యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలి
- యాదవ సంఘం మండల అధ్యక్షులు దోమకొండ కృష్ణకాంత్ యాదవ్ డిమాండ్
గంభీరావుపేట,(విజయక్రాంతి): శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమితులైన పోచబోయిన శంకరమ్మ యాదవ్‌పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయనను వెంటనే పదవి నుండి తొలగించాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల యాదవ సంఘం అధ్యక్షుడు దోమకొండ కృష్ణకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్లెక్సీలో తన తండ్రి ఫోటో లేదనే కారణంతో 82 ఏళ్ల యాదవ బీసీ మహిళను అవమానపరచడం అత్యంత అనుచితమని తీవ్రంగా విమర్శించారు.
ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాల్సిందిపోయి, బహిరంగంగా ఒక మహిళను అవమానించడం సరైనది కాదన్నారు.శంకరమ్మకు వెంటనే క్షమాపణలు చెప్పాలని, అలాగే శివచరణ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా యాదవ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కృష్ణకాంత్ యాదవ్ హెచ్చరించారు.






