8 June, 2026 | 1:45 AM

అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య

08-06-2026 12:00 AM

తెలుగు సాహిత్యరంగానికి దాశరథి రంగాచార్య ఒక అమూల్య సంపద. ముఖ్యంగా తెలంగాణ సా యుధ పోరాట సమయంలో వెట్టి ఎంత పాతుకుపోయి ఉన్నదో, నాటి జాగీర్దార్ల అరాచకాలతో సగటు మనిషి ఎం త క్షోభను అనుభవించాదో.. ఇత్యాది విషయాలను అక్షర బద్ధం చేసి చారిత్రక నవలు రాసిన అరుదైన రచయిత ఈయన.

అందుకే ఆయన్ను ‘ఆంధ్రా గోర్కీ’ అని ముద్దుగా సాహితీ ప్రియులు పిలుచుకుంటారు. ఎందుకంటే.. రష్యా విప్లవ కాలంలో గోర్కీ కూడా ప్రజల జీవితాలను తన కథల్లోకి తీసుకొచ్చారు. అంతటి మహా రచయిత పేరును రంగాచార్యకు ఉపయోగించారంటే, ఈయన ఎంతటి రచయితో ఇట్టే అంచనా వేయవచ్చు. నుదుట వైష్ణవ తిరునా మాలు ధరిస్తూనే, మనసులో మార్క్సిస్టు సిద్ధాంతాలను ఆరాధించడం ఈయన ప్రత్యేకత.

భిన్న వైరుధ్యాల అద్భుత కలయికే రంగాచార్యను ఒక విశిష్ట వ్యక్తిగా నిలిపింది. ఒక చేత్తో విప్లవ పంథాను అనుసరిస్తూనే, మరో చేత్తో అమూల్యమైన వేదాలను తెలుగులోకి అనువదించారు. తెలం గాణ సాయుధ పోరాటంలో పెన్నును గన్నుగా మార్చిన సాహసి ఆయన. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన ధీశా లి. అణచివేతపై ధిక్కార స్వరం వినిపించిన అభ్యుదయ సారస్వత గోపురం ఆయన. రంగాచార్య 1928 ఆగస్టు 24న జన్మించారు. ఆయన స్వస్థలం నాటి వరంగల్ జిల్లా చిన్నగూడూరు.

వారిది సనాతన సంప్రదాయ కుటుంబం. ఇరుగూ పొరుగూ నీడ పడితే మైల పడిపోతామనే ఛాం దస వాతావరణం ఇంట్లో ఉండేది. మడి కట్టుకుంటే తెలు గు మాట్లాడకూడదనే నియమాలు ఉండేవి. నాటి నిజాం రాజ్యంలో ఉర్దూ అధికార భాషగా చలామణి అయ్యేది. పాఠశాలల్లో ఉర్దూ మాధ్యమం మాత్రమే అందుబాటులో ఉండేది. ఇంటా బయటా తెలుగు భాషపై తీవ్ర నిరాదరణ వ్యక్తమయ్యేది. ఇన్ని అడ్డంకులు ఉన్నా దాశరథి సోదరులు తెలుగు భాషపై ఎనలేని మమకారం పెంచుకున్నారు. రం గాచార్య వచన రచనను ఎంచుకుని కాల్పనిక సంప్రదాయ సాహిత్యంలో అనితర సాధ్యమైన స్థాయికి చేరుకున్నారు.

అన్యాయాన్ని ఎదిరించే తత్వం

అన్యాయాన్ని ఎదిరించే తత్వం రంగాచార్యకు బాల్యం నుంచే అలవడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్భవించిన వందేమాతరం ఉద్యమం నిజాం రాజ్యమంతటా పాకింది. పాఠశాల ప్రార్థన సమయంలో వందేమా తరం చదివి రంగాచార్య ఉపాధ్యాయుల చేతిలో దెబ్బలు తిన్నారు.

ఆరో తరగతి చదువుతున్న సమయంలో నిజాం నవాబు విధించిన బడుల్లో కుచ్చుటోపీ సంస్కృతిని నిరసించారు. గాంధీ టోపీ ధరిస్తామని విద్యార్థులతో సమ్మె చేయించి విజయం సాధించారు. ఈ తిరుగుబాటు కారణంగా ఆయన పాఠశాల నుంచి బహిష్కరణకు గుర య్యారు. దీంతో చదువు ఆరో తరగతితోనే ఆగిపోయింది. కానీ, ఆయన అక్షర పోరాటం మాత్రం ఆపలేదు. వామపక్ష భావజాలం రంగాచార్యను తీవ్రంగా ఆకర్షించింది. ఆంధ్ర మహాసభలో చేరి గ్రామగ్రామాన ప్రజలను చైతన్యపరిచారు. రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేసి వయోజనులకు అక్షరాలు నేర్పారు.

నాటి ప్రభుతను ఎదిరించి మరీ తన గ్రామంలోకి పత్రికను తెచ్చారు. మార్క్సిస్టు సాహిత్యాన్ని విపరీతంగా అధ్యయనం చేశారు. తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటం ఉధృతమైనప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లారు. తుపాకీ కాల్చడంలో శిక్షణ తీసుకున్నారు. భూస్వాములు నిజాం పాలకులు కలిసి ఆయన్ను చెరసాలలో బంధించా రు. జైలు గోడల మధ్య కూడా ఆయన పోరుబాటను వదలలేదు. చెరసాల నుంచి తప్పించుకుని అజ్ఞాతంలో ఉం టూ ఉద్యమాన్ని నడిపించారు. పోలీస్ యాక్షన్ తర్వాత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. వ్యవస్థలో మార్పు వస్తుందని ఆశించిన రంగాచార్యకు నిరాశే ఎదురైంది.

ప్రజలను పీడించిన పాత దొరలే ఖద్దరు చొక్కాలు వేసుకుని గాంధీ టోపీలు ధరించి రాజకీయ నాయకులుగా అవతారమెత్తారనే నిశ్చితాభిప్రాయం రంగాచార్యకు ఉండేది. ఆ కపట వాతావరణంలో ఆయన ఇమడలేకపోయారు. రాజకీయాలకు దూరంగా జరిగి స్వయంకృషితో చదువుకున్నారు. 1951లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. ఆ తర్వాత 1957 లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అనువాదకుడిగా చేరారు. అక్కడ అసిస్టెంట్ కమిషనర్ హోదా వరకు ఎదిగి 1988లో పదవీ విరమణ పొందారు.

తేటతెలుగులోకి నాలుగు వేదాలు

నాలుగు వేదాలను తేటతెలుగు వచనంలోకి అనువదించారు రంగాచార్య. ఒకప్పుడు వేదాలు కొందరికే పరిమితమనే నిషేధం ఉండేది. ‘ప్రజలకు వేదం’ అనే నినాదంతో రంగాచార్య వేద ఉద్యమాన్ని చేపట్టారు. కోట్ల నిధులున్న ధర్మసంస్థలు కూడా చేయలేని పనిని ఆయన ఒక్కరే చేసి చూపించారు. వేదావిష్కరణోత్సవంలో ఒక స్త్రీకి ఒక దళిత యువకుడికి వేద ప్రతులు అందించి సామాజిక విప్లవాన్ని సృష్టించారు. ఉపనిషత్తులను అందించారు. రుగ్వేద శాంఖాయన బ్రాహ్మణం, ఋగ్వేద ఐతరేయ బ్రాహ్మణం అనువదించారు.

వేదాల పరిచయ గ్రంథాలు రాశారు. తన యాత్రా విశేషాలతో ‘యాత్రా జీవనం’ రచించారు. జీవిత చరమాంకంలో ‘ఉపదేశగీత’ పేరుతో భగవద్గీతను అందించారు. తన గ్రంథాలలో ‘ఆలోచనామృతం’ పేరుతో విమర్శనాత్మక వ్యాఖ్యలు జోడించేవారు. ప్రాచీన సాహిత్యమంతా పుక్కిటి పురాణాలు కావని, మానవజాతిని మహోన్నత దిశగా తీసుకెళ్లే అమృతమని చెబుతుండేవారు. చైనా యుద్ధ సమయంలో వచ్చిన కవితలను ‘రణభేరి’ గా సంకలనం చేశారు. రంగాచార్య ఆత్మకథ ‘జీవనయానం’ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉద్గ్రంథం.

ఇది కేవలం ఆయన వ్యక్తిగత కథ కాదు. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రకు నిలువుఉటద్దం. రజాకార్ల దౌష్ట్యం, తెలంగాణ సాయుధ పోరాటం, ఆంధ్రప్రదేశ్ అవతరణ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వంటి అనేక అంశాలను తేదీలతో సహా కచ్చితంగా నమోదు చేశారు. ఒక రచయిత తన చేవ్రాలుతో 38 వేల పేజీల సాహిత్యం రాయడం, అది ప్రచురణ రూపంలో 17 వేల పేజీలు రావడమనే రికార్డు.. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండి ఉండదు. ఆ రికార్డు ఒక్క రంగాచార్యపైనే ఉంది.  ఆయన 2015 జూన్ 8న తనువు చాలించారు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటిన అభినవ వ్యాసుడిగా ప్రజల గుండెల్లో రంగాచార్య కలకాలం నిలిచిపోతారు.

రచనలపై అల్వార్‌స్వామి ప్రభావం

నాటి రచయిత వట్టికోట అల్వార్ స్వామి ప్రభా వం రంగాచార్యపై ఎక్కువగా ఉంది. అల్వార్ స్వామి తెలంగాణ పోరాట చరిత్రను నవలలుగా రాయాలని సంకల్పించారు. అలా వెలువడిందే ‘ప్రజల మనిషి’ నవల. తర్వాత ‘గంగు’ రాస్తూ అల్వార్ స్వామి అర్ధాంతరంగా కన్నుమూశారు. ఆ బాధ్యతలను రంగాచార్య భుజాన వేసుకున్నారు. కవిత్వం కన్నా కథలే ప్రజల హృదయాలను నేరుగా తాకుతాయని నమ్మారు. గ్రామీణ ప్రజల మట్టి బతుకులను చిత్రించేందుకు నవలా రచనను ఆయుధంగా మార్చుకున్నారు. తెలంగాణ మాండలికంలో ‘చిల్లర దేవుళ్లు’ నవల రాశారు. ఇది అఖండ ప్రజాదరణ పొంది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చిపెట్టింది.

ఈ నవల చలనచిత్రంగా కూడా రూపాంతరం చెందింది. నవలలో రంగాచార్య 1938 నాటి తెలంగాణ గ్రామీ ణ ప్రజల దుర్భర బానిస బతుకులను కళ్లకు కట్టారు. తర్వాత వచ్చిన ‘మోదుగుపూలు’ నవల తెలంగాణ సాయుధ పోరాటాన్ని అక్షర బద్ధం చేసింది. నాటి ఒక జాగీరులోని కోయ ప్రజల అమాయకత్వాన్ని రంగాచార్య నవలలో చూపించారు. ప్రజలంతా ఏకమై చివరకు నిరంకుశ తహసీల్దారును హతమార్చిన ఘటనతో నవల ముగుస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి రెండు దశాబ్దాల సామాజిక మార్పులను ‘జనపదం’ నవలలో రాశారు.

నగర సమస్యల ఇతివ త్తంతో ‘మారు మనుషులు’ రాశారు. ‘మానవత’ నవ ల ద్వారా మతాలు వెలిసిపోయే రంగులని, మానవత్వమే నిరంతరం ఉండే ఘనత అని సందేశమి చ్చారు. ఒక బ్రాహ్మణుడికి ఒక హరిజనుడికి మధ్య ఉన్న ఉదాత్తమైన స్నేహాన్ని ‘శరతల్పం’ నవలలో ఆవిష్కరించారు. స్వాతంత్య్ర వెలుగులు ప్రసరించని గ్రామాల దోపిడీని, టీచరమ్మ మంగ చైతన్యాన్ని ‘పావని’లో వివరించారు.  

శ్లోక