6 March, 2026 | 6:23 AM

బతుకుదెరువుకు వచ్చి బలి!

06-03-2026 02:46 AM

ముగ్గురి ప్రాణాలు తీసిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం

భవన నిర్మాణంలో నాసిరకం గోవా కర్రలు

ఐదో అంతస్తు నుంచి పడి కూలీల దుర్మరణం

మరో ఇద్దరి పరిస్థితి విషమం

హైదరాబాద్ టోలీచౌకిలో ప్రమాదం

పరారీలో భవన నిర్మాణ కాంట్రాక్టర్

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 5 (విజయక్రాంతి): బతుకుదెరువు కోసం హైద రాబాద్‌కు వచ్చిన అమాయక కూలీల ప్రాణాలు.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో గాల్లో కలిసిపోయాయి. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా భవన నిర్మాణం చేపట్టడంతో ఐదో అంతస్తులో పనులు చేస్తున్న ఐదుగురు కూలీలు కిందపడగా.. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన గురువారం టోలీచౌకిలో జరిగింది. టోలీచౌకి పరి ధిలో ఉన్న అల్ హస్నాత్ కాలనీలో ఓ బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం భవనం ఐదో అంతస్తులో బయటి వైపున ప్లాస్టరింగ్, తదితర పనులు చేసేందుకు కూలీలు సిద్ధమయ్యారు. ఎత్తు లో పనులు చేసేందుకు వీలుగా కాంట్రాక్టర్ గోవా కర్రలతో మంచె తాత్కాలిక సపోర్ట్ స్కాఫోల్డింగ్ ఏర్పాటు చేయించాడు. అయి తే, ఆ గోవా కర్రలు సరైన భద్రతా ప్రమాణాలతో, పటిష్టంగా కట్టించడంలో కాంట్రా క్టర్ పూర్తిగా విఫలమయ్యాడు.

నాసిరకం కర్రలతో ఏమాత్రం గ్రిప్ లేకుండా ఆ మంచె ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పొట్టకూటి కోసం వచ్చిన ఐదుగురు కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఐదో అంతస్తు ఎత్తులోని ఆ కర్రల మంచెపైకి ఎక్కి పనులు చేయడం ప్రారంభించారు. కాసేపటికే కార్మికుల బరువుకు ఆ నాసిరకం కర్ర మంచె ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో మంచె పై నిలబడి ఉన్న ఐదుగురు కార్మికులు అమాంతం ఐదో అంతస్తు పైనుంచి వేగంగా కిందకు పడిపోయారు. ఊహించని ఈ ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ముగ్గురు కార్మికులు ఘటనా స్థలంలో నే ప్రాణాలు విడిచారు.

రక్తపు మడుగులో పడివున్న మరో ఇద్దరు కార్మికులను తోటి వారు, స్థానికులు వెంటనే గమనించి హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తు తం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని, వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం. కాగా పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసు కున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై, లోపించిన భద్రతా ప్రమాణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్ కోసం గాలింపు చేపట్టారు.

సేఫ్టీ నెట్స్ లేకుండానే పనులు

సాధారణంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణాల్లో కార్మికులు పనిచేసేటప్పుడు కచ్చితంగా పాటించాల్సిన కనీస భద్రతా ఏర్పాట్లను ఇక్కడ కాంట్రాక్టర్ పూర్తిగా గాలికొదిలేశాడు. ప్రమాదవశాత్తు కార్మికులు పైనుంచి కిందపడినా వారి ప్రాణాలు కాపాడేందుకు వీలుగా భవనం చుట్టూ ఏర్పాటు చేయాల్సిన సేఫ్టీ నెట్స్ అక్కడ ఎక్కడా కనిపించలేదు. అలాగే, ఎత్తులో పనిచేసే కార్మికు లకు విధిగా అందించాల్సిన సేఫ్టీ బెల్టులు హార్నెస్, తలకు రక్షణగా ఉండే హెల్మెట్లు, కాళ్లకు సేఫ్టీ షూస్ వంటి కనీస రక్షణ పరికరాలను కూడా కాంట్రాక్టర్ వారికి సమకూ ర్చలేదని స్పష్టమవుతోంది.

నాసిరకం కర్ర తో కాకుండా పటిష్టమైన ఇనుప పైపులతో స్టీల్ స్కాఫోల్డింగ్ మంచెను ఏర్పాటు చేసి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. సదరు భవన నిర్మాణ కాంట్రాక్టర్, యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని తోటి కార్మికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.