30 July, 2026 | 1:03 AM

అభిమానం.. ఇంతింతై పదింతలై!

30-07-2026 12:04 AM

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్వయంకృషితో వచ్చి, గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ 10 ఏళ్ల సినీ ప్రయాణం టాలీవుడ్‌లో ఒక సంచలనం. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న ఆయన, తన విలక్షణ నటన, అటిట్యూడ్‌తో దశాబ్ద కాలంలో చిత్రసీమలో తనదైన చెరగని ముద్ర వేశారు. ‘ఎవడే సుబ్రమణ్యం’లో చిన్న పాత్రతో మొదలై.. ‘అర్జున్ రెడ్డి’గా టాలీవుడ్ రికార్డులను తిరగరాసి, ‘రౌడీ’గా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరోగా విజయ్ దేవరకొండ పేరు ఇండస్ట్రీలో నిలిచిపోతుంది.

విజయ్ దేవరకొండ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, బుధ వారంతో 10 ఏళ్లు పూర్తయింది. ఆయన సోలో హీరోగా నటించిన తొలి సినిమా ‘పెళ్లి చూపులు’ 2016లో రిలీజై పదేళ్లు పూర్తియింది. అప్పటికే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో నటించి పేరు తెచ్చుకున్న విజయ్.. ‘పెళ్లిచూపులు’తో సోలో హీరోగా అరంగేట్రం చేశారు. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల ప్రేమాభిమానాలు సంపాదించుకుని, బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొట్టారు.

ఆ తర్వాత వరుసగా విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ పాన్ ఇండి యా స్టార్‌గా ఎదిగారు. ప్రభాస్ ‘కల్కి’ సినిమాలో అర్జునుడి పాత్రలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. భారీ చిత్రాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా స్పాన్ పెరగడంలో తన వంతు కృషి చేస్తున్నారు విజయ్ దేవరకొండ. అంతేనా..? అటు వ్యాపార రంగంలోనూ, సామాజిక సేవలోనూ ముందుంటూ ప్రజల ప్రేమానురాగాలను చూరగొంటున్నారీ ‘రౌడీ హీరో’.

ప్రస్తుతం విజయ్.. దిల్ రాజు, శిరీశ్ సంయుక్త నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్దన’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌లో రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మాణంలో, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు ‘రణబాలి’ సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

ఇక విజయ్ సినిమాల్లో మోస్ట్ అవేటెడ్‌గా మారుతోంది ‘వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్’, దర్శకుడు శౌర్యువ్‌తో చేస్తున్న సినిమా. ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటం విశేషం. ఈ మూడు సినిమాలు స్టార్‌గా విజయ్‌కి మరింత గొప్ప స్థాయికి చేరుస్తాయని అంచనాలు ఉన్నాయి.