ప్రజావాణికి అధికారులందరూ హాజరు కావాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, మార్చి 2 (విజయ క్రాంతి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.
సోమవారం ఐ.డీ.ఓ.సీ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఇంచార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ తో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. అయితే ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజర్ అయ్యారు.
దీనిని గమనించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గైర్హాజర్ అయ్యే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని అన్నారు.
అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




