30 July, 2026 | 1:43 AM

పడకేసిన పారిశుద్ధ్యం

30-07-2026 12:32 AM
  1. వాటర్ ట్యాంక్ చుట్టూ పేరుకుపోయిన చెత్త కుప్ప 
  2. రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు 
  3. అసలే వర్షాకాలం.. సీజనల్ 
  4. వ్యాధులకు ఆస్కారం..

భీమిని, జూలై 29 : భీమిని మండల కేంద్రంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. ఎస్టి కాలనీకి వెళ్లే మార్గంలో గల వాటర్ ట్యాంకు చుట్టూ పారిశుద్ధం పడకేసింది. డంపింగ్ యార్డ్ కు చేరాల్సిన చెత్త వాటర్ ట్యాంక్ వద్దే దర్శనమిస్తుంది. వాటర్ ట్యాంక్ చుట్టూ చెత్త పేరుకుపోవడంతో చెడు వాసన వెదజల్లుతోంది. దీనితో ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గ్రామంలోని కురుమ వాడలో రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుంది.

కాలనీలోని రహదారిపై ఎటు చూసినా మురుగునీరు ప్రవహిస్తుంది. కాలనీలో కొన్నిచోట్ల మురుగునీరు స్తంభించి పోయింది. ఆ నీటిలో నుంచే గ్రామస్తులు నడుచుకుంటూ రాకపోకలు సాగిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు నాన అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న  సమయంలో గ్రామంలో పారిశుధ్యo అధ్వానంగా తయారవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

డ్రైనేజీ నీరంతా రోడ్లమీదనే..

కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగు నీరంత రోడ్లపై చేరుతుంది. దీనికి తోడు కురుస్తున్న వర్షాలతో వారి బాధలు వర్ణానాతీతం...   కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై నీరు నిలవడంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి మురుగునీరు రోడ్డుపై నిలువ లేకుండా చూడాలని కోరుతున్నారు.

నివాసాలకు దగ్గరగా..

ఎస్సీ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పక్కన పదేపదే చెత్త కుప్పలు దర్శనమిస్తుండడంతో ఇళ్లల్లో నివాసముంటున్న ప్రజలకు దుర్వాసన వెదజల్లుతుంది. ఈ దారి గుండా కొందరు బహిర్భూమి చేయడంతో కాలినడకన వెళ్లే బాటసారులకు ముక్కులు పగిలిపోయేలా కంపు కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పందులు సైతం ఈ చెత్తకుప్పల వద్ద స్త్వ్రర విహారం చేస్తున్నట్లు కాలనీవాసులు వాపోతున్నారు. పత్రికల్లో వార్త కథనాలు ప్రచురితం అయినప్పుడే అధికారులు చెత్తను తొలగిస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. 

అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో...

గ్రామపంచాయతీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిత్యం ఈ వాటర్ ట్యాంక్ వద్ద కొందరు వ్యక్తులు చెత్తను వేస్తున్నట్లు నివాస ప్రజలు పేర్కొంటున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, మురుగునీరు రోడ్లపైకి చేరుతుండడంతో నిత్యం అవస్థలు తప్పడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపి వర్షం కారణంగా మురుగునీరు ఇండ్లలోకి ప్రవేశిస్తుందని, దీంతో దోమలు, ఈగలు ముసురుతున్నట్లు వాపోతున్నారు. పంచాయితీ అధికారులు చెత్తను తొలగించి ఇక ముందు చెత్త వేయకుండా తగిన చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.