పళ్లబురుసు.. నవ్వులే నవ్వులు బాసు!
సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘పళ్ళబురుసు’. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, భావోద్వేగాలు, పల్లెటూరి నేపథ్యాన్ని మేళవించిన కథతో మంచి విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఇటీవల జానపద బాణీలో రూపొందిన ‘కొత్త సోకు’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన తర్వాత ఈ చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.
యువసామ్రాట్ నాగచైతన్య లాంచ్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ, ప్రేక్షకులకు వినోదభరితమైన ప్రపంచాన్ని పరిచయం చేసింది. వేపపుల్లతో పళ్లు తోముకుంటున్న కథానాయకుడిని చూసి గ్రామస్థులు ‘పళ్ళబురుసు తెలీదా?’ అని ప్రశ్నించడంతో టీజర్ ప్రారంభమవుతుంది.
ఆ ఒక్క ప్రశ్నే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. టీజర్ ముందుకు సాగే కొద్దీ విచిత్రమైన పాత్రలు, సరదా సంఘటనలు, ఊహించని మలుపులు కనిపిస్తాయి. అయితే ‘పళ్ళబురుసు’ అంటే ఏమిటన్న మిస్టరీని మాత్రం అలాగే కొనసాగిస్తూ మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.






