అక్రమంగా పశువులను తరలిస్తే చర్యలు
మంచిర్యాల డీసీపీ భాస్కర్
మంచిర్యాల, మే 19 (విజయక్రాంతి): రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో అక్రమంగా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపన్పల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ను డీసీపీ సందర్శించి, చెక్పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో అక్రమ జంతు రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతోందన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చెక్పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పశువుల సంతలు, బక్రీద్ పండుగ దృష్ట్యా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల పనితీరు తదితర అంశాలపై అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
జిల్లాలో ఎక్కడైనా చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను అక్రమంగా రవాణా చేయడం, వధించడం పూర్తిగా నిషేధమని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని హెచ్చరించారు. పశువుల అక్రమరవాణా, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
మహారాష్ట్ర వైపు నుంచి అక్రమ ధాన్యం (వడ్లు) రవాణా జరగకుండా వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖలతో సమన్వయం చేసుకుని తనిఖీలు నిర్వహించాలని, పక్క రాష్ట్రం నుంచి వచ్చినట్లయితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. డీసీపీ వెంట జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, కోటపల్లి ఎస్త్స్ర రాజశేఖర్, భీమారం ఎస్త్స్ర రాజేందర్ లు ఉన్నారు.






