ నాచుట్టు చేరిన మిత్రులు కోపపడితే నేను ఏమి జవాబు చెప్పలేను కాని దయచేసి ఒకసారి నన్ను జేబులు తడవనిస్తారనుకుంటాను’ అన్నాడు. అమెరికన్ ఈమాట అనడంతోనే అక్కడివాళ్ల్లంతా ‘మాకేమీ ఆక్షేపణ లేదు. వెతుక్కోవచ్చు’ అని నిర్మొహమాటంగా జవాబు ఇచ్చారు. ఆ అమెరికన్ శ్రీమంతుడు అక్కడున్న ప్రేక్షకుల జేబులన్నీ తడిమి చూచాడు. కానీ ఒక ఆంగ్లేయ బ్యాంకరు మాత్రము అందుకు ఒప్పుకోలేదు. ఆ ఆంగ్లేయుడు స్వదేశములో గొప్ప పేరుప్రతిష్ఠలు గల వ్యక్తి. అతడు జేబులు తడవ నిరాకరించే వరకు అక్కడ వగిన వాళ్ల దృక్కులన్నీ అతనిపై నిలిచాయి.  

‘ఇది నా జాతికి అగౌరవం. యిందుకు నేను ఒప్పుకోలేను’ 

అన్నాడు ఆ ఆంగ్లేయుడు.

‘అయితే దయచేసి మీరే ఇచ్చివేయండి.’

‘అయితే మీ నాణెమును నేను గ్రహించానని మీరు అనుకుంటున్నారా?’

‘నేను నిశ్చయంగా చెప్పలేను కానీ మీరు అనుమానానికి 

తావు కల్పిస్తున్నారు’

‘నేను నాదేశం, నా జాతి యొక్క గౌరవములపై ఒట్టు పెట్టుకొని మరోమారు చెబుతున్నాను. నేను ఆ నాణెమును దొంగిలించలేదు. చెప్పగలిగిందేదో చెప్పివేశాను. యిక మీ యిష్టం’ అంటూ ఆ ఆంగ్లేయుడు విసవిస అక్కడినుంచి వెళ్లిపోయాడు. అప్పటికే చాలా సమయం గడిచింది. నాణె మును పోగొట్టుకొన్న ఆ అమెరికన్ పై జాలిదలుస్తు ప్రతిఒక్కరు తమ తమ కేబినులోనికి వెళ్లిపోయారు. అందరు ఆనాడు జరిగిన దానికి చింతిస్తూ ఆంగ్లేయ బ్యాంకరు విచిత్ర ప్రవర్తనకు ఆశ్చర్యచకితులైయుండిరి.

రెండవరోజు ఉదయం ఎనిమిదిగంటలకు ఆ ఓడ పైని ప్రయాణికులందరు ఉపాహారం నిమిత్తం ఓడమధ్య హాలులో గుమిగూడారు. నాణెముల యజమాని అతివిచారముతో ఉండెను. అతడు ఎవరితోనూ మాట్లాడక తన టేబిలు వద్ద కూర్చుని ఉపాహారము తీసుకొనుచుండెను. ఇంతలో ఓడపైని పనిచేయు సరంగు ఒకడు అతని చెవిలోనేదో గుసగుస చెప్పి అతని చేతిలోనేదియో ఉంచెను. అమెరికన్ ఒక్క పెట్టున కేకపెట్టి తన సంతోషాశ్చర్యములు వెలిబుచ్చెను. అందరు అతనివైపు సంభ్రమాశ్చర్యములతో చూడసాగిరి. నాణెముల యజమాని ముఖమునుండి ఆనందముట్టిపడుచుండెను.

తుదకు అమెరికన్ తన తోడి ప్రయాణికులవైపు తిరిగి ‘నా పోయిన నాణెము డెక్కుపై ఒడ్డున అడు కుర్రవానికి దొరికినది’ అని ఆ నాణెమును కుర్రవానిని చూపెట్టెను. అక్కడ కూడిన వారంతా పెద్దగా హర్షధ్వనులు చేసిరి. ఇంతలో అమెరికన్ శ్రీమంతుడు ఆంగ్లేయబ్యాంకరు వద్దకు పోయి ‘అయ్యా నన్ను క్షమించండి నిన్న రాత్రి నేను మీ విషయం లేనిపోని అపోహపడ్డాను. కేవలం అనుమానమే కాకుండా ఆ నాణెమును మీరే సంగ్రహించినట్టు విశ్వసించినాను. నా అపోహకు మీరు నన్ను మన్నిస్తారనుకుంటాను. కాని ఒక్క విషయం నాకు యింకా అబోధకంగా ఉంది. మీరు నాణెమును తీసుకొనప్పుడు అందరు వెతకనిచ్చినట్టు మీరు ఏల సంసిద్ధులు కాకపోతిరి?’ అమెరికన్ ఈమాట అనేవరకు అక్కడ వగిన ప్రేక్షకుల దక్కులన్నీ ఆ ఆంగ్లేయ బ్యాంకరుపై నిలిచాయి.  

చేతిలోని సిగిరెటు బూడిదను రాలుస్తూ ఆ ఆంగ్లేయుడు నలువైపుల చూచాడు. అందరి ముఖాలు అతని విచిత్ర ప్రవర్తనకు కారణమేమిటో తెలుసుకోవడానికి ఆతురత పడుతున్నాయి. ఆంగ్లేయుడు తన మోకాళ్లపై చేతులు వేసి పెద్దగా నవ్వి, ‘కొంచెం ఆగండి’ అని తన వేస్టుకోటు జేబులోనుండి ఒక నాణెమును అమెరికన్ దేశస్తునికిచ్చి, ‘ప్రపంచములో మరోటిలేదని చెప్పితిరే యిదిగో అలాంటిదే మరొక నాణెము. నిన్న సాయంత్రమిది నా జేబులో ఉంది. అప్పుడు కనుక మిమ్మల్ని జేబులు తడమనిస్తే నా స్థితి ఏమయ్యేది? ఇది నా స్వంతమని నేనెంత చెప్పినా మీరెవరయినా నమ్మియుండేవారా?  

నేను మాత్రము నిష్కారణంగా దోషిగా నిర్ణయింపబడేవాడిని. ఇక నేను ఆ సమయాన జేబులు తడమనివ్వలేదంటే దానిలో విచిత్రమేముందో మీరే ఆలోచించుకోండి’ అని చెప్పాడు. వెకిలిగా నవ్వుతూ అక్కడున్న వాళ్ల మొహాలవైపు కుతూహలంగా చూచాడు. చుట్టూ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యంతో నోరుతెరిచారు.

 కాళోజీ

(మూలం: ఇంగ్లిష్)

(‘తెలంగాణ సాహిత్య అకాడమి’ ప్రచురించిన 

‘కాళోజీ కథలు’ నుంచి సేకరించిన కథ)