కేకే 5 గనిలో ప్రమాదం
- ఒక కోల్ కట్టర్, ఇద్దరు జనరల్ అసిస్టెంట్లకు గాయాలు
- ఎయిర్ బ్లాస్ట్ వల్లే ప్రమాదం..?
మందమర్రి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) మందమర్రి సింగరేణి ఏరియా పరిధిలోని కేకే 5 భూగర్భ గనిలో బుధవారం ఉదయం సంభవించిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. ఉదయం షిఫ్ట్ లో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా మూడవ సీము 16 లెవల్ లో గని పైకప్పు ప్రమాదవశాత్తూ కూలింది. సమీపంలో ఆవునూరు శశి కుమార్, రామిల్ల తిరుపతి అనే ఇద్దరు జనరల్ అసిస్టెంట్లతో పాటు రాజశేఖర్ అనే కోల్ కట్టర్ కార్మికుడు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
- ఒకరిని గోదావరిఖనికి రిఫర్
మందమరి కేకే -5 భూగర్భ గనిలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ ఆవునూరి శశి కుమార్ ను మెరుగైన వైద్య చికిత్స కోసం గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాలితో పాటు అక్కడక్కడ స్వల్ప గాయాలైన శశికుమార్ కు గుండె సంబంధిత సమస్య ఏర్పడ్డట్లుగా వైద్యులు గుర్తించి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
కళ్ళ ముందే జరిగిన ఘటనకు షాక్ తినడం వల్ల శ్వాస సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో 2డీ-ఎకో పరీక్ష నిర్వహించే యంత్రం సహా కార్డియాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో గోదావరిఖనికి రిఫర్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకి గోదావరిఖనికి పంపించారు. ప్రస్తుతం రాజశేఖర్ అనే కోల్ కట్టర్ కార్మికుడు, తిరుపతి బీజోన్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
- ఎయిర్ బ్లాస్టింగ్ వల్లే ప్రమాదం..!
కేకే 5 గనిలో సంభవించిన గని ప్రమాదం ఎయిర్ బ్లాస్ట్ వల్లే జరిగిందని ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి, టీబీజీకేఎస్, సిఐటియు కార్మిక సంఘాల నాయకులతో పాటు, కార్మికులు చెబుతున్నారు. సాధారణంగా బొగ్గు ఉత్పత్తి చేసిన అనంతరం గోపులు ఏర్పాటు చేసి అటు పక్క నుంచి వేరే సీములోకి ప్రవేశించి బొగ్గు ఉత్పత్తి చేస్తుంటారు. అయితే మూడవ సీము 16వ లెవెల్ హాఫ్ లో పని చేసేటప్పుడు మిషన్ ను తీసుకునేందుకు 16 వరకు వచ్చారు. మిషన్ తీసుకొని 16వ లెవెల్ హాఫ్ కు వెళ్తుండగా ఉన్నట్టుండీ పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రమాదంలో గాయపడిన బాధిత కార్మికులు చెబుతున్నారు.